
టర్నోవర్@బిలియన్ డాలర్లు
పర్యావరణ అనుకూల ప్రొడక్టులపై ఫోకస్
న్యూఢిల్లీ : హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) తన లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసినట్లు ప్రకటించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్‌గా ఇది ఎదిగిందని తెలిపింది. సబ్బులు, వాషింగ్ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్‌లో హెచ్‌యూఎల్ ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్ ఎక్సెల్ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇండియాలో మొత్తం కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగంలో ఈ ప్రత్యేకతను సాధించిన అతి కొద్ది బ్రాండ్‌లలో సర్ఫ్ ఎక్సెల్ ఒకటిగా నిలిచిందని హెచ్‌యూఎల్ శుక్రవారం తెలిపింది. ఏడాదికి రూ.51,193 కోట్ల రెవెన్యూతో ఇండియాలోనే అతిపెద్ద ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీగా హెచ్‌యూఎల్ రికార్డులకు ఎక్కింది. “అత్యున్నత క్వాలిటీ, సమర్థవంతమైన మార్కెటింగ్ వల్ల సర్ఫ్ఎక్సెల్ ఈ మైలురాయిను చేరుకుంది. ‘దాగ్ అచ్చే హై' (మరక మంచిదే) పేరుతో మేం ఇచ్చిన ప్రకటనలు కన్జూమర్లను ఆకట్టుకున్నాయి. అంటే మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం”అని కంపెనీ తెలిపింది.
భారీ ఫ్యాక్టరీతో విస్తరణ
హెచ్‌యూఎల్ 2022లో ఉత్తరప్రదేశ్‌లో భారీ ఫ్యాక్టరీని నెలకొల్పడం ద్వారా సర్ఫ్ ఎక్సెల్ తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. సర్ఫ్ ఎక్సెల్, వీల్, విమ్ వంటి బ్రాండ్‌లతో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.16,578 కోట్ల రాబడిని కంపెనీకి తెచ్చిపెట్టింది. యూనిలీవర్ ఆర్&డీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ, ఇండియా కోసం స్పెషల్ ప్రొడక్టులను సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ తెస్తోంది. దేశవ్యాప్తంగా బాగా విస్తరించింది. ప్రొప్రైటరీ టెక్నాలజీ, వాషింగ్ మెషీన్ స్పెషలిస్ట్ ప్రొడక్టులు, డిటర్జెంట్ లిక్విడ్‌లు, లిక్విడ్ క్యాప్సూల్స్, స్టెయిన్ రిమూవల్ స్ప్రేలతో తమ సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ మార్కెట్లోకి దూసుకెళ్లిందని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హోమ్ కేర్) దీపక్ సుబ్రమణియన్ చెప్పారు. పేరెంట్ కంపెనీ యునిలీవర్ క్లీన్ ఫ్యూచర్‌పై ఫోకస్‌తో పర్యావరణ అనుకూల ప్రొడక్టులను తయారు చేస్తోంది. దీనికి అనుగుణంగా ఇండియాలోనూ ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ప్రొడక్టులకు వాడే బాటిల్స్‌లో 50శాతం రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్‌నే వాడుతున్నారు. ఈ బాటిల్స్ తయారీ కోసం 100 శాతం బయోడిగ్రేడబుల్ యాక్టివ్‌లనే ఉపయోగిస్తున్నామని దీపక్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.