తాబేలు నడకన  తాలిపేరు ఆధునికీకరణ

తాబేలు నడకన  తాలిపేరు ఆధునికీకరణ
  •  14 ఏండ్లుగా పూర్తికాని అదనపు గేట్ల బిగింపు

భద్రాచలం,వెలుగు: భద్రాచలం మన్యంలో ప్రధాన సాగునీటి వనరు తాలిపేరు ప్రాజెక్టు డెవలప్​ మెంట్​​ వర్క్స్ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జపాన్​ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో చేపట్టిన పనులు 14 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా మూడు అదనపు గేట్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.ఎస్టిమేషన్​ కాస్ట్ పెరిగింది. కాంట్రాక్టరు చేతులెత్తేయడంతో తిరిగి నిర్మాణం చేపట్టేందుకు తాలిపేరు ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రపోజల్స్ పంపించారు. అనుమతి వచ్చి టెండర్లు పిలిస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

2009లో జపాన్​ బ్యాంకు నిధులతో...

భద్రాచలం డివిజన్​లోని చర్ల మండలం పెదమిడిసిలేరులో తాలిపేరు ప్రాజెక్టు ఉంది. 24,700 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం 74  మీటర్లు. ఛత్తీస్​గఢ్​ దండకారణ్యం నుంచి వాగులు, వంకల ద్వారా ఈ జలాశయానికి నీరు వస్తుంది. కరవు పరిస్థితుల్లోనూ సైతం  ఈ ప్రాజెక్టు కింద రెండు పంటలు పండిన దాఖలాలు ఉన్నాయి. 1978లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 2009లో జపాన్​ బ్యాంకు నిధులు రూ.45 కోట్లు మంజూరు చేసింది. 25 గేట్లు ఉన్న ప్రాజెక్టును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అదనంగా మరో మూడు గేట్లు నిర్మించాలని డిజైన్​ చేశారు.విద్యుదీకరణ, కట్ట లైనింగ్,  జనరేటర్​ బిల్డింగ్​ఇతర పనులు చేర్చి పనులు పూర్తి చేశారు. పనులు ఆలస్యం కావడం వల్ల సిమెంట్, స్టీలు ఇతర రేట్లు పెరగడంతో ఒక్కసారిగా ఎస్టిమేషన్​ కాస్ట్ డబుల్​ అయ్యింది. రూ.90.75 కోట్లకు పెరిగింది. మధ్యలో బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టరు తప్పుకున్నాడు. బిల్లులు రాకుండా తాను పనులు చేయలేనంటూ చేతులెత్తేశాడు. రూ.54 కోట్ల వరకు పనులు జరిగాయి. అయితే ఆగిన దాంట్లో మూడు అదనపు గేట్ల నిర్మాణ పనులు ఉన్నాయి.   గోడల వరకు మాత్రమే నిర్మాణం జరిగింది. తాలిపేరులో ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. అందుకే ప్రాజెక్టు రక్షణ దృష్ట్యా అదనంగా మూడు గేట్లను నిర్మించాలని డిజైన్​ చేశారు. గతంలో ఒక గేటు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది.  కానీ ఆ పనులే ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 14 ఏళ్ల పాటు పనులు జరగడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపోజల్స్ పంపినం: తిరుపతి, డీఈ, తాలిపేరు

ఆగిన పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రపోజల్స్ పంపినం. గేట్ల ఏర్పాటు, వాటిని పైకి లేపడానికి రోప్స్ ఇతర పనుల కోసం టెండర్లు పిలిచి షురూ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తం. ఇంకా రూ.12 కోట్ల వరకు పనులు జరగాల్సి ఉంది.  

గేట్ల బిగింపు త్వరగా పూర్తి చేయాలి ఇందల: బుచ్చిబాబు, రైతు, ఆర్. కొత్తగూడెం, చర్ల

మూడు అదనపు గేట్లు పూర్తయితే రిజర్వాయర్​లో నీటిని నిల్వ ఉంచవచ్చు. వరద ఉధృతికి 25 గేట్లు ఎత్తివేసి గోదారిలోకి వదులుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ఆదుకోవాలి. ఈ ఏడాది 8 వేల ఎకరాలకు యాసంగికి నీళ్లు లేని పరిస్థితి. వానొచ్చి ఆదుకుంది. లేకుంటే పంటలు ఎండిపోయేవి. తాలిపేరు డెవలప్మెంట్​ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి.