స్వలింగ పెండ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టు కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్ ఏకగ్రీవ తీర్పు

స్వలింగ పెండ్లిళ్లకు  చట్టబద్ధత కల్పించలేం.. సుప్రీంకోర్టు కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్ ఏకగ్రీవ తీర్పు

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులు చేసుకునే పెండ్లిళ్లకు చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద లీగల్‌‌గా గుర్తింపును ఇవ్వలేమని చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించి చట్టాన్ని మార్చే అంశం పార్లమెంటు పరిధిలో ఉందని తెలిపింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. 

స్వలింగ సంపర్కులకు సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది. అయితే స్వలింగ జంటలు తమ పెండ్లిళ్లను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయరాదని పేర్కొంది. కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన కీలక తీర్పుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా స్వాగతించాయి. ఎల్‌‌జీబీటీక్యూఐఏ++  కమ్యూనిటీ, యాక్టివిస్టులు, పిటిషనర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సుప్రీం ప్రస్తావించిన పాజిటివ్ అంశాలపై కొందరు హర్షం వ్యక్తం చేయగా.. చట్టబద్ధత కల్పించలేమని చెప్పడంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉన్నత వర్గాల కాన్సెప్ట్ కాదు..

ప్రత్యేక వివాహ చట్టం కింద సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్ట బద్ధత కల్పించేందుకు నిరాకరిస్తూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌‌ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌‌ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ పీఎస్ నరసింహాతో కూడిన బెంచ్ ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. అయితే కొన్ని అంశాలపై జడ్జిలు విభేదించారు. సీజేఐ, జస్టిస్ కౌల్, జస్టిస్ భట్, జస్టిస్ నరసింహ వేర్వేరుగా తీర్పులు చెప్పారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని చేసిన విజ్ఞప్తులు.. అర్బన్ ఉన్నత వర్గాల భావనను ప్రతిబింబిస్తున్నాయంటూ కేంద్రం చెప్పడాన్ని విమర్శించింది. ఇలాంటి పెండ్లి చేసుకోవడమనేది అర్బన్ లేదా ఉన్నత వర్గాలకు చెందిన కాన్సెప్ట్ లేదా లక్షణం కాదని స్పష్టం చేసింది. అర్బన్‌‌ ఏరియాలకో, ఉన్నత వర్గాలకో ఇది పరిమితం కాదని చెప్పింది.

దత్తత తీసుకోలేరు.. 3:2 మెజారిటీతో తీర్పు

స్వలింగ సంపర్కులు.. పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్‌‌లోఏకాభిప్రాయం కుదరలేదు. పెండ్లి కాని వాళ్లు, స్వలింగ సంపర్కులు.. పిల్లల్ని దత్తత తీసుకోకుండా నిషేధించే దత్తత నిబంధనల్లో ఒక దాన్ని 3:2 మెజారిటీతో ధర్మాసనం సమర్థించింది. పిల్లల్ని దత్తత తీసుకోకుండా నిషేధించే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (సీఏఆర్‌‌‌‌ఏ) గైడ్‌‌లైన్స్‌‌ చట్ట విరుద్ధమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కౌల్ వేర్వేరుగా తీర్పు చెప్పారు. అయితే సీఏఆర్‌‌‌‌ఏ గైడ్‌‌లైన్స్‌‌ను సమర్థిస్తూ జస్టిస్ భట్, జస్టిస్ కోహ్లీ, జస్టిస్ నరసింహా తీర్పు చెప్పారు.

స్వలింగ సంపర్కులూ దత్తత తీసుకోవచ్చు: సీజేఐ

కోర్టులు చట్టాలు చేయలేవని, కానీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ చెప్పారు. ‘‘వివాహ వ్యవస్థ అనేది స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదు. ప్రత్యేక వివాహ చట్టాన్ని ఒకవేళ రద్దు చేస్తే.. మనం మళ్లీ స్వాతంత్ర్యానికి ముందున్న స్థితికి వెళ్లినట్లే. అయితే ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చే విషయం పార్లమెంట్‌‌ పరిధిలోనిది’’ అని అన్నారు. స్వలింగ సంపర్కులకు కొన్ని హక్కులు కల్పించడంపై సీజేఐతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ కౌల్ చెప్పారు. స్వలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కుల పెండ్లిళ్లను.. ఒకే నాణేనికి రెండు వైపులుగా చూడాలని అన్నారు. ‘‘స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి. 

భవిష్యత్తు పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకోలేని వయసులో ఉన్న వారికి లింగమార్పిడి శస్త్రచికిత్సలు జరగకుండా చూడాలి’’ అని సీజేఐ సూచించారు. ‘‘జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు మూలాల్లోకి వెళ్తుంది. బంధంలోకి ప్రవేశించే హక్కులోనే భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుంది. అలాంటి బంధాన్ని గుర్తించడంలో వైఫల్యం వివక్షతో కూడుకున్నది. భిన్న లింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించదు. స్వలింగ సంపర్కులు కూడా దత్తత తీసుకోవచ్చు” అని తన 247 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసు పూర్వాపరాలివీ

2018 సెప్టెంబర్ 6: పరస్పర అంగీకారంతో జరిగే అసహజ సెక్స్‌‌ను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377లోని భాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా డీక్రిమినలైజ్ చేసింది. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని చెప్పింది. 

2022 నవంబర్ 25: ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలని కోరుతూ రెండు గే జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. 

2023 జనవరి 6: సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది. ఈ విషయానికి సంబంధించి 21 పిటిషన్లు 
దాఖలయ్యాయి. 

మార్చి 12: సేమ్ సెక్స్ మ్యారేజీలను తాము వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

మార్చి 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం సిఫార్సు చేసింది.

ఏప్రిల్ 15: రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సుప్రీం నోటిఫై చేసింది. 

ఏప్రిల్ 18: వాదనలు మొదలు. 

మే 11: తీర్పు రిజర్వు

అక్టోబర్ 17: స్వలింగ సంపర్కుల పెండ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరణ

ఈ దేశాల్లో చట్టబద్ధత

స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో చట్టబద్ధత ఉంది. స్వలింగ సంపర్కులు పెండ్లిళ్లు చేసుకోవడం అక్కడ లీగల్‌‌. సేమ్ సెక్స్ మ్యారేజీలను ఇటీవల ఆండోరా దేశం గుర్తించింది. ఈ దేశాల జాబితాలో వచ్చే ఏడాది నుంచి ఈస్టోనియా కూడా చేరనుంది. 2024 నుంచి అక్కడ సేమ్ సెక్స్ మ్యారేజీలకు చట్టబద్ధత కల్పించనున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో, బ్రిటన్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, అమెరికా, డెన్మార్క్, బ్రెజిల్, చిలీ, జపాన్, స్లొవేనియా తదితర దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్టబద్ధత కల్పించాయి.

స్వలింగ సంపర్కులు చేసుకునే పెండ్లిళ్లను లీగల్‌‌గా గుర్తించలేం. ఈ విషయంలో చట్టాన్ని మార్చే అంశం పార్లమెంటు పరిధిలో ఉంది. వారికి సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అయితే స్వలింగ జంటలు తమ పెండ్లిళ్లను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయకూడదు. 

సుప్రీంకోర్టు