వరి కొనుగోలు కోసం తెలంగాణ రైతుల ఎదురుచూపులు

వరి కొనుగోలు కోసం తెలంగాణ రైతుల ఎదురుచూపులు

మెదక్, వెలుగు: 
రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. రైతులు పంటను కుప్పలుగా పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క జిల్లాలో కూడా ఇంతవరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు పొలాలు, రోడ్ల వెంట, మార్కెట్​యార్డుల్లో వడ్లను ఆరబోసి అమ్ముకునేందుకు చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పంట చేతికొచ్చి 10 రోజులు దాటిపోయింది. దిగుబడిని బట్టి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయించినప్పటికీ సంబంధిత డిపార్ట్​మెంట్ల కోఆర్డినేషన్ మీటింగులే పూర్తికాలేదు. వడ్ల నాణ్యత పరీక్షించేందుకు వాడే మాయిశ్చర్ మిషన్లు, శుభ్రం చేసేందుకు వాడే ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, వడ్లు నింపేందుకు గన్నీ బ్యాగులు, తరలించేందుకు అవసరమైన లారీలను సమకూర్చలేదు. వరుస వానలకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వడ్ల కుప్పలు తడిసి మొలకలు వచ్చాయి. వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. కొనుగోలు అధికారుల్లో మాత్రం చలనం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సెంటర్ల వద్దకు పంట తెచ్చిపోసిన రైతులకు కనీసం టార్పాలిన్లు అందజేయక పోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. దీపావళి పండుగ తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కొందరు అధికారులు అంటున్నారు. కానీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆ హడావుడి అయిపోయేంత వరకు ప్రారంభిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మెదక్​ జిల్లాలో ఈ వానాకాలంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు భావించారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీల ఆధ్వర్యంలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఎక్కడా ప్రారంభం కాలేదు. 10 రోజుల కిందటి నుంచే కొల్చారం, మెదక్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల పరిధిలో వడ్లను మెదక్ మార్కెట్ యార్డుకు, ఆయా మండలాల పరిధిలోని ఐకేపీ, పీఏసీఎస్ లు ఏర్పాటు చేసే సెంటర్ల ప్రాంతాలకు తరలించి ఆరబోస్తున్నారు. వానలకు కొన్నిచోట్ల వడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. కొల్చారం మండలం అప్పాజిపల్లి, పోతంశెట్​పల్లి, మెదక్​ మండలం మాచవరంలో వడ్లు మొలకలు వచ్చాయి.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోచాలా గ్రామాల్లో వారం రోజులుగా వరి కోతలు కొనసాగుతున్నాయి. రైతులు ఎప్పటికప్పుడు వడ్లను కొనుగోలు కేంద్రాల ప్రాంతాలకు తరలిస్తున్నారు.  అక్కడ ఏర్పాట్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే వరి కోతలు షురూ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 22 నుంచి జిల్లాలో 185 కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారు.

కామారెడ్డి జిల్లాలోనూ కోతలు మొదలయ్యాయి. 2.97 లక్షల ఎకరాల్లో వరి వేయగా 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.  ఇప్పటికే  బాన్సువాడ, బీర్కూర్,  నస్రుల్లాబాద్, నిజాంసాగర్, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో జోరుగా కోతలు సాగుతున్నాయి. రోడ్లపై, సెంటర్లు ఏర్పాటు చేస్తారని భావించే స్థలాల్లో రైతులు వడ్లను కుప్పలు పోశారు. జిల్లాలో 345 సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక్కటీ ఒపెన్ కాలేదు. బాన్సువాడ ఏరియాలోని  సన్నరకం వడ్లను నల్లగొండ, మిర్యాలగూడ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్​కు రూ.1,900 చెల్లిస్తున్నారు.  కరీంనగర్ జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. వడ్లు కల్లాల్లోకి వస్తున్నాయి. గన్నేరువరం వంటి మండలాల్లో కోతలు మొదలైనా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. 

ఏం మిగిలేట్లు లేదు

సీఎం కేసీఆర్​ రైతును రాజును చేస్తమంటున్నరు. కానీ సర్కారే రైతుల బాధలు పట్టించుకుంటలేదు. వరి కోతలు షురువై చాలా రోజులైనా కొనుగోలు సెంటర్లు ఎందుకు ఓపెన్​ చేస్తలేరు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి, ఇంటిళ్లపాది నెలలు కష్టపడి పండించిన వడ్లు వానకు తడిసి మొలకెత్తాయి. ఏం మిగిలేటట్లు లేదు. 
‌‌- కౌడిపల్లి ముత్యం, అప్పాజిపల్లి, మెదక్​జిల్లా

తక్కువ ధరకే అమ్ముకుంటున్నం 

వరి కోతలు పూర్తయి వడ్లను కొనుగోలు కేంద్రాల ప్రాంతాలకు తరలించాం. ప్రభుత్వం ఇంతవరకు కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఇప్పటికే కురిసిన వానలకు వడ్లు తడిసిపోయాయి. చేసేదేం లేక రూ.1,590కు దళారులకు అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభిస్తే  మద్దతు ధర దక్కేది. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి.
-తాటికొండ కనకయ్య, గన్నేరువరం, కరీంనగర్​జిల్లా