డిసెంబర్​ ఫస్ట్​ వీక్లో తెలంగాణ ఎన్నికలు!

డిసెంబర్​ ఫస్ట్​ వీక్లో తెలంగాణ ఎన్నికలు!
  • ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు 
  • ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేయనున్న ఈసీ
  • రాజస్థాన్, తెలంగాణలో ఒకే సారి పోలింగ్?
  • ఇప్పటికే రంగంలోకి ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ ఏజెన్సీలు
  • డబ్బు, మద్యం పంపిణీపై నిఘా.. చెక్​పోస్టులు పెట్టి తనిఖీలు
  • నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ వచ్చే చాన్స్​
  • నవంబర్‌‌‌‌లోనోటిఫికేషన్ విడుదల
  • డిసెంబర్ 13లోగా ఫలితాలు!
  • రెడీగా ఉండాలని రాష్ట్ర సీఈవోకు ఈసీ సంకేతాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికల నగారాకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగే సూచనలు కన్పిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్‌‌కు కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు పంపింది. హైదరాబాద్‌‌లో మూడు రోజులు పర్యటించి, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి వెళ్లిన ఈసీ బృందం.. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన ఫుల్ కమిషన్.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌పై చర్చించింది. మిజోరంలో డిసెంబర్ 17 లోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. చత్తీస్‌‌గఢ్‌‌, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు జనవరి ఫస్ట్ వీక్‌‌లో ముగుస్తుంది.

రాజస్థాన్, తెలంగాణకు జనవరి రెండో వారం వరకు టైమ్‌‌ ఉంది. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇంకో రాష్ట్రంపై పడకుండా ఐదు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఈసీ భావిస్తున్నది. ఈ లెక్కన నవంబర్ చివరి వారంలో లేదంటే డిసెంబర్​ మొదటి వారంలోనే తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తేదీలో ఎన్నికలు నిర్వహించి.. తర్వాత ఒకేసారి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 13వ తేదీలోగా పూర్తి చేసుకునేలా ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా డబ్బు, మద్యం పంపిణీపై గురువారం నుంచే నిఘా పెంచారు. చెక్​పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తనిఖీలు ప్రారంభించారు. జీఎస్టీ ఆఫీసర్లు కూడా ‘ఉచితాల’పై దృష్టి సారించారు. ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన రూ.14 లక్షల విలువ చేసే వస్తువులను ఇప్పటికే సీజ్ చేసినట్లు సమాచారం.

పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు కసరత్తును త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సీఈసీ రాజీవ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. ఉన్నతాధికారులు, ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలు రంగంలోకి దిగాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ నెల 9వ తేదీ లేదంటే 11వ తేదీన ఐదు రాష్ట్రాలకు ఈసీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించనుందని తెలిసింది. తెలంగాణలో నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియను నవంబర్ రెండోవారం లేదంటే మూడో వారంలో పూర్తి చేసి.. ప్రచారానికి 15 రోజుల సమయం ఇచ్చి పోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ నవంబర్ 15వ తేదీలోగా నామినేషన్ల స్క్రూటినీ పూర్తి చేసి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తే.. అదే నెల చివరలో పోలింగ్ ఉంటుంది.

లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌లో పోలింగ్ జరుగుతుంది. రాజస్థాన్, తెలంగాణలకు ఒకే సారి పోలింగ్ పెట్టనున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్ చివరి వారం లేదంటే డిసెంబర్ ఫస్ట్​వీక్​లోనే పోలింగ్​ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీఈఓ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఇక మిజోరం రాష్ట్రానికి ముందుగానే ఎన్నిక జరపనున్నారు. నక్సల్​ ప్రభావిత ప్రాంతమైన చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో నాలుగైదు విడతల్లో ఎన్నికలు పెట్టే చాన్స్ ఉంది. తెలంగాణలో ఒకే ఫేజ్‌‌‌‌‌‌‌‌లో పోలింగ్ పూర్తి కానుంది. అన్ని రాష్ట్రాల పోలింగ్ ఫలితాలను డిసెంబర్ 13లోపే ఒకేసారి ప్రకటించనున్నారు.

డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ!

త్వరలో ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ బృందం పర్యటించింది. చివరగా తెలంగాణలో పర్యటించి.. ఎన్నికల సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నది. శుక్రవారం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఏయే రాష్ట్రంలో బందోబస్తుకు ఎంతమంది పోలీసులు అవసరం? ఎక్కడ ఎన్ని విడతల్లో ఎలక్షన్స్​ పెట్టాలి? ఎలక్షన్ అబ్జర్వర్లుగా ఎంతమంది అవసరం అవుతారు? ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ గడువు ఎంతవరకు ఉంది? వాటికి  ఎప్పటి లోపు ఎన్నికలు పూర్తి చేసి.. ఎప్పుడు కౌంటింగ్ నిర్వహించాలి? అనే వివరాలన్నింటిపై చర్చించింది.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయా రాష్ట్రాల అధికారులు రిపోర్టులు ఇవ్వడం, తుది ఓటర్ల జాబితా ప్రచురణ కూడా పూర్తికావడం, ఈసీ సంతృప్తి చెందడంతో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఏ రాష్ట్రానికి ఎప్పుడు, ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై డ్రాఫ్ట్ షెడ్యూల్‌‌ను ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. మళ్లీ ఒకసారి ముగ్గురు కమిషనర్ల బృందం సమావేశమై.. మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే సరిచేసి షెడ్యూల్​ను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.