‘ప్రాణహిత-చేవెళ్ల’ ఆనవాళ్లే లేకుండా ప్రభుత్వ ప్రయత్నం

‘ప్రాణహిత-చేవెళ్ల’ ఆనవాళ్లే లేకుండా ప్రభుత్వ ప్రయత్నం
  • సాంకేతిక కారణాల సాకుతో వేరే చోట బ్యారేజీ నిర్మాణం 
  • 5 వేల కోట్ల ఖర్చు అంచనాతో డీపీఆర్ రెడీ 
  • మొదట 750 కోట్లతోనే పూర్తవుతుందని ప్రకటన 
  • కేవలం ఏడాదిలోనే ఆరు రెట్లు పెరిగిన అంచనా వ్యయం

హైదరాబాద్, వెలుగు:గోదావరి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఆనవాళ్లే లేకుండా చెరిపేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీని వార్దా నది పైకి షిఫ్ట్ ​చేసింది. దీనికి సంబంధించిన డీపీఆర్​ కూడా సిద్ధమైంది. కేవలం రూ.750 కోట్లతోనే బ్యారేజీ నిర్మాణం పూర్తవుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని ఇన్నాళ్లు ప్రజలను పక్కదారి పట్టించిన ప్రభుత్వం.. ఇప్పుడేమో ఏకంగా రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రెడీ చేసింది. కేవలం ఏడాది వ్యవధిలోనే బ్యారేజీ నిర్మాణ ఖర్చును ఆరు రెట్లు పెంచింది.

తుమ్మిడిహెట్టి దగ్గరే బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కేసీఆర్​సర్కార్.. ప్రాజెక్టు రీడిజైనింగ్​పేరుతో ప్రాణహిత ఊపిరి తీసింది. కాళేశ్వరం పేరుతో వంద కిలోమీటర్లు కిందికి వెళ్లి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించింది. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క స్టేజీలో లిఫ్ట్​ చేస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరేవి. రీడిజైన్​పేరుతో దిగువకు వెళ్లడంతో కాళేశ్వరం లింక్–1లో మూడు బ్యారేజీలు, మూడు స్టేజీల్లో లిఫ్టులు నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం అదనంగా రూ.2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ కూడా నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని కేసీఆర్​ ప్రకటించారు. ఇలా చెప్పిన ఎనిమిదేండ్ల తర్వాత వార్దా నదిపై బ్యారేజీకి గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ ​జిల్లా కౌటాల మండలం వీర్దండి గ్రామం వద్ద వార్దాపై బ్యారేజీ నిర్మించనున్నారు. 

మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నా మార్పు ఎందుకు?  

ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్​ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తలపెట్టారు. రూ.1,919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. దీని కింద 6,149 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని గుర్తించారు. మహారాష్ట్రలో 1,852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నది గర్భంలో 3,771 ఎకరాలు మునిగిపోతుందని డీపీఆర్​లో పేర్కొన్నారు. మునిగే తమ భూములకు పరిహారంగా ఎకరానికి రూ.12 లక్షల చొప్పున ఇవ్వాలని మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్​జిల్లాల రైతులు కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్..​ అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో చర్చలు జరిపారు. బ్యారేజీ నిర్మాణ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మెయిన్​సైట్​మార్చారు.

డిజైన్​లోనే లోపం ఉందంటూ... 

వార్దా, వైన్​గంగా నదుల సంగమం తర్వాత ప్రాణహిత నది ఏర్పడుతుంది. ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయనే అంశాన్ని కేసీఆర్​ సర్కారు 2018లో తెరపైకి తెచ్చింది. వార్దా నది ప్రవాహానికి బ్యారేజీ అడ్డంగా ఉన్నా వైన్​గంగా వైపునకు వెళ్లే సరికి 40 డిగ్రీల కోణంలో కుడివైపునకు మార్చి నిర్మించాల్సి వస్తుందని పేర్కొంది. దీంతో గేట్ల బిగింపులో సమస్యలు ఎదురవుతాయని, బ్యారేజీ నిర్మాణ డిజైన్​లోనే లోపం ఉందని.. కాబట్టి దానికి ఎగువన వార్దాపైనే బ్యారేజీ నిర్మించాలనే అంశాన్ని ప్రచారంలోకి తెచ్చింది. వ్యాప్కోస్​తో ఈ మేరకు సర్వే కూడా చేయించింది. వార్దాపై 600 మీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించి దానికి 36 గేట్లు బిగిస్తే సరిపోతుందని, ఇందుకు రూ.650 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని 2022 జనవరిలో ప్రాథమికంగా అంచనా వేసింది. తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తరలించేందుకు అప్పటికే తవ్విన 71 కిలోమీటర్ల కాల్వతో లింక్​ చేయడానికి తవ్వే కాల్వల కోసం ఇంకో రూ.100 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. మొత్తంగా రూ.750 కోట్లతో వార్దా బ్యారేజీ పూర్తవుతుందని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్తూ వచ్చింది. కానీ ఉన్నట్టుండి అంచనా వ్యయం భారీగా పెంచేసింది. రూ.4,874 కోట్లతో బ్యారేజీ నిర్మించేందుకు డీపీఆర్ ​సిద్ధం చేసింది. ఇంకో మూడు, నాలుగు రోజుల్లోనే ఈ డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి 
సమర్పించనుంది.


అంచనా వ్యయం భారీగా పెంచడంలో మతలబు ఏంటి? 

మహారాష్ట్రతో ఒప్పందం తర్వాత ఆ రాష్ట్రంలో ముంపు భారీగా తగ్గిపోయింది. అక్కడి రైతులు డిమాండ్​చేసినంత పరిహారం ఇచ్చినా భూసేకరణకు ఇంకో రూ.50 కోట్లకు మించి ఖర్చయ్యేది కావు. తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తరలించేందుకు ఐదు మీటర్ల వెడల్పు, ఎనిమిది మీటర్ల లోతుతో 71 కిలోమీటర్ల పొడవైన కాల్వ తవ్వారు. ఆ తర్వాత జైపూర్​ ఓపెన్ ​కాస్టును దాటి ఎల్లంపల్లికి లింక్​ చేయడానికి పైపులు కూడా తెప్పించారు. మొత్తంగా ఇందుకోసం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. కేవలం బ్యారేజీ నిర్మాణానికే పరిమితమైనా రూ.4 వేల కోట్లతో తుమ్మిడిహెట్టి పూర్తయ్యేదని, ఇప్పుడు దానిని కాదని వార్దాపై అంతకన్నా వెయ్యి కోట్లు ఎక్కువ ఖర్చు చేసి బ్యారేజీ నిర్మించడం ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే రూ.750 కోట్ల నుంచి రూ.4,874 కోట్లకు ఖర్చు ఎలా పెరుగుతుందో అంతుచిక్కడం లేదని సీనియర్​ ఇంజనీర్లే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తుమ్మిడిహెట్టిని విస్మరించి ఇప్పటికిప్పుడు వార్దాను ఎత్తుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఎలా ఉన్నా, నిర్మాణ వ్యయం భారీగా పెంచడం వెనుక ఏవో కారణాలున్నాయని అనుమానిస్తున్నారు.