పరిచయం: సంగీత ప్రయాణం నటనతో మలుపు..

పరిచయం: సంగీత ప్రయాణం నటనతో మలుపు..

అనూష మణి.. మాటలు నేర్చే సమయంలోనే పాటలు కూడా నేర్చుకుంది. ఇంట్లో వాళ్లంతా సంగీత కళాకారులే కావడంతో శిక్షణ కూడా సులువైంది. కానీ, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తను అసలు సంగీతాన్ని కెరీర్​గా మార్చుకోవాలనుకోలేదట! అయినా సంగీతం ఆమెను వదల్లేదు.  అంతేనా తన భర్త సంగీత్​ కూడా సింగర్ కావడం మరో విశేషం. వాళ్లదీ సంగీత నేపథ్య కుటుంబమే. ఇదంతా ఒక ఎత్తైతే ఆమె సింగర్​ మాత్రమే కాదు లిరిసిస్ట్​ కూడా. అయితే ఇప్పుడు సడెన్​గా ఆమె మ్యూజికల్ జర్నీ యాక్టింగ్​తో మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న ‘హాయ్ జునూన్’ సిరీస్​తో నటనలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు కొనసాగిన తన సంగీత ప్రయాణంలో ఇంట్రెస్టింగ్​ సంగతులివి. 

అనూష మణిది ముంబై. తండ్రి భారతి మణి, తల్లి జమున, సోదరుడు హరిహరన్​ మణి. అనూషది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఇంట్లో అందరూ సంగీత శిక్షణ తీసుకున్నవారే. దాంతో బుడిబుడి అడుగులు వేసే రోజుల నుంచే స్వరాలను పలికించడం ఆరంభించింది అనూష. శ్రీమతి మీరా నాథన్​ దగ్గర కర్నాటిక్ మ్యూజిక్​లో శిక్షణ తీసుకుంది.2014లో సింగర్​ సంగీత్​ హల్దిపుర్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. 2015లో
శాన్​దార్ సినిమాలో పాడిన గులాబో పాట ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.  

ప్రొఫెషన్​గా అనుకోలేదు

నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను. కానీ, దాన్నెప్పుడూ ప్రొఫెషన్​గా తీసుకోలేదు. కాలేజీలో జరిగే మ్యూజికల్ యాక్టివిటీలు, కల్చరల్ ఈవెంట్స్ వంటివాటిల్లో కూడా సరదాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. నేను పాటలు పాడడానికి వేర్వేరు ప్రదేశాలకు ప్రోగ్రామ్స్​కి వెళ్లేదాన్ని. ఒకసారి ప్రోగ్రామ్​కి వెళ్లినప్పుడు అమిత్​ త్రివేదితో పరిచయం అయింది. మేం ఇద్దరం కలిసి ఒక ఆల్బమ్​ కూడా రిలీజ్​ చేయాలనుకున్నాం. ఆల్బమ్​ అయితే కంపోజ్ చేశాం కానీ, అది రిలీజ్ కాలేదు. దాన్ని మ్యూజిక్ కంపోజర్ శంకర్​కి వినిపించా. దాంతో సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. 

అదే 2007లో రిలీజ్ అయిన ‘జానీ గద్దర్’​ సినిమాలో ధోఖా అనే పాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత థోడా ప్యార్ థోడా మ్యాజిక్, దేవ్​ డి, ఐషా, గేమ్, చెన్నై ఎక్స్​ప్రెస్ వంటి సినిమాలకు పాటలు పాడా. అంతేకాదు.. అప్పట్లో అమిత్​తో కలిసి చేసిన ఆల్బమ్​లోని సాంగ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విన్నారు. ఆయనకు ఆ పాట ఎంత నచ్చిందంటే దాన్ని ‘దేవ్​ డి’ సినిమాలో వాడారు. అలా నాకు పని దొరకడంతో నెమ్మదిగా నేను పాడడానికే పుట్టానేమో అనే రియలైజేషన్​కి వచ్చాను. అమిత్ త్రివేది, శంకర్​ గ్రూప్​లతోనే ఎక్కువ పాటలు పాడాను. వాళ్లిద్దరి మ్యూజిక్ కంపోజిషన్​కి అసలు పోలికే ఉండదు. 

వర్కింగ్ స్టైల్​లో ఇద్దరూ డిఫరెంట్. అమిత్​తో ఎంతోకాలంగా పాటలు పాడుతున్నా కాబట్టి ఆ కంఫర్ట్ లెవల్​ ఉంటుంది. ఇక శంకర్​ గ్రూప్​లో పాడడం చాలా సరదాగా ఉంటుంది. క్రియేటివ్ స్పేస్​ ఇస్తారు. చాలా ఇన్​పుట్స్ ఇస్తుంటారు. తద్వారా పాడడం మరింత సులభమవుతుంది. సింగర్​గా నా గొంతుకు రొమాంటిక్ సాంగ్స్ పాడడంలో కంఫర్ట్ ఉంటుంది. కానీ, ఒక గాయనిగా నేను అలా చెప్పలేను. ఒకే రకం పాటలు పాడగలను అని కూడా డిసైడ్ చేయకూడదు. 

పాటల పోటీల విషయానికొస్తే.. అవి టాలెంట్​ని ఆధారం చేసుకుని జరుగుతాయి. వాటి మీద నాకు నమ్మకం ఉంది. ఒక కాంపిటీషన్​ వల్ల కొత్త టాలెంట్ బయటికొస్తుంది. కొత్తవాళ్లకు ఒక ప్లాట్​ఫాం దొరుకుతుంది. పోటీ కాబట్టి పార్టిసిపేట్ చేసేవాళ్లంతా పాట పాడేటప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారు. ఒక షోలో గెలవాలంటే టాలెంట్​తోపాటు అదృష్టం కూడా ఉండాలి. కోరస్ సింగింగ్ పాడడం చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ఎక్స్​పీరియెన్స్ నాకు చాలా నేర్పించింది. 

మనల్ని మనం బిజీ చేసుకోవాలి

మ్యూజిక్ ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితులున్నారు. నా జర్నీలో అన్నీ మంచివే కాదు.. చెడ్డరోజులూ ఉన్నాయి. అన్నీ చూశాను కాబట్టే ఒదిగి ఉండడం అలవాటైంది. ప్లాన్ చేసుకుని పని చేసే రకం కాదు నేను. నా దారిలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వెళ్తానంతే. నన్ను బాధించే వాటిని లేదా వ్యక్తుల్ని చూసినప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్థాయిని తొక్కేయడానికి గతంలో కొందరు ప్రయత్నాలు చేశారు. 

వాటి గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. అందుకని దాన్నుంచి బయటకు రావాలంటే మనల్ని మనం బిజీ చేసుకోవాలి. ఇతరుల మాటలు  అస్సలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలాంటివాళ్లకు  మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు నాతో ఏదైనా సమస్య  ఉంటే అది వాళ్ల ప్రాబ్లమ్. ఇండస్ట్రీలో నేను గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిశాను. వాళ్లతో కలిసి పని చేశాను. అది నాకు ప్రొఫెషన్​ పరంగా తృప్తిని ఇచ్చింది. 

ఫైనల్ డెసిషన్ నాదే

నా మాతృభాష తమిళం. పుట్టి పెరిగింది ముంబై కావడంతో మరాఠీ, హిందీ కూడా ధారాళంగా మాట్లాడతా. చిన్నప్పుడు మా నాన్న మరాఠీ నాట్య సంగీత్​లో వచ్చే పాటలను వినమని చెప్పేవారు. అలా మొదట్నించీ ఆ పాటలు వినడం, పాడడం వల్ల వాటికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. నాకు ఇతర భాషల్లో పట్టు ఉండడం వల్ల జింగిల్స్ పాడేటప్పుడు కంఫర్ట్ లెవల్స్ డెవలప్ అయ్యాయి. ఇకపోతే మా ఆయన కూడా సింగర్​ కావడం వల్ల నేను ఎంచుకునే పాటల విషయంలో సలహాలు అడుగుతా. 

ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. కళాకారులమైన మేం ఇద్దరం క్రియేటివ్​గానే కాక.. ఇండిపెండెంట్​గానూ ఉంటాం. కాబట్టి ఎవరు ఏం చేయాలనేది చెప్పుకోం. కానీ, మా ఉద్దేశాలు షేర్ చేసుకుంటాం. ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం. మా ఇద్దరి ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను, సంతోషాలను పంచుకుంటాం. ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడం వల్ల అన్ని విషయాలకూ కనెక్ట్ అవుతాం.

బంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తా:

నేను సింగర్ మాత్రమే కాదు..ఖాళీ టైంలో పాటలు, కవితలు రాస్తుంటా. అంతేకాదు.. ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్​ వస్తే నాలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకోవడానికి పేపర్ మీద పెట్టేస్తా. దానివల్ల నాకు చాలా రిలీఫ్​ దొరుకుతుంది. కొన్నిసార్లు నా పెట్ డాగ్​తో టైం స్పెండ్ చేస్తా. అంతేకాదు.. నేను ఎప్పుడైనా దిగులుగా ఉంటే నాకు సపోర్ట్ చేయడానికి నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారు. రిలేషన్​షిప్స్​కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. మనం ఏం చేసినా, చేయకపోయినా రోజు గడిచిపోయే టైంకి మనతో ఉండేది ఆ బంధాలే. అవే అన్నింటినీ విలువైనవిగా మారుస్తాయి.