పశ్చిమ ఆసియా యుద్ధం చెలరేగి, ఎరువుల ధరలు 40% మేర పెరిగి, రూపాయి రికార్డు స్థాయిలో పతనమై, గోల్డ్‌మన్ సాక్స్ భారతదేశ వృద్ధి అంచనాలను తగ్గించిన మూడు వారాల తర్వాత... తెలంగాణ 2026-27 బడ్జెట్‌ను 2026 మార్చి 20న ప్రవేశపెట్టారు. 2026-27 బడ్జెట్‌లో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. బడ్జెట్ మరో ప్రపంచంలో రాసినట్లు ఉన్నది. కాగితంపై చూస్తే ఈ అంకెలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ 2026-27 బడ్జెట్ రూ. 3,24,234 కోట్లతో గత ఏడాది కంటే రూ.19,269 కోట్లు అధికంగా ఉంది. మూలధన వ్యయం రూ.36,504 కోట్ల నుంచి రూ.47,267 కోట్లకు, అంటే 29% పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి దిశగా మూలధన వ్యయంలో పెంపు ఒక నిర్ణయాత్మక మలుపు అని ఆర్థికమంత్రి అభివర్ణించారు. జాతీయ సగటు 8%తో పోలిస్తే, రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 10.7%గా ఉండటాన్ని రాష్ట్ర విధానాలు ఫలిస్తున్నాయనడానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ప్రకటించిన బడ్జెట్లో ఎంతమేరకు అప్పుగా తీసుకుంటారో పేర్కొనలేదు. అంచనా ప్రకారం రూ.7.5 లక్షల కోట్ల మొత్తం అప్పుతో, అదనంగా దాదాపు రూ.55,000 కోట్ల వార్షిక రుణభారం ఉన్న ఒక రాష్ట్రం.. అంచనా ప్రకారం రూ.65,000–80,000 కోట్ల తాజా అప్పులు అవసరమయ్యే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఈ విషయాలేవీ ప్రస్తావించకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఒక తంతు నిర్వహిస్తున్నట్టుగా ఉంది. అంతే తప్పితే నిజమైన ఆర్థిక నిర్వహణ కనపడటంలేదు.
తెలంగాణ 12 బడ్జెట్‌లను ఏటా పోల్చి చూసినప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది 2026–-27 బడ్జెట్‌లో కూడా ఎక్కడా కనిపించదు. 2025-–26 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.2,81,238 కోట్లు. ఇది ప్రతిపాదించిన రూ.3,04,965 కోట్ల బడ్జెట్ కంటే రూ.23,727 కోట్ల లోటు. అంటే బడ్జెట్ కేటాయింపులలో 7.8% ఖర్చు చేయకుండా మిగిలిపోయింది. దీనికి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. పైగా, రాబోయే సంవత్సరానికి ఇంకా పెద్ద బడ్జెట్‌ను ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో రూ. 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ సాధనాలుగా మార్చడం రుణ పునర్‌వ్యవస్థీకరణ విజయంగా పేర్కొన్నారు. అయితే, ఈ పునర్‌వ్యవస్థీకరణ రుణ చెల్లింపు కాలపరిమితిని 20–39 సంవత్సరాలకు పొడిగిస్తుందన్న విషయాన్ని చెప్పడం విస్మరించింది. ప్రభుత్వం ఈ రుణాలను 2060వ దశాబ్దం వరకు చెల్లిస్తూనే ఉంటుంది. మొత్తం చెల్లింపు బాధ్యత పెరిగింది. కేవలం వార్షిక వాయిదా మాత్రమే తగ్గింది. దీనినే ఆర్థిక వివేకంగా ప్రకటించింది. ప్రతిపక్షం కూడా కిక్కురుమనలేదు. ఇదిలా ఉండగా కొత్త పథకాలను ప్రకటించారు - 1.15 కోట్ల కుటుంబాలన్నింటినీ కవర్ చేసే సార్వత్రిక జీవిత బీమా పథకం. 1,998 రకాల వ్యాధులను కవర్ చేస్తూ, 23.51 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నగదు రహిత ఆరోగ్య పథకం. అంగన్‌వాడీ కార్యకర్తలకు కొత్త పదవీ విరమణ ప్రయోజనాలు. 7.57 లక్షల మంది ఉద్యోగులకు తలసరి రూ.1.2 కోట్ల చొప్పున ప్రమాద బీమా. వీటిలో దేనికీ బీమా సూత్రాల ప్రాతిపదిక, వ్యయ పరిమితి లేదా నిధుల సమీకరణ యంత్రాంగం గురించి సమాచారం లేదు.
మూసీ కేసు అనుమతులు,
కేటాయింపులు మధ్య తేడా
బడ్జెట్ ప్రసంగంలో ఒక వాక్యం ఉంది. దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పత్రం మూలంలో ఉన్న నిర్మాణాత్మక తప్పుడు సమాచారం బయటపడుతుంది. ‘హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా సుమారు రూ.43,592.88 కోట్ల విలువైన పనులను మంజూరు చేసింది. వీటిలో రూ.24,752 కోట్ల విలువైన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.’ 2026–27 సంవత్సరానికిగాను మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) బడ్జెట్ రూ.17,907 కోట్లు. MAUD బడ్జెట్ పద్దులో మూసీ నదీ తీర అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.1,500 కోట్లను కేటాయించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో మాత్రం మూసీనది ప్రాజెక్టుకే రూ.43,592.88 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. బడ్జెట్లో కేటాయింపు కేవలం రూ.1,500 కోట్లు. అంటే మంజూరైన వ్యయంలో 3.4 శాతం. మాతృశాఖ మొత్తం బడ్జెట్ రూ.17,907 కోట్లు. ఇది హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైన పనుల విలువ ( రూ.24,752 కోట్లు )లో సగం కన్నా తక్కువ. ఇక మంజూరైన పూర్తి రూ.43,592.88 కోట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇది పూర్తిగా భిన్నమైన మూడు విషయాలను ఒకే గాటన కట్టడం. - ఒక మంజూరు ఉత్తర్వు (కాగితంపై పరిపాలనా ఆమోదం), పనుల ప్రారంభం (చెల్లించాల్సిన ఒప్పంద బాధ్యత), బడ్జెట్ కేటాయింపు (వాస్తవంగా కేటాయించిన డబ్బు). ఆర్థికమంత్రి ప్రసంగం ఈ మూడింటినీ కేటాయింపులుగా భ్రమింపచేస్తోంది.
మూలధన వ్యయం అభివృద్ధి కాదు
మూలధన వ్యయంలో 29% పెరుగుదల 2026-–27 బడ్జెట్‌కు ప్రధానాంశం. సమస్య ఏమిటంటే, మూలధన వ్యయం ద్వారా నిధులు పొందే ప్రాజెక్టులు వ్యయాన్ని మించిన రాబడిని సృష్టించినప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. 7–8% రుణ వ్యయంతో ప్రతి ప్రాజెక్ట్ ఈ కొలమానం బట్టి చేపట్టాలి. రాబడి మార్గాలు - వినియోగదారుల ఛార్జీలు, టోల్ ఆదాయం ద్వారా ప్రత్యక్షంగా లేదా ఉత్పాదకత లాభాల మీద పడే పన్నుల ద్వారా పరోక్షంగా అయినా పరిశోధించాలి. 2026-–27 బడ్జెట్లో ఇదివరకులాగానే ఏ ప్రధాన ప్రాజెక్ట్‌కు సంబంధించిన రాబడి విశ్లేషణను అందించలేదు. వ్యయం సరే. దానివలన ఆదాయం లేదా రాబడి ప్రస్తావన ఉండడం లేదు. అందుకే ప్రస్తుతం తెలంగాణ ఖజానా మీద కనీసం పది గుదిబండలు తయారు అయినాయి. కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి, భగీరథ తదితర భారీ పథకాలు సంపూర్ణ ఆలోచన చేయకుండా మొదలుపెడితే, అప్పులు మిగులుతున్నాయి. ఫలితాలు రావడం లేదు. అవినీతి తగ్గడం లేదు. హెచ్‌ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ మోడల్ 7,450 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు. ఇందులో 40% ఇప్పుడు చెల్లించాలి, 60% 15 ఏళ్లలో వాయిదా వేయాలి. ప్రభుత్వం చెప్పని విషయం ఏమిటంటే ఫైనాన్సింగ్ ఖర్చులతో కలిపి ఈ 15 ఏళ్ల మొత్తం వార్షిక చెల్లింపుల బాధ్యత సుమారు రూ.30,000–35,000 కోట్లు ఉండవచ్చు. ఈ మొత్తం ఆర్థిక బాధ్యత ప్రస్తుత సంవత్సరపు లెక్కల్లో పూర్తిగా ప్రకటించలేదు. ఫలితం లేని పెట్టుబడి, పెట్టుబడి కాదు. ఆశావాదంతో కూడిన ఖర్చు భారం అవుతుంది.
యుద్ధభారం పట్టించుకోలేదు
పశ్చిమ ఆసియా యుద్ధం మొదలైన మూడు వారాల తర్వాత బడ్జెట్ రోజు నాటికి ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది, రూపాయి డాలరుకు రూ.93.2 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయింది. ప్రభుత్వ సెక్యూరిటీల కంటే రాష్ట్ర అభివృద్ధి రుణాలకు సంబంధించి 106 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. మార్చి 20న ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2026-–27లో వీటన్నింటికీ సంబంధించిన ప్రస్తావన ఏమాత్రం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రాష్ట్ర ఫార్మాస్యూటికల్ రంగం, తన ఎగుమతి ఆదాయంలో సుమారు 15% పశ్చిమ ఆసియా నుంచి సంపాదిస్తుంది. రైజింగ్ సమిట్‌లో ఒక ప్రతిష్టాత్మక పెట్టుబడిగా ప్రకటించిన సాఫ్రాన్ ఏవియేషన్ ఎంఆర్‌ఓ సదుపాయం, గల్ఫ్ యుద్ధం వలన నేరుగా ప్రభావితం అవుతుంది. రైజింగ్ సమిట్ నేపథ్యంలో ప్రకటించిన రూ.5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడి హామీలలో గల్ఫ్, సింగపూర్ మూలధనం కూడా గణనీయంగా ఉంది. ప్రస్తుత యుద్ధం కారణంగా ఏర్పడిన పెట్టుబడుల మీద ఒత్తిడి ఈ మూలధనం మీద ఉన్నది. అంటే, ఈ పెట్టుబడులు ఇప్పట్లో రావడం అనుమానాస్పదం. తెలంగాణ రూ. 65,000–80,000 కోట్లు రుణం తీసుకోవలసిన రాష్ట్ర అభివృద్ధి రుణాల మార్కెట్, యుద్ధానికి ముందే క్లిష్టంగా మారింది. ఆకర్షిస్తామని చెప్పుకుంటున్న ప్రైవేట్ మూలధనాన్ని యుద్ధ పరిస్థితులు వెనక్కి నెట్టాయి. ఎగుమతుల మీద ప్రభావం పడింది. గల్ఫ్ ఆదాయం తగ్గుతున్నది. యుద్ధం వలన నిరుద్యోగం పెరుగుతున్నది. జీవన ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ విషయాల ప్రస్తావన లేదు.
వ్యవసాయ కేటాయింపుల్లో నిర్లక్ష్యం
గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు అందాయి. గత ఏడాది రూ.24,439 కోట్లకు బదులుగా ఈసారి రూ.23,179 కోట్లు కేటాయించారు. యుద్ధం వలన రాబోతున్న అత్యంత తీవ్రమైన వ్యవసాయ ఉత్పాదక వ్యయాల సంక్షోభాన్ని విస్మరించి కేటాయింపులను తగ్గించింది ప్రభుత్వం. భారతదేశం ఉపయోగించే రసాయన ఎరువులలో 68.6 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఒమన్, గల్ఫ్ దేశాల నుంచి అధికంగా దిగుమతి అయ్యే యూరియా ధర, బడ్జెట్ రోజు నాటికే టన్నుకు $425 నుంచి $600 కు, అంటే 41 శాతం పెరిగింది. డీఏపీ ధరలు 17 శాతం పెరిగాయి. నాఫ్తాపై ఆధారపడిన పురుగు మందుల ధరలు 20–25 శాతం పెరిగాయి. యూరియా ఉత్పత్తిలో ఉపయోగించే ఎల్ఎన్జీలో అధిక భాగాన్ని సరఫరా చేసే ఖతార్ సరఫరాలను పూర్తిగా నిలిపివేసింది. తెలంగాణ ప్రధాన పంట కాలమైన ఖరీఫ్ ఆరు వారాల్లో ప్రారంభమవుతుంది.
వరి పంటకు ఎకరంపై 25% పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చులు రూ.3,000–5,000 వరకు పెరుగుతాయి. దీనివల్ల విత్తనం భూమిలో వేయకముందే ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు నిధిలో అధిక మొత్తం ఖర్చయిపోతుంది. ప్రభుత్వం అందించే రూ.500/క్వింటాల్ వరి ప్రోత్సాహకం, పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని పూడ్చలేదు. బడ్జెట్ రోజున యూరియా ధర టన్నుకు $600కు పెరిగింది. పప్పుధాన్యాల బఫర్ స్టాక్ యంత్రాంగం లేదు. వంట నూనె ధరల నియంత్రణ నిధి లేదు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధానం లేదు. 42.9 లక్షల కుటుంబాలకు ఇచ్చే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం 30-–35% పెరిగిన ఎల్‌పిజి దిగుమతి ఖర్చులపై ఆధారపడి ఉంది. వీటన్నింటి వలన ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. బడ్జెట్ ఈ విషయాల పట్ల మౌనంగా ఉంది.
పారదర్శక సమాచారం అవసరం
ముఖ్యంగా మూడు విషయాలు అవసరం. మొదటిది, ఆర్థిక స్థితిపై ఒక నిజాయితీతో కూడిన ప్రకటన. రుణ నిల్వలు, వార్షిక రుణ చెల్లింపుల భారం, రాబడిలో జీతాలు, పెన్షన్ల వాటా, అవసరమైన నికర కొత్త రుణాలు వంటి వాటి మీద పారదర్శకంగా సమాచారం ఇవ్వడం అవసరం. రెండోది, ఒక ఆపత్కాల ప్రణాళిక. రైతుల కోసం ముడిసరుకుల ధరల స్థిరీకరణ నిధి, ఆహార ధరల నియంత్రణ నిధి, గల్ఫ్ కార్మికులను స్వదేశానికి రప్పించే పథకం, రైతు కోసం ఒక యుద్ధ- సర్దుబాటు నిబంధనతో కూడిన రైతు భరోసా బదిలీ. మూడోది, వ్యయ క్రమశిక్షణకు కనీసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, వ్యయ- ప్రయోజనాలను పేర్కొనడం. ఇవి ఏవీ బడ్జెట్ ప్రతులలో, ప్రసంగంలో, చర్చలలో కనిపించవు. 2026 జనవరిలో ఉన్నట్లుగా రాసిన బడ్జెట్ ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదించడం శోచనీయం. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం, శాసనసభ్యులు పట్టించుకోలేదు. ఇదివరకు లాగానే, 2026-–27 తెలంగాణ బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు దూరంగా తయారుచేశారు.
నిధుల కొరత
సాధారణంగా నిధుల మంజూరు ఉత్తర్వులతో ఒక ప్రాజెక్టు మొదలు అవుతుంది. బడ్జెట్లో కేటాయింపు దానికి నిధులు సమకూరుస్తుంది. రూ.24,752 కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు, అందులో కొంత భాగం మాత్రమే వార్షిక బడ్జెట్‌లో కనిపిస్తే, ఆ వ్యత్యాసం నిధులు లేని ఒప్పంద బాధ్యతగా మిగిలిపోతుంది. తెలంగాణ పట్టణ, నీటిపారుదల శాఖలన్నింటిలోనూ ఇదే తీరును కాగ్ (కాగ్) పదేపదే ఎత్తి చూపింది. ప్రస్తుత వార్షిక కేటాయింపు రూ.1,500 కోట్లు లెక్కగడితే కేవలం MAUD నిధులతోనే మూసీ నది పునరుజ్జీవనం పూర్తి కావడానికి సుమారు 29 సంవత్సరాలు పడుతుంది. అట్లా చేయకపోవచ్చు. దరిమిలా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా వార్షిక బడ్జెట్ వెలుపల ఉన్న వనరులపై అంటే బాండ్లు, కేంద్ర గ్రాంట్లు, ప్రైవేట్ పెట్టుబడులపై ఆధారపడి ఉండాలి. లేదా రూ.43,592.88 కోట్ల అంకె కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే అయి ఉండాలి. అనుమతించిన అతిపెద్ద మొత్తాన్ని ఒక గొప్పగా చెప్పి వాస్తవ బడ్జెట్ కేటాయింపు అందులో 10 శాతం కంటే తక్కువ ఉంటే రూ.17,907 కోట్లలో రూ.1,500 కోట్లు. ఆ ప్రాజెక్టుకు తగిన నిధులు లేవని స్పష్టం అవుతున్నది. ఈ విధమైన బడ్జెట్ ధోరణి గత 12 సంవత్సరాల నుంచి ఏదో ఒక రూపంలో చూస్తున్నాం.
- డా.దొంతి నరసింహారెడ్డి
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
