
- అడ్డంకిగా రెండు ఇరిగేషన్ ప్రాజెక్టుల వివాదాలు
- అధికారుల ఉన్నత స్థాయి సమావేశం తర్వాతా సాల్వ్కాని ప్రాబ్లమ్స్
- ఆర్ధిక అంశాలపైనా స్పష్టత కరువు
- ఒక్కసారి కూడా భేటీ కానీ ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం మరింత ఆలస్యమవుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయి 10 నెలలు అవుతున్నా.. ఇంతవరకు ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభించలేదు. సీఎస్ల స్థాయిలోని అధికారుల కమిటీ ఒకసారి సమావేశమైనప్పటికీ.. ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీంతో అధికారులు సైతం ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలపై స్పష్టత రావడం లేదని చెబుతున్నారు. పైగా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడానికి అంతర్రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై కొట్లాట నడుస్తోంది. ఇవి కూడా విభజన సమస్యలపై ప్రభావం చూపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇలాగే ఆలస్యం చేస్తే రెండు రాష్ట్రాలకు నష్టమేనని.. కొన్ని అంశాలపైనా రెండు వైపులా ఒక మెట్టు దిగితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏండ్లు కావొస్తున్నందున ఇదే విషయాన్ని ఆయా రాష్ట్రాల సీఎస్‌లు వారి సీఎంలకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేంద్రాన్ని కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సూచనలు చేయాలని కోరనున్నట్టు సమాచారం.
చర్చించారు.. వదిలేశారు!
గత ఏడాది జులైలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులు సభ్యులుగా ఉండాలని, రెండు వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
మంత్రుల కమిటీ తేల్చిన పరిష్కారాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదించాల్సి ఉండగా, మంత్రుల కమిటీ స్థాయిలో సైతం పరిష్కారం లభించని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు నేరుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కొన్ని అంశాలపై సానుకూల స్పందన వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా రూ.861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకం విషయంలో రెండు రాష్ట్రాలు ఒక అవగాహనకు వచ్చినట్టు లీకులు ఇచ్చారు. అలాగే, ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన రూ.81 కోట్ల బకాయిలను తిరిగి చెల్లించేందుకు ఏపీ అంగీకరించినట్లు చెప్పారు. అయితే, సెస్ పంపకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది.
ఇక ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు మరోసారి సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు. కానీ, భేటీ కాలేదు. ఇక 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల్లో మాత్రం అంశాలు ఎప్పటిలాగే ఎటూ తేలకుండా ఉండిపోయాయి.
రుణాల విభజనలో కోల్డ్‌వార్
విదేశీ సహాయ ప్రాజెక్టుల రుణాల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కోల్డ్వార్నడుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద రూ.8,929 కోట్లు తీసుకున్నారు. ఇందులో కొన్ని రుణాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు, మరికొన్ని తెలంగాణలోని ప్రాజెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఉదాహరణకు.. కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్ (ఆంధ్రప్రదేశ్), హుస్సేన్‌సాగర్ లేక్ డెవలప్‌మెంట్ (తెలంగాణ) వంటి ప్రాజెక్టుల రుణాలను స్థానిక ప్రాతిపదికన విభజించాలని ఏపీ వాదిస్తోంది.
అయితే, తెలంగాణ మాత్రం ఈ విభజనను ఆంధ్రప్రదేశ్ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్, 2014 సెక్షన్ 54(1) ప్రకారం జనాభా నిష్పత్తి ఆధారంగా కోరుతోంది. ఈ చట్టంలో స్థానిక ప్రాతిపదికన విభజనకు అవకాశం లేదని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రుణాల సర్దుబాటు జరిగిందని తెలంగాణ చెబుతోంది. ఇక ఏపీ చేసే వాదనతో తెలంగాణపై సుమారు రూ.1,449.75 కోట్ల అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అసలే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంపై ఇది ఇంకో భారం అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల కిందట కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల రుణాలను ఆ రాష్ట్రమే భరించాలని, రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల రుణాలను అకౌంటెంట్ జనరల్స్ సిఫారసుల ప్రకారం విభజించాలని స్పష్టం చేసింది. ఈ ఫార్ములాపైనా తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, మంత్రుల కమిటీలు భేటీ అయితేనే చాలా వాటికి పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు.