స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..పెళ్లికి చెత్త డబ్బా గిఫ్ట్

స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..పెళ్లికి చెత్త డబ్బా గిఫ్ట్

ధరి దేవి ఆలయం.. ఉత్తరాఖండ్‌‌‌‌లో ఉంది. అలకనందా నది మధ్యలో పిల్లర్లపై దీన్ని కట్టారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ గుడిలోని అమ్మవారిని దర్శించుకోవాలంటే.. సన్నని వంతెనపై నడిచి వెళ్లాలి. అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి ప్రతి ఆదివారం ఒక ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ కూడా వచ్చేవాడు. ఆయన రాక ఆ గుడి పరిసరాలనే మార్చేసింది. ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండే ఆ గుడికి వెళ్లేదారి, మెట్లు ఇప్పుడు క్లీన్‌‌‌‌గా మారాయి. దీనంతంటికీ కారణం..

ఆ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌కు కొన్ని వారాల పాటు గుడికి వెళ్లిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అదేంటంటే.. వచ్చి పోయే భక్తులంతా ప్లాస్టిక్‌‌‌‌ వేస్టేజ్‌‌‌‌, చెత్త ఆ వంతెనపై, ఎంట్రన్స్‌‌‌‌లో పడేస్తున్నారు. దాంతో ఆ పరిసరాలన్నీ ఎండిపోయిన పూలు, ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు, ఖాళీ వాటర్‌‌‌‌‌‌‌‌ బాటిళ్లతో నిండిపోయింది. చెత్త పడేస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి అలా చేయడం తప్పు అని ఆ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. కానీ.. ఆ వ్యక్తి ‘మరెక్కడ పారేయమంటావ్‌‌‌‌’ అని అడిగాడు. దానికి ఆ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే.. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఒక్క డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌ కూడా లేదు. అంతేకాదు ‘ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు’ అని ఒక్క చోట కూడా సైన్‌‌‌‌ బోర్డు లేదు. అప్పుడు ఆ యువ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ భువన్‌‌‌‌ రావత్‌‌‌‌కు వచ్చిందే ఈ ‘డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌’ ఐడియా.

భువన్‌‌‌‌ ఆ తర్వాత స్థానికంగా ఉన్న కిరాణ షాపుల నుంచి కొన్ని నూనె డబ్బాలను సేకరించి తీసుకొచ్చాడు. దుకాణాల్లోకి వెళ్లి నూనె డబ్బాలు అడిగితే.. ‘ఈ పనికి రాని డబ్బాలు ఏం చేసుకోవడానికి తీసుకెళ్తున్నాడు’ అని ఆశ్చర్యంగా చూశారు. భువన్‌‌‌‌ ఆ డబ్బాలు తీసుకొచ్చి రంగులు వేశాడు. ఆపై హిందీలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించే స్లోగన్స్‌‌‌‌ రాశాడు. మరుసటి ఆదివారం టెంపుల్‌‌‌‌కు వెళ్లేటప్పుడు వాటిని వెంట తీసుకెళ్లి, గుడికి వెళ్లే దారిలో పెట్టాడు. ప్రతి పది మెట్లకు ఒక డబ్బా ఉంచాడు. దాంతో భక్తులు డబ్బాల్లో చెత్త వేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతం పరిశుభ్రంగా మారిపోయింది. ఆయన ప్రయాణం అంతటితోనే ఆగిపోలేదు. చాలా గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాడు. అలా ఇప్పటి వరకు ఎన్నో గ్రామాలు తిరిగి డస్ట్‌‌‌‌బిన్లు పంచాడు. ఆ ప్రాంతంలో పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగినప్పుడు డస్ట్‌‌‌‌బిన్లు గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.
మంచు కొండలు చెత్తతో నిండొద్దనే

భువన్‌‌‌‌.. ఉత్తరాఖండ్‌‌‌‌లోని బద్రీనాథ్‌‌‌‌కు దగ్గరలో నేపాల్‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాడు. ఉద్యోగం కోసం చాలా రోజులు ఢిల్లీలో ఉండి తిరిగి సొంతూరుకి వచ్చాడు. కానీ.. ఇక్కడి పరిస్థితులను చూసి చాలా బాధపడ్డాడు. ఆ అందమైన మంచు పర్వతాలు ప్లాస్టిక్‌‌‌‌, చెత్తా చెదారంతో నిండిపోకూడదనుకున్నాడు. అందుకే ధరిదేవి ఆలయంతో ‘మేరా గావ్‌‌‌‌–స్వచ్ఛ గావ్‌‌‌‌’ను మొదలుపెట్టాడు. ఇప్పుడు అది చాలా గ్రామాలకు విస్తరించింది. ప్రజలకు డస్ట్‌‌‌‌బిన్‌‌‌‌లోనే చెత్త వేసేలా అవగాహన కల్పించాడు. ఆ చెత్తను ప్రభుత్వం సూచించిన డంపింగ్‌‌‌‌ జోన్‌‌‌‌లకు చేర్చుతున్నాడు. అంతేకాదు ఆ చెత్తను రీ–సైకిల్ చేసే పనిని స్థానిక స్క్రాప్‌‌‌‌ దుకాణదారులకు అప్పగించాడు. వాళ్లు చెత్తలో చాలా భాగం రీసైక్లింగ్‌‌‌‌ చేస్తున్నారు. కానీ.. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన సక్సెస్‌‌‌‌ కాదు. దీని వెనక ఆయన శ్రమ ఎంతో ఉంది.

క్లీనింగ్‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌

ఇప్పుడు కోట్‌‌‌‌ గ్రామంతో పాటు చాలా గ్రామాల్లో ప్రజలంతా కలిసి స్వచ్ఛతా డ్రైవ్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలలో మొదటి, మూడు ఆదివారాల్లో ఊరంతా శుభ్రం చేసుకుంటున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ రెండు రోజులూ ఊరి కోసమే పని చేస్తున్నారు. ఈ రెండు రోజులూ ఆ ఊరంతా పండగలాగే ఉంటుంది. ఊళ్లో పెద్దవాళ్లు పాటలు పాడుతూ.. కథలు చెప్తూ ఉత్తేజపరుస్తుంటారు. మిగతా వాళ్లంతా వీధులు ఊడ్చి, చెత్త నుంచి ప్లాస్టిక్‌‌‌‌ను వేరుచేసి.. కేటాయించిన డబ్బాల్లో వేస్తారు.

పెళ్లిళ్ళ గిఫ్ట్స్ కూడా ఇవే..

భువన్‌‌‌‌ ఈ ప్రాంతంలో ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. ఈ ఊళ్లలో ఎక్కడ శుభకార్యం జరిగినా గిఫ్ట్‌‌‌‌గా కార్డ్‌‌‌‌బోర్డ్‌‌‌‌ డస్ట్‌‌‌‌బిన్‌‌‌‌ ఇస్తున్నాడు. దాంతో ఈ ఏరియాలో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు.

ఏ శుభకార్యమైనా డస్ట్‌‌‌‌బిన్లే గిఫ్ట్‌‌‌‌గా ఇస్తున్నారు. వాటిని పార్టీ తర్వాత రోజు పరిసరాలను శుభ్రం చేసి చెత్త వేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్కూల్‌‌‌‌ పిల్లలకు కూడా భువన్‌‌‌‌ అవగాహన కల్పిస్తున్నాడు. చిన్నతనంలోనే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన రావాలంటాడు భువన్‌‌‌‌.

ముందు వద్దన్నారు..

ఆయన ముందుగా ‘కోట్‌‌‌‌కండరా’ అనే గ్రామానికి వెళ్లాడు. ఊరి వాళ్లందరినీ ఒకచోటకి చేర్చి స్వచ్ఛ ప్రోగ్రాం గురించి చెప్పాడు. అప్పుడు ప్రజలంతా దాన్ని వ్యతిరేకించారు. ‘మేము చాలా పేదవాళ్లం. చెత్త సేకరించడానికి దాని నిర్వహణకు డబ్బు ఖర్చు చేయలేం’ అని చెప్పారు. అప్పుడు అర్థమైంది భువన్‌‌‌‌కు.. ప్రజల్లో స్వచ్ఛత అంటే ‘ఖర్చుతో కూడుకున్న పని’ అనే భావన ఉన్నదని. అందుకే ఆయన తన ఆయిల్‌‌‌‌ డబ్బా డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ గురించి చెప్పాడు. స్వచ్ఛత కోసం పైసా ఖర్చు చేయనక్కర్లేదు అని వివరించాడు. అప్పటినుంచి ఆ గ్రామ ప్రజలు ఖాళీ డబ్బాలు, కార్డ్‌‌‌‌బోర్డ్‌‌‌‌ కాటన్లను డస్ట్‌‌‌‌బిన్‌‌‌‌లుగా వాడడం మొదలుపెట్టారు. ఇంట్లో ఉన్న పనికిరాని ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులను రీయూజ్‌‌‌‌ చేయడం నేర్పించాడు. దాంతో పాత ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్లను కట్‌‌‌‌ చేసి వాటిలో చెట్లు పెట్టడం, పక్షులకు నీళ్లు పోసేందుకు వాడడం మొదలుపెట్టారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించాడు. చిప్కో ఉద్యమం గురించి వివరించి వాళ్లలో స్ఫూర్తిని నింపాడు. హైజీన్‌‌‌‌, ఆరోగ్యం, భద్రతల గురించి అందరికీ చెప్పాడు.