
వెలుగు, స్పోర్ట్స్ డెస్క్: ప్రతీ విజేత వెనుక ఓ అలుపెరుగని కృషి ఉంటుంది. అయితే, కొన్ని విజయాల వెనుక కుటుంబ త్యాగాలు, నమ్మకం దాగి ఉంటాయి. అలాంటి కథే శుభ్‌మన్ గిల్‌ది. సాధారణంగా ఒక ఆటగాడు సక్సెస్ అవ్వడానికి డిసిప్లేన్ ( క్రమశిక్షణ), డెడికేషన్ (అంకితభావం), డెటర్మినేషన్ (దృఢ సంకల్పం) అనే మూడు ‘డి’లు మస్ట్. గిల్‌కు డ్యాడీ లఖ్వీందర్ సింగ్ రూపంలో మరో ‘డి’తోడైంది. గిల్ క్రికెటర్ అవ్వాలని డిసైడైనప్పటి నుంచి లఖ్వీందర్ కల కూడా అదే అయింది.
పంజాబ్‌లోని ఇండో–పాక్ బార్డర్‌కు పది కిలో మీటర్ల దూరంలోని గ్రామంలో సంపన్న రైతు అయిన లఖ్వీందర్.. తన కొడుకు కోసం ఉన్న ఊరును విడిచి కుటుంబంతో సహా మొహాలీకి మకాం మార్చాడు. మంచి కోచింగ్ సహా అవసరమైనవన్నీ సమకూర్చిన ఆ తండ్రి కొడుకు కల నెరవేరే వరకూ ఎన్నో త్యాగాలు చేశాడు.
క్రికెట్‌పై అతని దృష్టి మరలకుండా ఉండటానికి సౌకర్యవంతమైన గ్రామీణ జీవితాన్ని వదులుకున్న ఆ ఫ్యామిలీ విహారయాత్రలు మానుకుంది. చివరకు కొన్నేండ్ల పాటు బంధువుల పెండ్లి వేడుకలకు కూడా హాజరుకాలేదు. అత్యుత్తమ స్థాయిని చేరుకోవడానికి నిరంతరం ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో గిల్ ఫ్యామిలీ నిరూపించింది.
ఘావ్రీ గుర్తించాడు..
శుభ్‌మన్ కథలో కొన్ని అనుకోని మలుపులు, అదృష్టం కలిసొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2011లో మొహాలీలో బీసీసీఐ ఆధ్వర్యంలో పీసీఏ నిర్వహించిన పేస్ బౌలర్ల క్యాంప్ సందర్భంగా అప్పటి ఇండియా సీమర్ కర్సన్ ఘావ్రీకి బ్యాటర్ల కొరత ఏర్పడింది. పీసీఏ స్టేడియం సమీపంలో ఒక అండర్-14 మ్యాచ్‌లో శుభ్‌మన్ బ్యాటింగ్ టాలెంట్ ఘావ్రీని ఆకట్టుకుంది.
12 ఏండ్ల శుభ్‌మన్ అప్పటికే సందీప్ శర్మ వంటి యువ బౌలర్లను అలవోకగా ఎదుర్కోవడం చూసిన ఘావ్రీ సూచనతో పంజాబ్ అండర్–-14 జట్టులో చాన్స్ వచ్చింది. దీన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న గిల్.. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో దుమ్మురేపాడు. చూస్తుండగానే ఇండియా అండర్–19 టీమ్‌లోకి వచ్చేసి వరల్డ్ కప్ సైతం అందుకున్నాడు.
కెప్టెన్సీ టెస్టు పాసవుతాడా..?
ఈ తరం సూపర్ టాలెంటెడ్ ప్లేయర్లలో గిల్ ముందుంటాడు. వైట్ బాల్ ఫార్మాట్‌లో తనకు తిరుగులేదు. కానీ, టెస్టు బ్యాటర్‌గా ఇంకా మెరుగవుతున్న దశలో ఉన్నప్పుడే కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతను భుజాలపై వేసుకుంటున్నాడు. పైగా ఇంగ్లండ్ లాంటి అత్యంత క్లిష్టమైన టూర్‌లో అతనికి తొలి పరీక్ష ఎదురవుతోంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందే గిల్ లీడర్‌గా తనదైన మార్గాన్ని ఎంచుకోవడంతో పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.
టీమ్ ఆట తీరును మార్చాలా వద్దా?. మూడో నంబర్‌లోనే బ్యాటింగ్ కొనసాగించాలా..? లేదా కోహ్లీ ఆడిన నాలుగో నంబర్‌లో రావాలా..? అనేది నిర్ణయించుకోవాలి. కోహ్లీ 2014–-15 ఆస్ట్రేలియా టూర్‌లో నాలుగు సెంచరీలు కొట్టిన విధంగా ఇంగ్లండ్ సిరీస్‌లో బ్యాటర్‌గా సత్తా చాటితే గిల్ కెప్టెన్సీకి బలమైన పునాది పడనుంది. ఏదేమైనా సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత సంధి దశలో నాయకుడిగా గిల్ జట్టును సమర్థవంతంగా ముందుకుతీసుకెళ్లేందుకు ఇంగ్లండ్ టూర్ ‘శుభ్ అరంభం’ కావాలని ఆశిద్దాం.