తెలంగాణ గజల్ దిగ్గజం  బైరి ఇందిర కన్నుమూత

తెలంగాణ గజల్ దిగ్గజం  బైరి ఇందిర కన్నుమూత
  • తెలంగాణ గజల్ దిగ్గజం  బైరి ఇందిర కన్నుమూత
  • నేడు నిజాంపేటలో అంత్యక్రియలు
  • సంతాపం ప్రకటించిన  కవులు, కళాకారులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ తొలి మహిళా గజల్ దిగ్గజం బైరి ఇందిర (67) ఆదివారం కన్ను మూశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడ్డారు. హైదరాబాద్​లోని నిజాంపేటలో కూతురు, గజల్ కళాకారిణి హిమజా రామం వద్ద ఉంటున్నారు. గతంలో ఆమె ఇల్లెందులోని శాంతినికేతన్ ప్రైవేట్ స్కూల్​లో పనిచేశారు. గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చేదాకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా, గజల్స్​ను మాత్రం వదిలిపెట్టలేదు. ఇల్లెందు, కొత్తగూడెం, కారేపల్లి తదితర ప్రాంతాల్లో టీచర్​గా, హెచ్ఎంగా పనిచేశారు. 

600పైగా గజల్స్​ రాసిన ఇందిర


బైరి ఇందిర 600కు పైగా గజల్స్ రాశారు. అభ్యుదయ భావాలు, కుల వివక్ష, సాంఘిక దురాచారాలు, మహిళలపై వేధింపులు, ప్రస్తుత రాజకీయాలపై గజల్స్ ద్వారా అవగాహన కల్పించేవారు. తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు వంటి గజల్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రావి రంగారావు సాహిత్య కళా పీఠం నుంచి ‘జనరంజక కవి పురస్కారం’తో పాటు పలు అవార్డులు అందుకున్నారు. సోమవారం ఉద యం హైదరాబాద్​లోని నిజాంపేట లో అంత్యక్రియలు జరుగుతాయని కూతురు హిమజా రామం ప్రకటించారు.

తన అంతిమయాత్రపై కవిత్వం

తన మృతదేహాన్ని ఎలా సాగనంపాలో, ఎలాంటి పనులు చేయకూడదో చెప్తూ భైరి ఇందిర ఓ కవితను రాసుకున్నారు. ‘‘నేను పోయినప్పుడు ఓ కాగితాన్ని కప్పండి.. రాసుకోడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి.. మరీ గాలాడదు.. పురుగూ పుట్రా ఉంటాయ్..! పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్  బ్యాగులో ఉండేలా చూడండి.. సెల్ మర్చిపొయ్యేరు.. బోర్ కొట్టి చస్తాను. దండలు గిండలు వెయ్యకండి.. నాకు ఎలర్జీ. పసుపు గట్రా పూసి భయంకరంగా మార్చకండి..పిల్లలు ఝడుసుకుంటారు’’ అంటూ అందులో సూచించారు.