టెన్త్​ విద్యార్థిని దారుణ హత్య

టెన్త్​ విద్యార్థిని దారుణ హత్య
  • రేప్​ చేసి చంపేసినట్టు అనుమానం
  • వికారాబాద్​ జిల్లా అంగడి చిట్టెంపల్లిలో ఘోరం
  • నేరస్తులను కఠినంగా శిక్షిస్తాం: ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్/పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లాలో పదో తరగతి స్టూడెంట్ దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆపై అత్యంత పాశవికంగా ఆమెను హతమార్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టెంపల్లి గ్రామంలో జరిగింది. వికారాబాద్​ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏండ్ల బాలిక స్థానిక స్కూల్​లో టెన్త్ చదువుతోంది. సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి నుంచి బాలిక బయటకు వెళ్లింది. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పొలం గట్ల వెంబడి ఉన్న కాలువ సమీపంలోకి లాక్కుపోయారు. అక్కడే ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో బాలిక కేకలు వేసింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడాన్ని గ్రామస్తులు గమనించారు. బాలికను బండరాయితో కొట్టి గొంతు నులిమి చంపినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. స్పాట్​లో ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల నుంచి పలు విషయాలను పోలీసులు ఆరా తీశారు. కాగా, అత్యాచారం జరిగిందీ లేనిదీ పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

అత్యాచారం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్తుందనే భయంతోనే హత్య చేశారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ యువకుడి నంబర్​ బాలిక ఫోన్ కాంటాక్ట్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ కోటిరెడ్డి హామీ ఇచ్చారు.

దోషులపై కఠిన చర్యలు

వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామన్నారు. నిందితులను శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దాడుల నుంచి తప్పించుకునేందుకు బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు.