సహకార సొసైటీల్లో బదిలీలకు రంగం సిద్ధం .. జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం

సహకార సొసైటీల్లో బదిలీలకు రంగం సిద్ధం .. జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం
  • సీఈవోలతోపాటు స్టాఫ్‌‌ అసిస్టెంట్ల బదిలీ 
  • ఇక వారికి స్థానచలనమే
  • త్వరలో గైడ్ లైన్స్ విడుదల 

నల్గొండ, వెలుగు :  ఏండ్ల తరబడి సహకార సొసైటీల్లో ఉద్యోగులు తిష్ట వేసి అక్రమాలకు పాల్పడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా వీరిని బదిలీ చేసే అవకాశం లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్లను లెక్కచేయకుండా పెత్తనం చెలాయించేవారు. ఈ నేపథ్యంలో ఏండ్ల తరబడి తిష్ఠవేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌‌‌‌) సీఈవోలను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల జీవో నంబర్​44ను  ప్రభుత్వం జారీ చేసింది. 

ఏండ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 107 పీఏసీఎస్ లు ఉండగా, చాలా సొసైటీల్లో 30 ఏండ్లకుపైగా సీఈవోలు తిష్ఠవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు 107 ఏండ్లకుపైగా చరిత్ర ఉంది. ప్రతీ సొసైటీకి చైర్మన్‌‌ ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సీఈవోలు మాత్రం ఉద్యోగ విరమణ చేసేవరకు తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం డీసీసీబీ బ్యాంకు రూ.2,750 కోట్ల టర్నోవర్‌‌ సాధించింది. ఈ నేపథ్యంలో సొసైటీల సీఈవోలతోపాటు స్టాఫ్‌‌ ను బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మూడు నుంచి ఐదేండ్లు సర్వీస్‌‌ పూర్తయిన వారిని బదిలీ చేయాల్సి ఉండగా, ఏండ్ల తరబడి ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. 

జీవో నంబర్ 44 విడుదల.. 

సొసైటీల్లో ఏండ్ల తరబడి ఉద్యోగుల బదిలీలు లేవని డీసీసీబీ చైర్మన్‌‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా సీఎం రేవంత్‌‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌రావు ఆదేశాలతో ఉద్యోగుల బదిలీలకు జీవో నంబర్​ 44ను జారీ చేశారు. స్టేట్‌‌ లెవల్‌‌ ఎన్‌‌పవర్‌‌మెంట్‌‌కమిటీ (ఎస్‌‌ఎల్‌‌ఈసీ) మార్గదర్శకాల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 107 సొసైటీలకు చెందిన సీఈవోలను, స్టాఫ్‌‌ అసిస్టెంట్లను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే వీలుంది. ఇప్పటివరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతోపాటు బ్రాంచ్​ల్లో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారుల వరకు బదిలీలు చేపట్టారు. సొసైటీల్లో మాత్రం సీఈవోల బదిలీ జరగలేదు. 

ఏండ్ల కొద్దీ సొసైటీల్లో సీఈవోలు కొనసాగుతూ వచ్చారు. కొన్ని నెలల క్రితం సొసైటీల పాలకవర్గాలు సీఈవోలను తొలగించాలని తీర్మానాలు చేసి డీసీఈవోలతోపాటు డీసీసీబీ సీఈవో, టెస్కాబ్‌‌కు సైతం పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో డీసీసీబీ చైర్మన్‌‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యాక.. జిల్లా కేంద్రంలో జరిగిన మొదటి సమావేశంలోనే సీఈవోల బదిలీల కోసం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసేలా కృషి చేస్తానని 
హామీ ఇచ్చారు. 

త్వరలో బదిలీ ప్రక్రియ ప్రారంభం..

సీఈవోలు, స్టాఫ్‌‌ అసిస్టెంట్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎస్‌‌ఎల్‌‌ఈసీ సమావేశం హైదరాబాద్‌‌లో త్వరలో  నిర్వహించనున్నారు. ఎస్‌‌ఎల్‌‌ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డీఎల్‌‌ఈసీ సమావేశం నిర్వహిస్తారు. గతంలో డిస్ట్రిక్‌‌ లెవల్‌‌ ఎంపవర్డ్‌‌ కమిటీ(డీఎల్‌‌ఈఎస్‌‌) ఏనాడూ భేటీ అయిన సందర్భం లేదు. ఈ కమిటీలో డీసీసీబీ చైర్మన్‌‌తోపాటు డీసీసీబీ సీఈవో, డీసీవో, నాబార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఉంటారు. ఎట్టకేలకు బదిలీల జీవో జారీ కావడంతో డీఎల్‌‌ఈఎస్‌‌ భేటీ అయి దీర్ఘకాలికంగా తిష్ఠవేసిన సీఈవోలకు స్థానచలనం కల్పించనున్నారు.

పారదర్శకంగా బదిలీలు  

ఎస్‌‌ఎల్‌‌ఈసీ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. అందుకు త్వరలోనే కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం. ఏండ్లుగా  ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న సీఈవోలను బదిలీ చేయాలని పాలకవర్గం ప్రభుత్వాన్ని కోరడంతో జీవో 44ను జారీ చేసినందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రులకు ధన్యవాదాలు. 

కుంభం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌‌