మద్దతుదారులతో వీడియో రిలీజ్‌ చేసిన సచిన్‌ పైలెట్‌

మద్దతుదారులతో వీడియో రిలీజ్‌ చేసిన సచిన్‌ పైలెట్‌
  • 15 మంది ఎమ్మెల్యేలతో వీడియో

న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదనే అసంతృప్తితో సొంత పార్టీతో విభేదించి తిరుగుబాటు చేసిన రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ తన మద్దతుదారులతో వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వీడియో ద్వారా తనకు ఉన్న బలాన్ని నిరూపించుకున్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. సచిన్‌పైలెట్‌ వర్గం ఆ వీడియోను రిలీజ్‌ చేయగా.. వీడియోలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం వారంతా హరియాణాలోని మానేసర్‌‌లో ఉన్న ఓ రిసార్ట్‌లో మకాం వేసినట్లు సమాచారం. సచిన్‌ పైలెట్‌ ఆఫీస్‌ ఈ వీడియోను రిలీజ్‌ చేసిందని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. గెహ్లాట్‌తో కలిసి తను పనిచేయడం తనకు ఇష్టం లేదని చెప్పిన పైలెట్‌ తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. పైలెట్‌ బీజేపీతో టచ్‌లో ఉన్నారని, గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆరోపణలు వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశం నిర్వహించగా.. 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని గెహ్లాట్‌ ప్రకటించుకున్నారు. ఆ 109 మందిని జైపూర్‌‌ శివార్లలోని ఓ రిసార్టులో ఉంచారు. అక్కడే మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.