రెండేళ్ల తరువాత లాభాల్లో టాటా మోటార్స్​

రెండేళ్ల తరువాత లాభాల్లో టాటా మోటార్స్​
  • క్యూ 3 ప్రాఫిట్​ రూ.2,957 కోట్లు 

న్యూఢిల్లీ: కార్లతోపాటు కమర్షియల్​ వెహికల్స్​కూ​ డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో  రూ.2,957.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సంపాదించింది. సంస్థకు గడచిన రెండేళ్లలో తొలిసారిగా వచ్చిన లాభం ఇదే!  కంపెనీ గత ఏడాది కాలంలో (2022 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్) రూ.1,516 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.  అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్లో (2023 ఆర్థిక సంవత్సరం క్యూ2)నూ రూ.944.61 కోట్ల నష్టం వచ్చింది.  తాజా క్వార్టర్​లో మొత్తం ఆదాయాన్ని రూ.88,488.59 కోట్లుగా ప్రకటించింది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.72,229 కోట్ల నుండి 22.5శాతం పెరిగింది. ఈ ఆటో మేజర్  ఇబిటా11శాతం వార్షికంగా పెరిగి రూ.9,900 కోట్లకు చేరుకుంది.  మార్జిన్ 90 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 11.1శాతానికి చేరుకుంది. ఈసారి టాటా మోటార్స్​  రూ.285 కోట్ల  లాభాన్ని సాధిస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు.

తాజా క్వార్టర్​లో టాటా కమర్షియల్​ వెహికల్స్​ సెగ్మెంట్​ ఆదాయం వార్షికంగా 22.5 శాతం పెరిగి రూ.16,900 కోట్లకు చేరింది. పీవీ సెగ్మెంట్​ రెవెన్యూ 37 శాతం పెరిగి రూ.11,700 కోట్లకు పెరిగింది.  ఇదిలా ఉంటే ఇదే  లగ్జరీ కార్లను తయారు చేసే  జేఎల్​ఆర్ ఆదాయం ఇదేకాలంలో  28శాతం పెరిగి 6.0 బిలియన్​ డాలర్లకు చేరుకుంది.  వడ్డీ,  పన్నుకు ముందు ఆదాయం (ఈబీఐటీ) మార్జిన్‌‌‌‌ 230 బేసిస్​ పాయింట్లు పెరిగి 3.7శాతానికి చేరింది. ఇబిటా మార్జిన్ 10 బేసిస్​ పాయింట్లు తగ్గి 11.9శాతానికి పడిపోయింది. ‘‘గ్లోబల్​గా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇక నుంచి డిమాండ్​పెరుగుతుందని అనుకుంటున్నాం. లాభంపై మరింత ఫోకస్​ చేస్తున్నాం. సెమీకండక్టర్ల సప్లైలను పెంచుకుంటాం. ప్రస్తుతం వీటి సరఫరా బాగానే ఉంది. ముడిసరుకులు ధరలు నిలకడగానే ఉన్నాయి కాబట్టి రెవెన్యూ, మార్జిన్​ మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్​ ఫలితాలు మరింత బాగుంటాయన్నది మా కంపెనీ అంచనా”అని టాటా మోటార్స్​ ఎక్స్ఛేంజ్​ ఫైలింగ్​లో పేర్కొంది. టాటా మోటార్స్​షేర్​ బుధవారం 0.84 శాతం లాభంతో రూ.418.60 దగ్గర ముగిసింది.