ధరణిలో తప్పులు నిజమేనని ఒప్పుకున్న సర్కారు

V6 Velugu Posted on Sep 26, 2021

 • 17 లోపాలను ఒప్పుకున్న సర్కార్​ 
 • ఇన్నాళ్లూ బుకాయింపు.. ఏడాదిగా రైతులకు తిప్పలు
 • ఇంకా లక్షలాదిగా సర్వే నంబర్లు మిస్సింగ్ 
 • ప్రొహిబిటెడ్ లిస్టులోనే పట్టా భూములు 
 • రంగారెడ్డి జిల్లాలో చాలా వెంచర్లు, విల్లాలు అగ్రికల్చర్​ లిస్టులోనే
 • జాయింట్​ రిజిస్ట్రేషన్లకు పోర్టల్​లో కాలమ్​ లేదు
 • గ్రీవెన్స్​ ఆప్షన్​ ఉన్నా సమస్యలు పెండింగ్​లోనే
 • పాస్​బుక్కుల కోసం లక్షలాది మంది ఎదురుచూపులు

ధరణి పోర్టల్​ దేశానికే ఆదర్శమని ఇన్నాళ్లూ గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు అందులోని తప్పుల్లో కొన్నింటిని ఒప్పుకుంది.  ధరణి వచ్చాక సమస్త భూవివాదాలు పరిష్కారమయ్యాయని, ఎలాంటి సమస్యలు లేవని బుకాయించి.. తాజాగా ఆ పోర్టల్​లో పలు లోపాలను గుర్తించింది.
హైదరాబాద్​, వెలుగు:  ధరణి పోర్టల్​ వల్ల ఎదురవుతున్న సమస్యలపై దాదాపు ఏడాది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పోర్టల్​లో 17 రకాల సమస్యలను గుర్తించింది. వాటి సవరణల కోసం ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ మండలాల తహసీల్దార్లు ఫీల్డ్​ లెవల్ లో సమస్యలను గుర్తించగా, వాటిని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అయితే.. ఇంకా ఎన్నో సమస్యలు అట్లనే ఉన్నాయి. పోర్టల్​ వల్ల రైతులు, ప్రజలు పడుతున్న గోసపై ‘వెలుగు’ వరుసగా స్టోరీలు ప్రచురించింది. ఇన్నాళ్లూ రైతులకే పరిమితమైన ఆందోళనలు క్రమంగా ఉద్యమ రూపం తీసుకుంటుండడం, ధరణి బాధితుల్లో అధికార పార్టీకి చెందినవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో  ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 
పెండింగ్ లో ఫిర్యాదులు
ధరణి పోర్టల్ తో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని సర్కారు చెప్పిన మాటలు నమ్మితే.. ఆ పోర్టల్ వల్లే రైతులు కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. లక్షలాది ఎకరాల ప్రైవేట్ పట్టా భూములు, మాజీ సైనికుల భూములు ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్లాయి. ప్రాజెక్టులకు కొంత భూమి ఇచ్చి, కొంత సాగు చేసుకుంటే మొత్తం భూమిని నిషేధిత జాబితాలోనే పెట్టారు. కొత్త పాస్ బుక్ లో వచ్చిన కొన్ని  సర్వే నంబర్లు కూడా ధరణి పోర్టల్ లో మిస్సయ్యాయి. అంతేగాక పాస్ బుక్కులో తప్పులు దొర్లడం, జాయింట్ రిజిస్ట్రేషన్ కాకపోవడం, అసైన్డ్ భూములు వారసుల పేరిట విరాసత్ కాకపోవడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గతంలో రిజిస్టర్​ అయిన భూములను మ్యుటేషన్ చేయకపోవడం, పాస్ బుక్కులు రాకపోవడంలాంటి అనేక సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల పట్టాదారు పేరు స్థానంలో ‘శ్రీ’, ‘ఊర్లో లేరు’, ‘అన్ నోన్ పర్సన్’ అని కూడా పేర్కొన్నారు. భూ సమస్యలపై లక్షలాది మంది రైతులు ధరణి పోర్టల్ లోని గ్రీవెన్స్ ఆప్షన్ ద్వారా అప్లయ్​ చేసుకున్నారు.  అప్లికేషన్​ పెట్టుకునేందుకు ఆప్షన్ ఉన్నప్పటికీ..  వీటిని సరిచేసేందుకు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల వద్ద కూడా ఆప్షన్లు లేకపోవడంతో అప్లికేషన్లన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

తప్పులను బయటపెట్టిన ‘వెలుగు’

ధరణి పోర్టల్​లో సమస్యలపై  ‘వెలుగు’ వరుస కథనాలు అందించింది. రైతులు ఎదుర్కొం టున్న మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యపై ఈ ఏడాది ఏప్రిల్​ 21న ‘ధరణిలో భూములు మాయం’, రైతుల ఫిర్యాదులను పట్టించు కోకపోవడంపై జులై 19న ‘దారి చూపని ధరణి’ పేరిట కథనాలు పబ్లిష్​ అయ్యాయి. అలాగే పట్టాదారు పేర్ల స్థానంలో ‘శ్రీ’, ‘అన్ నోన్​ పర్సన్’​ అని ధరణిలో పేర్కొనడంపై జులై 31న ‘శ్రీ పేరుతో 3 లక్షల ఎకరాలు’ అనే హెడ్డింగ్​ తో కథనం,  ప్రొహిబి టెడ్​ భూముల సమస్యలపై ఆగస్టు 13న ‘మాజీ సైనికుల భూములు ధరణి చెరలో’ అనే మరో స్టోరీ పబ్లిష్ అయ్యాయి. 

17  రకాల సమస్యల గుర్తింపు

 1. కొన్ని సర్వే నంబర్లలో మొత్తం భూవిస్తీర్ణం ఎక్కువ  లేదా తక్కువగా నమోదైంది. ఇలాంటి సర్వే నంబర్లలోని ఎక్కువ, తక్కువలను సేత్వార్​, ఖాస్రా పహణీల ఆధారంగా సరి చేయడానికి ధరణిలో ప్రస్తుతం ఆప్షన్​ లేదు. బేస్​ సర్వే నంబర్​లోని మొత్తం భూ విస్తీర్ణాన్ని సరిదిద్దేందుకు ఆప్షన్​ ఇవ్వాల్సి ఉంది.
 2. సర్వే నంబర్ లో ఉన్న భూమి కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో పేర్కొంటూ  రైతుల పేరిట పట్టా పాస్​ పుస్తకాలు జారీ అయ్యాయి. బై నంబర్లు వేసి పాస్​ బుక్స్​ ఇచ్చారు. బేస్​ సర్వే నంబర్​లోని మొత్తం విస్తీర్ణం ఆధారంగా ఇలాంటి తప్పులను సరి చేయాలి.
 3. అసైన్డ్ ల్యాండ్స్​ పొందిన రైతులకు ఇచ్చిన పట్టాదారు పాస్​బుక్కుల్లో ‘క్లాసిఫికేషన్​ ఆఫ్​ ల్యాండ్​’ అనే కాలమ్​లో అసైన్డ్ ల్యాండ్​ బదులు.. పట్టా అని తప్పుగా నమోదైంది. ఇలాంటి తప్పును సరిచేసేందుకు ఆప్షన్ ఇవ్వాలి.
 4. కొందరు రైతుల పాస్​బుక్కుల్లో  ‘భూమి స్వభావం’ అనే కాలమ్​లో పట్టా భూములు అసైన్డ్ భూములుగా, అసైన్డ్ భూములను  పట్టా ల్యాండ్స్​గా నమోదయ్యాయి. నేచర్​ ఆఫ్ ల్యాండ్​ను సవరించేందుకు ఆప్షన్​ ఇవ్వాలి.
 5. ఇరిగేషన్​ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, ఇతర అనేక అవసరాల కోసం ప్రభుత్వం భూములు సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి భూములను ఏ పద్ధతిలో ప్రభుత్వం సేకరించిందనే విషయాన్ని రికార్డు చేయాల్సి ఉంది. కొనుగోలు, ఇతర మార్గాల ద్వారా సేకరించినట్లుగా నమోదు చేసేందుకు ఆప్షన్ ఇవ్వాలి. 
 6. కొన్ని భూ రికార్డుల్లో పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. అసలు పట్టాదారు పేరుకు బదులు.. భూమితో సంబంధం లేని వ్యక్తుల పేర్లు నమోదయ్యాయి. పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఇలాంటి తప్పులను సరిచేసేందుకు ఆప్షన్ చేర్చాలి. 
 7. మిస్సింగ్ సర్వే నంబర్​ను రికార్డుల్లో నమోదు చేశాక, లేదా అసలు భూమే లేని సర్వే నంబర్ ను డిలిట్​ చేశాక పాస్​ బుక్కుల్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులతో కొత్త పాస్​ బుక్కులు జారీ చేసేలా ఆప్షన్​ ఇవ్వాలి. 
 8. నోషనల్ ఖాతాల్లోని కొన్ని భూములకు ఖాతా నంబర్లు 99999గా నమోదయ్యాయి. వీటిని కొందరు పట్టాదారులు తమ భూమిగా క్లెయిం చేసుకుని కొత్త  పాస్ ​బుక్కులు కూడా పొందారు. ఇలాంటి భూములను పట్టాదారుల నుంచి నోషనల్  ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంది. 
 9. గతంలో ఆర్డీవోలు ఇనాం ల్యాండ్స్​ను సాగు చేసుకుంటున్న రైతులకు ఆక్యుపెన్సీ రైట్​ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఆర్డీవోలకు ఉన్న ఈ అధికారాన్ని తొలగించడంతో ప్రస్తుతం ఈ సర్టిఫికెట్లు జారీ కావడం లేదు. ఈ సర్టిఫికెట్ల కోసం అప్లయ్​ చేసేందుకు సిటిజన్​ లాగిన్​ లో ఒక ఆప్షన్​, జారీ చేసేందుకు కలెక్టర్లకు ఆప్షన్​ ఇవ్వాల్సి ఉంది.
 10. కొత్త పట్టాదారులకు, సర్వే నంబర్ మిస్సయిన పట్టాదారులకు కొత్త ఖాతా నంబర్లు క్రియేట్ చేయాల్సి ఉంది.  ధరణిలో ఇందుకు ప్రొవిజన్​ లేదు. పాత రెవెన్యూ రికార్డుల్లో ఖాతా నంబర్లు కలిగి ఉండి ధరణిలో మిస్సయిన వారికి ఖాతా నంబర్లు ఇచ్చేందుకు ఆప్షన్ ఇవ్వాలి. 
 11. కొన్ని ప్రభుత్వ భూములను ప్రొహిబిటెడ్​ ప్రాపర్టీస్​ జాబితాలో చేర్చలేదు. వీటిని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా చేర్చేందుకు కలెక్టర్లకు లాగిన్​ ఇవ్వాలి. 
 12. సిటిజన్​  లాగిన్​ ద్వారా పట్టాదారు పాస్​ బుక్  నంబర్లను​ ట్రేస్​ చేసే ఆప్షన్​ ఇవ్వాలి. 
 13. సర్వే నంబర్ల వారీగా ఎన్​కంబ్రెన్స్​ సర్టిఫికెట్స్(ఈసీ) ను చెక్​ చేసుకునే సౌకర్యం ధరణిలో అందుబాటులోకి తీసుకురావాలి. దీని ద్వారా ఆ భూమిపై గతంలో అన్ని లావాదేవీలను తెలుసుకునే అవకాశముంటుంది. 
 14. అగ్రికల్చర్​ ల్యాండ్స్​ కు ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు మీ-సేవాల ద్వారా జారీ కావడం లేదు. మీ -సేవ కేంద్రాల్లో అప్లయ్​  చేసుకుంటే ఈ సర్టిఫికెట్లు ఇచ్చేలా ఆప్షన్ ఇవ్వాలి.
 15. ఎన్నారైలకు మ్యుటేషన్​ ఆప్షన్ ప్రారంభించలేదు. ధరణికి ముందు ఎన్నారైలు రిజిస్ట్రేషన్​ చేసుకున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్​ చేసేలా ఆప్షన్  అందుబాటులోకి తేవాలి. 
 16. అన్​ సెటిల్డ్​ ఇనాం భూముల్లో సాగు చేసుకుంటున్నవారికి కొత్త ఆక్యుపెన్సీ  రైట్స్​ సర్టిఫికెట్లు జారీ చేసే ఆప్షన్ లేదు. అన్​ సెటిల్డ్ ఇనాం ల్యాండ్స్​ ను సెటిల్ మెంట్  చేసే ఆప్షన్​ ఇవ్వాలి. 
 17. డబుల్ ఖాతాలను మెర్జ్​ చేసే ఆప్షన్​ లేదు.  ఈ ఆప్షన్​ అందుబాటులోకి తేవాలి. 

ఇంకా ఎన్నో సమస్యలు

 • కొత్త పాస్ పుస్తకం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల 6 లక్షల ఖాతాలకు పాస్ పుస్తకాలు రాలేదు. డిజిటల్​ సైన్​ పెండింగ్​, ఆధార్​ సీడింగ్​ కాని భూములకు పాస్​ బుక్స్​ రాలేదు. 
 • ఎవరైనా వ్యక్తి తన వ్యవసాయ భూమిని బ్యాంకుకు మార్టిగేజ్​ చేసి అప్పు​ తీసుకున్నాక ఒక వేళ చనిపోతే ఇబ్బందులు తప్పడం లేదు. కుటుంబ సభ్యులు వచ్చి ఆ అప్పును బ్యాంకుకు చెల్లించినప్పటికీ... ఆ భూమి మార్టిగేజ్​ నుంచి రిలీజ్​ కావడం లేదు. మార్టిగేజ్​ నుంచి రిలీజ్​ కావడానికి తప్పనిసరిగా సదరు వ్యక్తి ఉండాల్సిందేనని అధికారులు అంటున్నారు. దీంతో భూమి బ్యాంకు పేరిటే ఉండిపోతోంది. 
 • మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్స్, పొలిటికల్ సఫరర్స్​కు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను కూడా ధరణి పోర్టల్​లో ప్రొహిబిటెడ్​ జాబితాలో పెట్టారు. వీటిని అసైన్డ్​ చేసినప్పటి నుంచి పదేండ్ల తర్వాత అమ్ముకునే హక్కు ఉన్నా.. ధరణి వల్ల సాధ్యం కావట్లే. 
 • అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఇలా 2 విభాగాలుగా రాష్ట్రంలోని భూములను విభజించి రిజిస్టర్​ చేస్తుండటంతో కొన్ని భూములు డూప్లికేట్ అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా భూములు వెంచర్లు, విల్లాలు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లుగా మారిపోయాయి. అలాంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూములు జాబితాలోనే ఉన్నాయి. ఆ సర్వే నంబర్ల భూములకు రైతుబంధు కూడా వస్తుంది. పాస్ పుస్తకాలు కూడా పాత ఓనర్ల పేర్ల మీదే ఉంటున్నాయి. దీంతో వాటిని పాత ఓనర్లే తిరిగి అమ్ముకునే వెసులు బాటు దక్కుతోంది.
 • కొందరు పట్టాదారులు తమ భూములను వేరొకరికి అమ్మి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్​ చేశారు. సదరు పట్టాదారుల పేరిట గానీ, కొనుగోలు చేసిన వ్యక్తుల పేరిట గానీ భూరికార్డుల ప్రక్షాళన సందర్భంలో పట్టాదారు పాస్​ బుక్కులు జారీ కాలేదు. కొనుగోలు చేసిన వ్యక్తులు ఇప్పుడు మ్యుటేషన్​ చేయించుకుందామంటే కావడం లేదు. 
 • ఎవరైనా ఇద్దరు పార్ట్ నర్లు కలిపి కొనుక్కున్న భూమిని అమ్ముకోలేని పరిస్థితి. జాయింట్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కు ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో కాలమ్‌‌‌‌‌‌‌‌  లేదు.

Tagged Telangana, CM KCR, Dharani portal, dharani problems

Latest Videos

Subscribe Now

More News