చైనాలో జీరో కొవిడ్​ పాలసీపై మర్లవడ్డ కార్మికులు

చైనాలో జీరో కొవిడ్​ పాలసీపై మర్లవడ్డ కార్మికులు
  • ఫాక్స్​కాన్​ కంపెనీలో టెన్షన్
  • కరోనా కట్టడికి ఆంక్షలను కఠినంగా అమలుచేస్తున్న చైనా
  • బయటికొచ్చిన కార్మికులపై.. లాఠీచార్జ్​ చేసి, టియర్​ గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

బీజింగ్: చైనాలో అమలు చేస్తున్న కరోనా కఠిన నిబంధనలు టెన్షన్లకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్​ తయారీ కంపెనీ అయిన ఫాక్స్​కాన్​లో వేలాది మంది కార్మికులు క్వారంటైన్​లో ఉన్నారు. వీరికి ఎలాంటి సౌలత్​లు లేవు. దీనికితోడు అక్కడే పనిచేస్తున్న వారికి కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వారంతా బుధవారం ప్రభుత్వంతో పాటు కంపెనీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

పీపీఈ కిట్లు వేసుకుని పోలీసుల లాఠీచార్జ్

సెంట్రల్ సిటీ జెంగ్‌‌‌‌జౌలో ఫాక్స్​కాన్ ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ 2లక్షల మంది దాకా కార్మికులు పనిచేస్తుంటారు. బుధవారం ఉదయం తాత్కాలిక వసతి గృహాల నుంచి కార్మికులు ఫ్యాక్టరీ బయటికెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని గార్డులు, పీపీఈ కిట్లు వేసుకున్న పోలీసులు అడ్డుకున్నారు. వారిపై కార్మికులు తిరగబడ్డారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్​ చేసి.. టియర్​ గ్యాస్​ ప్రయోగించారు. ఇనుప రాడ్లు, కర్రలతో చావబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

చెప్పిన జీతం ఇస్తలేరంటున్న కార్మికులు

నెలన్నర కింద కూడా లాక్​డౌన్​తో పాటు కఠినమైన పని నిబంధనల కారణంగా లక్ష మంది కార్మికులు గోడలు దూకి పారిపోయారు. దీంతో ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని రోజుల కింద భారీ జీతం ఆఫర్​ చేసి లక్ష మందిని కంపెనీ జాయిన్​ చేసుకుంది. 2 నెలలు పనిచేస్తే రూ.3 లక్షల దాకా ఇస్తామని కంపెనీ చెప్పిందని ఓ ఉద్యోగి తెలిపాడు. ఇక్కడికొచ్చాక మళ్లీ 2నెలలు పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పాడు. చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని వివరించాడు. ఒప్పందం ప్రకారమే జీతం..: ఫాక్స్​కాన్​ కార్మికులకు ఇచ్చే జీతంపై జరుగుతున్న ప్రచారాన్ని ఫాక్స్​కాన్​ హెడ్డాఫీస్​ ఖండించింది. ఒప్పందం ప్రకారమే జీతం చెల్లిస్తున్నామని చెప్పింది.