టొమాటోతో టేస్టీ వంటలు

టొమాటోతో టేస్టీ వంటలు

టొమాటో పచ్చడి, కూర, పప్పు.. ఇలా టొమాటోతో రెగ్యులర్​గా వంటలు చేస్తుంటారు కదా. అయితే, ఈసారి రెగ్యులర్ టొమాటోలతో కాస్త వెరైటీగా ఈ వంటలు ట్రై చేసి, టేస్ట్ చేయండి.

బెంగాలీ ఖేజర్ చట్నీ 

కావాల్సినవి :

టొమాటోలు – నాలుగు
ఎండు మిర్చి – రెండు
పసుపు – అర టీస్పూన్
చక్కెర – ఒక టీస్పూన్
కర్జూరాలు – పది
ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్
మామిడి తాండ్ర – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నూనె – సరిపడా
ఆవాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతులు, సోంపు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

తయారీ :

ఒక పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతులు, సోంపు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, పసుపు కలిపి, మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత చక్కెర, గింజలు తీసేసిన కర్జూరాలు, ఎండుద్రాక్ష, మామిడి తాండ్ర వేసి కలపాలి. మూతపెట్టి ఐదు నిమిషాలకొకసారి కలుపుతూ ఉడికించాలి. చివర్లో వేగించిన జీడిపప్పులు కూడా కలపొచ్చు. దీన్ని పెసరపప్పుతో చేసిన కిచిడీతో తింటే టేస్ట్​ అదిరిపోతుంది. బెంగాలీ వాళ్లు రెగ్యులర్​గా చేసుకుంటారు. వాళ్ల పెండ్లిండ్లు, ఫంక్షన్లలో ఈ రెసిపీ కచ్చితంగా ఉంటుంది.  

క్లియర్ సూప్

కావాల్సినవి :

టొమాటోలు – ఆరు
నీళ్లు – ఒకటిన్నర లీటర్
ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
క్యారెట్ (తరిగి) – ఒకటి
కొత్తిమీర – కొద్దిగా
అల్లం – ఒక టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
బిర్యానీ ఆకు – ఒకటి
మిరియాలు – ఐదు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – సరిపడా

తయారీ :

ఒక పాన్​లో నీళ్లు పోసి వేడి చేయాలి. వాటిలో టొమాటో, క్యారెట్, ఉల్లిగడ్డ తరుగు, పసుపు, కొత్తిమీర, దంచిన అల్లం, మిరియాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. మూత పెట్టి ఓ మాదిరి మంట మీద పావుగంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లన్నీ వడకట్టాలి. ఆ సూప్​లో ఉప్పు కలిపి తాగితే టేస్ట్ బాగుంటుంది. డైటింగ్ చేసేవాళ్లకు ఇది బెస్ట్ సూప్. 

దేశీ బ్రుసెట్టా

కావాల్సినవి :

టొమాటో తరుగు – ఒక కప్పు
కొత్తిమీర లేదా తమలపాకు తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి తునకలు – అర టీస్పూన్
వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
ఉప్పు – సరిపడా
నిమ్మరసం – కొద్దిగా
ఆలివ్ నూనె – ఒక టీస్పూన్
 బ్రెడ్ ముక్కలు – కొన్ని

తయారీ :

ఒక గిన్నెలో టొమాటో, కొత్తిమీర తరుగు, ఎండుమిర్చి తునకలు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి కలపాలి. మరో చిన్న గిన్నెలో ఆలివ్ నూనె పోసి, అందులో చిటికెడు ఉప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేసి కలపాలి. ఆ నూనెని  బ్రెడ్ ముక్కల మీద పూయాలి. ఒక పాన్​ వేడి చేసి, దానిపై ఈ బ్రెడ్ ముక్కల్ని వేగించాలి. తర్వాత వాటిపై చీజ్​ చల్లాలి. చీజ్ కరిగాక బ్రెడ్​ ముక్కల్ని ప్లేట్​లో పెట్టి, వాటిపై టొమాటో మిశ్రమాన్ని పెట్టాలి. కావాలంటే.. ఈ ప్రాసెస్​లో వెల్లుల్లిని నూనెలో వేగించి, పొట్టు తీసి దంచిన పేస్ట్​ వాడితే టేస్ట్ బాగుంటుంది. అలాగే బ్రెడ్ వేగించకపోయినా టొమాటో మిశ్రమం పెట్టి దాన్ని ఒవెన్​లో బేకింగ్​ చేసుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ.