
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల అప్పులు రూ. 81,516 కోట్లు పేరుకుపోయాయని, ఇవి కాకుండా డిస్కంల నష్టాలు రూ. 62,461 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. ‘‘గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రభుత్వ శాఖలే వేల కోట్ల బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది’’ అని పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. కీలక అంశాలను అందులో ప్రభుత్వం ప్రస్తావించింది. గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలయిందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బాకీలే రూ.28,842 కోట్లు అని, ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినవే రూ.14,193 కోట్లు అని వివరించింది.
బీ ప్లస్ నుంచి సీ కేటగిరీకి
రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కంల మొత్తం అప్పులు- రూ.59,132 కోట్లని ప్రభుత్వం వెల్లడించింది. ట్రాన్స్‌కో అప్పులు రూ.24,476.40 కోట్లు, జెన్కో అప్పులు రూ.53,963 కోట్లు అని తెలిపింది. ఈ అప్పుల కారణంగా దేశంలోని డిస్కంల ర్యాంకింగ్‌ల్లో తెలంగాణ డిస్కంలు బీ ప్లస్ ర్యాంక్ నుంచి సీ కేటగిరిలోకి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణ జెన్ కో సంస్థ అప్పులు రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 7,662కోట్లు ఉంటే.. ఇప్పుడవి నాలుగు రెట్లు పెరిగాయి. 2014 నాటికి జెన్కోలో అప్పు 7,662 కోట్లు ఉండగా.. 10 ఏండ్ల లో 32,797 కోట్లకు చేరాయి. ఇతరాల పేరుతో చేసిన అప్పులు రూ.14,631కోట్లు కలిపితే ఇది రూ.53 వేల కోట్లకు దాటుతుంది. 2014 నాటికి ఇతరాలతో కలిపితే జెన్కో అప్పు రూ. 16,635 కోట్లు. తెలంగాణ ట్రాన్స్‌కో రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.2,411కోట్లు అప్పుల్లో ఉంటే గత పదేండ్లలో రూ.10,529 కోట్లకు చేరాయి. ఇతరాల పేరుతో చేసినవి కలుపుకుంటే ట్రాన్స్‌కో అప్పు లు రూ.24,476కోట్లకు చేరుకున్నాయి. 2014 నాటికి ఇతరాలతో కలిపితే ట్రాన్స్‌కో అప్పు రూ. 6,277 కోట్లు.
అప్పనంగా రూ.638.50 కోట్ల చెల్లింపు
చత్తీస్‌గడ్ నుంచి గత ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. చత్తీస్‌గడ్ విద్యుత్ ను ప్రతి యూనిట్‌కు రూ.5.86 తో కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 78,970 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలుకు రూ. 39,722 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. చత్తీస్ గడ్ కారిడార్‌ను వాడకుండానే రూ.638.50 కోట్లు అప్పనంగా చెల్లించారని రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది.
థర్మల్ ప్లాంట్ జాప్యం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేశారు. అది కూడా రెండేండ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఏడేండ్లకు పూర్తి చేశారు. విభజన చట్టం ద్వారా 1,800 మెగావాట్లు అదనంగా రాష్ట్రానికి వేర్వేరు వనరుల ద్వారా లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ మాత్రమే కొత్తగా ఉనికిలోకి వచ్చిందని, 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఇంకా వాడకంలోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ (1,080 మెగావాట్లు) రెండేండ్లలోనే కడితే ఒక్క మెగావాట్‌కు అయ్యే ఖర్చు రూ. 6.75 కోట్లు. ఏడేండ్ల ఆలస్యం వల్ల ఒక్క మెగావాట్‌కు అయిన ఖర్చు రూ.9.74 కోట్లు. ఫలితంగా భారీగా అదనపు భారం పడింది.
ప్రభుత్వ సంస్థల బాకీలు
2014 నాటికి విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బాకీలు రూ. 1,595.37 కోట్లు మాత్రమే. గత పదేండ్లలో ఇది భారీగా పెరిగింది. ఇప్పడు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బాకీలు- రూ. 28,842 కోట్లకు చేరాయి. వీటిలో సాగునీటి శాఖ బాకీలు- రూ.14,193 కోట్లు, మిషన్ భగీరథ బాకీలు రూ.3,558.83 కోట్లు, పంచాయితీరాజ్ శాఖ బాకీలు రూ.4,393.99 కోట్లు, వాటర్ బోర్డు బాకీలు రూ. 3,932.47 కోట్లు, మున్సిపాల్టీల బాకీలు- రూ.1,657.81 కోట్లు, కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు రూ.720 కోట్లు.
ట్రూ అప్ చార్జీలు ఇవ్వలే
గత -ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తామని చెప్పి, ఇప్పటికీ ఇవ్వని విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చులు (ట్రూ అప్ చార్జీలు) - రూ. 14,928కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ సీఏ)- రూ.2,378 కోట్లు, సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బాకీలు రూ. 19,431 కోట్లు, తొమ్మిదిన్నరేండ్లలో స్వల్పకాలిక మార్కెట్ల నుంచి కొన్న కరెంటు- 78,970 మిలియన్ యూనిట్లు అని శ్వేతపత్రంలో తెలిపింది. కరెంటు కొనుగోళ్ల కోసం చేసిన ఖర్చు రూ.39,722 కోట్లు (సగటు యూనిట్ రేటు రూ.5.03 పైసలు)గా తెలిపింది. ఈఆర్‌సీ ఆమోదించిన అగ్రికల్చర్ సేల్స్, డిస్కంలు అంచనా వేసిన సేల్స్ మధ్య వ్యత్యాసం (నష్టాలతో కలిపి) - 39,798 మిలియన్ యూనిట్లు ఫలితంగా దీంతో అదనంగా పెరిగిన ఖర్చు రూ.18,725 కోట్లు భారం పడిందని పేర్కొంది.
వ్యవసాయానికి 28 శాతం కరెంటు
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 19.03 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉంటే.. అవి గత పదేండ్ల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు 27.99 లక్షల పంపుసెట్లు ఉన్నాయని, అంటే అదనంగా దాదాపు 9 లక్షల పంపుసెట్లు పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికి వినియోగించే కరెంటు 28 శాతం అని తెలిపింది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పుకున్నా సగటున (గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) 19.22 గంటలు మాత్రమే సరఫరా అయిందని, పీక్ టైమ్‌లో ఇవ్వలేదని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య- 27.99 లక్షలు. కాగా పంపుసెట్లతో వ్యవసాయ కరెంట్ డిమాండ్ 6,003 మెగావాట్లు అని పేర్కొంది. వ్యవసాయ రంగానికి సరఫరా చేయాలనుకున్న అంచనాకు, వాస్తవానికి మధ్య వ్యత్యాసం కారణంగా ఈ ఒక్క రంగంలోనే రూ. 18,725 కోట్ల మేర భారం పడిందని తెలిపింది.