_uHbXdmYxh8.jpg)
హైదరాబాద్, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరం (2023---– -24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. టార్గెట్ సాధించేందుకుగానూ ఈ ఏడాదిలో ప్రారంభం కానున్న 4 కొత్త ఓపెన్ కాస్టు గనుల నుంచి ఉత్పత్తిని పెంచాలన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల తో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో అత్యధికంగా 671 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 418 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ సాధించామని సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు.
5 ఏరియాలు, 11 ఓపెన్ కాస్ట్ గనులు, 8 అండర్ గ్రౌండ్ మైన్స్ 100 శాతం కన్నా ఎక్కువ ఉత్పత్తి లక్ష్యాలను సాధించినందుకు కార్మికులు, ఉద్యోగులను అభినందించారు. అదే స్ఫూర్తితో ఈయేడు కూడా టార్గెట్స్ పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ సంవత్సరంలో ఒడిశా నైనీ ఓపెన్ కాస్ట్ , కొత్తగూడెంలోని వీకే ఓపెన్ కాస్ట్ , ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ ఎక్స్‌టెన్షన్, గోలేటి ఓసీ నుంచి తీసే 104 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కీలకమన్నారు. నైనీ బొగ్గు బ్లాకు నుంచి ఈ ఏడాది 60 లక్షల టన్నులు, వచ్చే యేడు 100 లక్షల టన్నులు, ఆ తర్వాత నుంచి ఏటా 150 లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కొత్తగూడెంలో వీకే ఓపెన్ కాస్ట్ కు అన్ని అనుమతులు సాధించామని, అటవీ అనుమతులు కూడా రానున్నాయని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు.
కేంద్రం వేలంలో ఉన్న సింగరేణికి సంబంధించిన నాలుగు గనులను తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. మరో ఐదేళ్ల లో ప్రైవేటు సంస్థల నుంచి సింగరేణికి గట్టి పోటీ ఎదురుకానుందని.. ఉత్పాదకతను పెంచుకుంటేనే సంస్థ మనుగడ సాధ్యమన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్. బలరామ్, డి.సత్యనారాయణ రావు, ఎన్.వి.కె. శ్రీనివాస్, అడ్వైజర్ సురేంద్ర పాండే, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, జీఎం ఎం.సురేష్, సీహెచ్ నరసింహారావు, కె. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.