తైపీ: తైవాన్‌పై డ్రాగన్ మళ్లీ కాలుదువ్వింది. ఆదివారం 27 చైనా విమానాలు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించాయి. 18 ఫైటర్ జెట్లు, ఐదు హెచ్-6 బాంబర్లు, ఒక వై-20 ఏరియల్ రిఫ్యూలింగ్ ట్యాంకర్ ఉన్నట్లు తైవాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. చైనా విమానాలు చొరబడిన వెంటనే తమ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయని, వెనక్కి వెళ్లిపోవాలని చైనా విమానాలను హెచ్చరించామని తెలిపింది. ముందు జాగ్రత్తగా మిస్సైల్ సిస్టమ్‌ను మోహరించినట్లు పేర్కొంది. తమ సైనిక అధికారులతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశాలు ముగిసిన వెంటనే విమానాల చొరబాటు చోటుచేసుకుంది. ‘‘చైనా బాంబర్లు, ఆరు ఫైటర్ జెట్లు తైవాన్‌కు దక్షిణంగా బాషి చానెల్‌లోకి వెళ్లాయి. తర్వాత చైనాకు తిరిగి వెళ్లే ముందు పసిఫిక్‌లోకి ప్రవేశించాయి” తైవాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
