ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్ పొడిగించాలె: సీఎం రేవంత్

ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్ పొడిగించాలె: సీఎం రేవంత్
  • ఓల్డ్ సిటీ నుంచి  ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్​.. అధికారులతో రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి 
  • ఎంజీబీఎస్, ఎల్బీనగర్ నుంచి కనెక్ట్ చేయాలె 
  • పాత టెండర్లను హోల్డ్ లో పెట్టాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్ నుంచి ఎయిర్​పోర్ట్ వరకు మెట్రోను జీవో 111 ఏరియా గుండా ఎలా పొడిగిస్తారని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఓఆర్ఆర్ రూపంలో మంచి ట్రాన్స్​పోర్ట్​ఫెసిలిటీ ఉన్నప్పుడు, అక్కడి నుంచి మెట్రో ఎందుకని ప్రశ్నించారు. పైగా ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా పరిమితమేనని, అలాంటప్పుడు ఈ మెట్రో లైన్​ఎలా సాధ్యమని అన్నారు. బుధవారం సెక్రటేరియెట్​లో మెట్రో విస్తరణపై అధికారులతో రేవంత్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

వాస్తవానికి ఓల్డ్​ సిటీలోని సెంట్రల్, ఈస్టర్న్ సిటీల్లోనే జనాభా ఎక్కువుందని.. అలాంటప్పుడు వారి ట్రాన్స్​పోర్టేషన్​కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ‘‘ఎయిర్​పోర్ట్​కు మెట్రో కనెక్టివిటీని ఓల్డ్​సిటీ మీదుగా తీసుకెళ్లాలి. ఎంజీబీఎస్​ నుంచి ఫలక్​నుమా మీదుగా మెట్రో లైన్​ను పొడిగించాలి. ఎల్బీ నగర్​ నుంచి కూడా ఎయిర్​పోర్ట్​కు కనెక్టివిటీని పెంచాలి. తద్వారా పెద్ద సంఖ్యలో సామాన్యులకు మెట్రో అందుబాటులోకి వస్తుంది” అని చెప్పారు. ప్రస్తుతం ఎయిర్​పోర్ట్​అలైన్​మెంట్​కోసం పిలిచిన టెండర్లను హోల్డ్​లో పెట్టాలని ఆదేశించారు. వెంటనే ఎంజీబీఎస్​నుంచి ఫలక్​నుమా మీదుగా, ఎల్బీ నగర్​నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్​పోర్ట్​కు మెట్రోను పొడిగించే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఖర్చు తక్కువయ్యే మైలార్​దేవ్​పల్లి, జల్​పల్లి, పీ7 రోడ్​లో ఓ సెక్షన్ .. బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్​మీదుగా వెళ్లే మరో సెక్షన్​పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 

సిటీ అంతటా సమాన అభివృద్ధి..

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా సమాన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. ఓఆర్ఆర్​చుట్టూ శాటిలైట్​టౌన్​షిప్స్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కందుకూరులో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో పర్యావరణహితమైన మెగా టౌన్​షిప్​ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మెగాటౌన్​షిప్​కు కూడా ఎయిర్​పోర్ట్​ఏరియా నుంచి తుక్కుగూడ, శ్రీశైలం రోడ్​మీదుగా మెట్రో కనెక్టివిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.  

ఎల్ అండ్​టీకి లబ్ధి చేకూర్చడంపై అసంతృప్తి..

ఓల్డ్​సిటీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్​ను పూర్తి చేయనప్పటికీ ఎల్ అండ్​టీ సంస్థకు లబ్ధి చేకూర్చడంపై రేవంత్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ తతంగంపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. సంక్షేమ పథకాలను అందిస్తూనే సిటీ అభివృద్ధికి దోహదపడేలా సిటీ మాస్టర్​ప్లాన్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మూసీ నది తీరాల్లో నాగోల్​నుంచి గండిపేట వరకు రోడ్​కమ్​మెట్రో రైల్​కనెక్టివిటీని ఏర్పాటు చేసే విషయంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, సీఎస్ పాల్గొన్నారు