తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ అఫ్గానిస్థాన్ లోని అమెరికా ఆర్మీ స్థావరానికి 3 మైళ్ల దూరంలో కొన్నేళ్లపాటు ఉన్నాడని, ఆయనను పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమైందని డచ్ జర్నలిస్టు బెట్టె డామ్ “సెర్చింగ్ ఫర్ ఎనమీ” బయాగ్రఫీలో వెల్లడించారు. 9/11 దాడుల తర్వాత ముల్లా ఒమర్ పాకిస్థాన్ కు పారిపోయినట్లు అమెరికా భావించింది. అయితే జాబుల్ ప్రావిన్స్ లో అమెరికా ఆర్మీ స్థావరానికి దగ్గరలోనే ముల్లా ఒమర్ ఉన్నట్లు బెట్టె డామ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. 2013లో ఆయన చనిపోయే వరకు ముందు చాలా ఏళ్లు అఫ్గాన్ లోనే ఉన్నట్లు వెల్లడించారు.
2004లో తను తలదాచుకున్న ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో అమెరికా ఆర్మీ స్థావరం నిర్మిస్తోందని తెలిసిన తర్వాతే ఒమర్ అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లినపోయినట్లు పుస్తకంలో తెలిపారు. ముల్లా ఒమర్ పై పుస్తకం రాసేందుకు ఐదేళ్లకు పైగా రీసెర్చ్ చేసిన బెట్టె డామ్ అతడి బాడీగార్డ్ జబ్బార్ ఒమరిని ఇంటర్వ్యూ చేశారు. సాయంత్రం బీబీసీలో పష్తూ భాషలో వచ్చే వార్తలను ముల్లా ఒమర్ వినేవాడని, ఒసామా బిన్ లాడెన్ మరణం గురించి ఆయనకు తెలుసని జబ్బార్ చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు సార్లు ముల్లా ఒమర్ తలదాచుకున్న చోటికి అమెరికా భద్రతాదళాలు వెళ్లాయన్నారు. ఒకరోజు పెరట్లో ఉండగా అమెరికా భద్రతా సిబ్బంది వచ్చారని, వెంటనే కట్టెల కుప్ప వెనక్కి వెళ్లి దాక్కొన్నట్లు జబ్బార్ ఒమరి చెప్పారని పుస్తకంలో వెల్లడించారు. మరోరోజు ఒమర్ దాక్కున్న ఇంట్లో అమెరికా సైనికులు తనిఖీలు చేపట్టారు. అయితే అందులోని ఓ రహస్య గదిని మాత్రం వారు గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.
