దేశవిదేశాల్లో ఇండియా గొంతు వినిపిస్తున్న అక్బరుద్దీన్

దేశవిదేశాల్లో ఇండియా గొంతు వినిపిస్తున్న అక్బరుద్దీన్

దూకుడే ఆయన మంత్రం

సున్నితంగా చెప్పినా

వార్నింగ్ ల ఘాటెక్కువే

దేశవిదేశాల్లో ఇండియా గొంతు వినిపిస్తున్న అక్బరుద్దీన్

ప్రచారానికి దూరం.. పాక్​కు సింహస్వప్నం

న్యూఢిల్లీ: కాశ్మీర్​విషయంలో కలగజేసుకోలేమంటూ యునైటెడ్​నేషన్స్​సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టంచేసిన వేళ పాకిస్తాన్, చైనా​ప్రతినిధుల గొంతు వణుకుతుండగా.. కాశ్మీర్ అంశం​ మా సొంత వ్యవహారమని ఓ వాయిస్​హుంకరించింది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరంటూ పరోక్షంగా హెచ్చరించింది. దీనిపై ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలంటూ పాక్​కు వార్నింగ్​ఇచ్చింది. టెర్రరిజానికి గుడ్​బై చెప్పాకే మీతో చర్చలకు ముందుకొస్తామని తేల్చిచెప్పింది.. అంతర్జాతీయ వేదికపై ఇండియా గొంతును ధీమాగా వినిపించిన ఆ గొంతు మరెవరిదో కాదు యూఎన్​లో మన రాయబారి, సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత ప్రతినిధి సయ్యద్​అక్బరుద్దీన్​ది. యూఎన్​భద్రతా మండలి మీటింగ్​సందర్భంగా శుక్రవారం ఆయన ప్రదర్శించిన దూకుడు ఇండియన్ల మనసు గెలుచుకుంది. 1986 బ్యాచ్​కు చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి సయ్యద్​గతంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించారు. ప్రచార ఆర్బాటాలకు దూరంగా ఉండే సయ్యద్.. కామ్​గా పనిచేసుకుపోతుంటారని ఆయన కొలీగ్స్​చెప్పారు.

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..

పుల్వామా అటాక్​ జరిగిన తర్వాత ఓ అమెరికన్ ​టీవీ చానెల్ అక్బరుద్దీన్​ను ఇంటర్వ్యూ చేసింది. టెర్రర్​అటాక్​పై ఇండియా ఎలా స్పందించబోతోంది? రివెంజ్​తీర్చుకోవడానికి మిలిటరీ యాక్షన్​ తీసుకునే అవకాశం ఉందా.. అంటూ ఇరుకున పెట్టించేలా యాంకర్ తో ప్రశ్నలు అడిగించింది. అడిగిన ప్రతీ ప్రశ్నకూ జవాబిస్తూనే ఎలాంటి కాంట్రవర్సీకి, విచారణకు ఆటంకం కలగకుండా అక్బరుద్దీన్ తెలివిగా వ్యవహరించారు. మిలిటరీ యాక్షన్​తీసుకోబోతున్నారా అన్న ప్రశ్నను తిప్పికొడుతూ.. ఇండియా తరఫున మీరే ముందుగా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకర్థం కావడంలేదంటూ యాంకర్​కు చురకలు వేశారు. జరిగిన దాడిని యూఎస్​సభ్య దేశాలన్నీ ఖండించాలని, టెర్రర్​సంస్థల నాయకుల లిస్ట్​ను ప్రిపేర్​చేయడానికి సహకరించాలని, టెర్రరిజాన్ని రూపుమాపడానికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఆ ఇంటర్వ్యూ ద్వారా అక్బరుద్దీన్​ప్రపంచానికి పిలుపునిచ్చారు.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా 2013లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అంతర్జాతీయ మీడియా సంధించిన ప్రశ్నలకు సమర్థవంతంగా జవాబిచ్చారు. ఆ సమావేశానికి హాజరైన విలేకరులను పేర్లతో పిలిచి మరీ వారి ప్రశ్నలకు జవాబిచ్చారు. చిక్కు ప్రశ్నలకూ తడబడకుండా, వివాదాలకు తావివ్వకుండా సూటిగా జవాబిచ్చారు. ఎక్కడా అరుపుల్లేవు, వాదనల్లేవు, ప్రశ్నలడిగిన ఒక్కో పేరును పలుకుతూ జవాబివ్వడంతో విలేకరులు ఆశ్చర్యపోయారు.  2017లో భారత న్యాయమూర్తి దల్వీర్​భండారి అంతర్జాతీయ న్యాయస్థానానికి రెండోసారి ఎన్నికవడంలో అక్బరుద్దీన్​కృషి చాలా ఉంది. అయితే, దీనికి ఆయన క్రెడిట్​తీసుకోకుండా.. బయటికి కనిపించే శక్తి తానొక్కడినే కానీ జస్టిస్​ భండారి ఎన్నికలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సహకరించారని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

2019 జులైలో జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్​లో అక్బరుద్దీన్ ​మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి టెర్రరిజం ఎలా అడ్డంకులు సృష్టిస్తుందో వివరించారు. పాక్​పేరెత్తకుండానే టెర్రరిజానికి సపోర్ట్​ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. దావూద్​ఇబ్రహీం, డి కంపెనీలతో పాటు టెర్రర్​సంస్థలకు ఆశ్రయమిచ్చి ప్రోత్సహిస్తోందంటూ పాక్​ను కడిగిపారేశారు. క్లైమెట్​చేంజ్​విషయంలో ఇండియా కమిట్​మెంట్​ను ప్రపంచానికి స్పష్టంగా చాటిచెప్పారు. ఈ ఏడాది జులై 28న యూఎన్​హెడ్​క్వార్టర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో నారతో తయారుచేసిన బ్యాగులను పంచిపెట్టారు. ప్లాస్టిక్​ వాడకాన్ని బ్యాన్​చేసి, ఈ బ్యాగులను ఉపయోగించండి అంటూ వారిని కోరారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా నూలు వడుకుతున్న గాంధీ చిత్రాన్ని ఆ బ్యాగులపై ముద్రించారు.