పట్టుబట్టింది జవాన్‌ అయింది

V6 Velugu Posted on Oct 04, 2021

ఆమె తండ్రి ఓం ప్రకాశ్​ ఇరవై రెండేళ్లు ఆర్మీలో పనిచేశాడు. తండ్రిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని కూతురు కూడా ఆ దారినే ఎంచుకుంది. బీ.ఎస్.​ఎఫ్​ జవాన్​గా దేశానికి సేవలందించాలి అనుకుంది. అదే విషయం ఇంట్లో చెబితే వద్దన్నారు. బోర్డర్​లో కాపలా చావుతో సావాసమే అన్నారు. అయినా భయపడలేదు. దేశం కోసం ఇంట్లో వాళ్లతో పోరాడి గెలిచింది. పారా మిలటరీ బలగాల్లో కేవలం రెండు శాతమే ఉన్న మహిళా జవాన్లలో తన పేరుని చేర్చుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్​లో చేరిన మొదటి అమ్మాయిగా రికార్డుకెక్కిన ఆమె పేరు కాంచన్ యాదవ్.

ఆమె గురించి మరిన్ని విషయాలు.. 

‘‘ఏ కూతురికైనా నాన్నని  మించిన సూపర్​ హీరో ఉండడు. అయితే నాకు మాత్రం నాన్న  హీరోనే కాదు ఇన్​స్పిరేషన్​, బెస్ట్​ గైడ్​ కూడా.  ఇరవై రెండేళ్లు కుటుంబానికి దూరంగా ఉండి దేశానికి సేవ చేశారు నాన్న. ఆయన్ని యూనిఫాంలో చూసిన ప్రతిసారీ ఏదో  తెలియని ఎమోషన్​ . నాన్న గన్​ పట్టుకున్న  ఫొటోలు చూసినప్పుడల్లా  ఆయనలా బోర్డర్​కి వెళ్లాలన్న బలమైన కోరిక. ఈ విషయమే డిగ్రీలో ఉన్నప్పుడు నాన్నతో చెప్పా. దేశం కోసం సేవ చేయాలన్న నీ ఆలోచన గొప్పదే. కానీ,  ఆడపిల్లలు బోర్డర్​లో పనిచేయడం నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదన్నారు.  నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అమ్మ మాత్రం నా కలని అర్థం చేసుకుంది. నాన్నని ఒప్పించే ప్రయత్నం చేసింది. అలా ఎన్నో  ప్రయత్నాల తర్వాత నాన్న ఒప్పుకున్నారు. 
ట్రైనింగ్​ ఇలా.. 
డిగ్రీ చదువుతున్నప్పుడు బీఎస్​ఎఫ్​కి అప్లై చేశా. ఆ మరుసటి రోజు నుంచే ఫిజికల్​ టెస్ట్​  కోసం ట్రైనింగ్​ మొదలుపెట్టా.  రోజులో సగం గ్రౌండ్​లోనే గడిపా. ఫుడ్​ విషయంలోనూ చాలా కేర్​ తీసుకున్నా. ఈ జర్నీలో నా కోచ్​ నియాజ్​ అండగా నిలిచారు నాకు. రూపాయి కూడా ఫీజు  తీసుకోకుండా  ట్రైనింగ్​ ఇచ్చారాయన. మా అందరి కష్టానికి ఫలితంగా 2018లో సెలక్ట్​ అయ్యానని రిజల్ట్​ వచ్చింది. కానీ, కరోనా వల్ల ఏడాది తర్వాత ట్రైనింగ్​ మొదలైంది. ఫిజికల్​ ట్రైనింగ్​తో పాటు ఆరునెలల ​ బేసిక్​ ట్రైనింగ్​ కూడా పూర్తిచేసుకున్నా.  
ఈ మధ్యే వెస్ట్ బెంగాల్​లోని బైకుంఠ్‌​పూర్​లోని బీ.ఎస్.ఎఫ్ ట్రైనింగ్ సెంటర్​లో 146  నెంబర్​ బీ.ఎస్​. ఎఫ్​ డ్రెస్​  తీసుకున్నా.  ఆ రోజు జీవితంలో మర్చిపోలేను. అతి త్వరలో  డ్యూటీలో జాయిన్​ అవ్వబోతున్నాను’’అని తన గురించి చెప్పింది కాంచన్​. 
గర్వంగా ఉంది
దేశం మీద ప్రేమతో ఆర్మీలో చేరా. ఇరవై రెండేళ్ల సర్వీస్​లో  ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్నా. ఇప్పుడు నాలాగే నా బిడ్డ కూడా దేశం కోసం బీ. ఎస్ ఎఫ్​లో చేరడం గర్వంగా ఉంది. అయితే మొదట కాంచన ఆర్మీలో చేరతానంటే భయపడ్డా. ఎందుకంటే బోర్డర్​లో ఎప్పుడు, ఎటునుంచి  ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అలాగే అక్కడ సైనికులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలియనివి కావు. అందుకే తను ఆర్మీలో చేరతానంటే వద్దన్నా. కానీ, తల్లితో కలిసి నన్ను ఒప్పించింది. అనుకున్నది సాధించింది. ఇప్పుడు నన్ను కాంచన్ తండ్రిగా గుర్తిస్తూ మాట్లాడుతున్నారు అంతా అంటున్నాడు ఓం ప్రకాశ్​.                                                                                          :::  డి. మహేశ్వర్​ప్రసాద్​, కాగజ్​నగర్​, వెలుగు


మహిళలు రెండు శాతమే 
చదువు, పెళ్లి, కుటుంబం గురించి ఎప్పుడూ కలలు కనలేదు. ఊహ తెలిసినప్పట్నించీ ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దాన్ని చేరుకోవడానికి నాకిష్టమైన చాలా వాటికి దూరమయ్యా. చివరికి నా కోచ్​ నియాజ్​, ఫ్యామిలీ సపోర్ట్​తో అనుకున్నది సాధించా. అయితే ఇక్కడే ఆగిపోవాలి అనుకోవట్లేదు. బీ.ఎస్.ఎఫ్​లో సీనియర్ సుపీరియర్ ఆఫీసర్ అవ్వాలన్నదే నా గోల్. ప్రస్తుతం పారా మిలటరీ బలగాల్లో  రెండు శాతమే మహిళలు ఉన్నారు.  ఆ సంఖ్య పెరగాలంటే ఆడపిల్లలు ముందుకురావాలి. వాళ్లకి తల్లిదండ్రులు, సమాజం అండగా ఉండాలి.                                                                                                                                                                                         - కాంచన్ యాదవ్

Tagged inspiration, life style, father, daughter, jawan,

Latest Videos

Subscribe Now

More News