
- టార్గెట్‌లో దాదాపు రూ.45 వేల కోట్లు మైనస్
- సొంత రాబడి.. అప్పులు అన్నీ కలిపితే వచ్చింది రూ.2 లక్షల కోట్లే
- రెండు రోజుల్లో ముగుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్
- ఆర్భాటంగా ప్రకటించిన పథకాలు అసలు పట్టాలే ఎక్కలే
- ఉన్న స్కీములకు అరకొరగానే పైసలు విదిల్చిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు బడ్జెట్ అంచనాలు ఖల్లాస్ అయ్యాయి. ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం భారీ టార్గెట్లు, అంచనాలతో వేసిన లెక్కలన్నీ బొక్కబోర్లాపడ్డాయి. మరో రెండు రోజుల్లో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా.. బడ్జెట్లో ఏకంగా రూ.45 వేల కోట్ల మేర రాబడి తగ్గింది. ఈసారి పన్నులు, పన్నేతర, అప్పులు, ఇతరత్రా అన్నీ కలిపి రూ.2.45 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. కానీ ఆ మేరకు టార్గెట్ రీచ్ కావడంలో ఫెయిలైంది. సొంత ఆదాయం.. అప్పులు అన్నీ కలిపితే రూ.2 లక్షల కోట్లకే ఆమ్దానీ పరిమితమైంది. దీంతో ఆర్భాటంగా ప్రకటించిన కొన్ని పథకాలకు అరకొరగా నిధులు విడుదల కాగా.. కొన్ని స్కీములు అసలు ముంగట పడలేదు. ఫలితంగా లక్షలాది మంది అర్హులకు సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయి. బడ్జెట్ నంబర్‌ను పెద్దదిగా చూపేందుకే లెక్కలు అటు ఇటు చేయడంతో ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పైసల్లేవ్.. కొన్ని స్కీములు ఒక్కరికీ అందలే
బడ్జెట్ లెక్కల గారడీతో 2022–23లో అమలు చేస్తామని ప్రకటించిన కొన్ని పథకాలు అతీగతీ లేకుండా పోయాయి. వేల కోట్ల రూపాయలు మైనస్‌లోకి వెళ్లడంతో అనేక బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. రెగ్యులర్‌గా అమలవుతున్న పథకాలకు అరకొర నిధులు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నది. సొంత జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం, గొర్రెల పంపిణీ, దళితబంధు, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్‌లు వంటివి ఒక్కరికి కూడా అందలేదు. ఈ నాలుగైదు స్కీముల్లోనే లక్షలాది మందికి లబ్ధి జరగాల్సి ఉన్నది. నెలానెలా ఠంచన్‌గా అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ప్రతిసారీ ఆలస్యమవుతూనే వస్తున్నాయి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పథకాలకు చేసిన ఖర్చు రూ.5 వేల కోట్ల లోపే ఉన్నది. ప్రతి నెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు ఒక నెల ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇక బిల్లుల విషయానికొస్తే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, ఇసుక క్వారీలు, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల బిల్లులు, మున్సిపల్(పబ్లిక్ హెల్త్) శాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్బిల్లులు వేల కోట్లలో పేరుకుపోయాయి.
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తరో?
రాష్ట్ర సర్కార్ వాస్తవ రాబడిని పక్కన పెట్టి.. గొప్పల కోసం బడ్జెట్ అంకెలను పెంచడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొదలై పూర్తి కావాల్సిన పథకాలు కొత్త ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడ్డాయి. నిధులు సర్దుబాటు కావని ప్రభుత్వానికి ముందే తెలిసినా.. ఎలక్షన్ ఇయర్ ను దృష్టిలో పెట్టుకుని ఏడాది ఆలస్యంగానైనా కొన్ని స్కీములను ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ బడ్జెట్ ఏ మేరకు సహకరిస్తుందనే దానిపై ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భారీగా తగ్గిన నాన్ ట్యాక్స్ రెవెన్యూ
రాష్ట్ర సొంత ఆదాయంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కంట్రిబ్యూషన్, నాన్ ట్యాక్స్ రెవెన్యూపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకున్నది. జీఎస్టీ, సేల్స్‌టాక్స్, లిక్కర్ రెవెన్యూ, ఇతర పన్నులు, డ్యూటీల్లో వంద శాతం రాబడి వచ్చింది. మొత్తంగా అనుకున్న రూ.1.26 లక్షల కోట్ల పన్ను ఆదాయం దరిదాపుల్లోకి వచ్చింది. ఇందులో కమర్షియల్ టాక్స్ ద్వారా రూ.72 వేల కోట్ల మేరకు వచ్చింది. లిక్కర్‌ను టార్గెట్ పెట్టి అమ్మించింది. దీంతో వంద శాతం రూ.17,500 కోట్లు వచ్చింది. భూముల విలువలను సవరించినప్పటికీ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రూ.1,000 కోట్ల మేర తగ్గింది. మొత్తంగా పన్నులతో రాష్ట్రానికి సొంత ఆదాయం అనుకున్న మేరకే వచ్చింది. అయితే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్కంట్రిబ్యూషన్, అప్పులు తగ్గిపోయాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 68 శాతమే వచ్చింది. ఇందులో భూముల అమ్మకం ద్వారానే ప్రధానంగా రాబడి వస్తుంది. రూ.25 వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంటే రూ.17 వేల కోట్లే వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కంట్రిబ్యూషన్‌లో రూ.41 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో చూపింది. వాస్తవానికి ఇందులో రూ.14 వేల కోట్ల లోపే వచ్చింది. అప్పులకు సంబంధించి ఈసారి ఆర్ బీఐ కోతలు పెట్టింది. రూ.52 వేల కోట్లు సేకరించాలని భావిస్తే రూ.9 వేల కోట్లు తగ్గి రూ.41 వేల కోట్లు మాత్రమే అప్పు వచ్చింది. ఇలా మొత్తంగా ప్రభుత్వ ఖాజానా రూ.45 వేల కోట్ల మైనస్‌లోకి వెళ్లింది.