శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది

శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది
  • కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ 
  • తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తున్నది 
  • ఇప్పటికే 51 టీఎంసీలు అదనంగా తీసుకుంది
  • తాగునీటి కోసం తెలంగాణకు వెంటనే 12 టీఎంసీలు ఇవ్వండి 
  • ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

హైదరాబాద్, వెలుగు: తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రీశైలం నుంచి ఏపీ విచ్చలవిడిగా నీటిని తోడేస్తున్నదని తెలంగాణ మండిపడింది. ఆ రాష్ట్రం  తాగునీటి పేరుతో సాగుకు నీళ్లను మళ్లిస్తున్నదని, ఇప్పటికే 51 టీఎంసీలను అదనంగా తరలించుకుపోయిందని ఫైర్ అయింది. ఈ మేరకు గురువారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్​శివనందన్ కుమార్ కు నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్​బొజ్జా లేఖ రాశారు.

 ‘‘సరిపడా వర్షాలు పడనందున సాగుకు కాకుండా కేవలం తాగునీటి కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాలని నిరుడు అక్టోబర్​లో కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. కానీ ఆ ఆదేశాలను ఏపీ ఉల్లంఘిస్తున్నది. సాగు కోసం నీళ్లను మళ్లిస్తున్నది. బేసిన్​అవతలికి నీటిని తీసుకుపోతున్నది. అలా నీళ్లు తీసుకుపోకుండా అడ్డుకోండి” అని లేఖలో కోరారు. ‘‘చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు మినహా కృష్ణా బేసిన్​అవతలకు నీటిని తరలించకూడదని జరిగిన ఒప్పందాన్ని ఏపీ కాలరాస్తున్నది. 

హైదరాబాద్​అవసరాలను కాదని చెన్నైకి నీటిని తరలించాలన్న రూల్ ఏమీ లేదు. చెన్నై కోసం హైదరాబాద్​అవసరాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. చెన్నైకి తాగునీటి అవసరాల పేరు చెప్పి ఏపీ ఇప్పటికే అదనంగా 51 టీఎంసీలను తరలించుకుపోయింది. ఇప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్​ఫోర్​షోర్​లోని ముచ్చుమర్రి నుంచి నీటిని తరలించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇంకో చుక్క నీరు కూడా తీసుకోకుండా ఏపీని అడ్డుకోండి” అని విజ్ఞప్తి చేశారు. 

వాడుకోని నీళ్లను క్యారీ ఫార్వర్డ్​ చేయండి.. 

2022–23, 2023–24 వాటర్​ఇయర్స్​లో తెలం గాణ 18.7 టీఎంసీలను వాడుకోలేదని, ప్రస్తుతం నీటి ఎద్దడి ఉన్నందున ఆ నీళ్లను వాడుకునేలా క్యారీ ఫార్వర్డ్​చేయాలని కేఆర్ఎంబీని రాష్ట్ర సర్కార్ కోరింది. ‘‘మేం క్యారీ ఫార్వర్డ్​నీళ్లు సహా మొత్తం 27 టీఎంసీలకు పైగా నీళ్లను తాగు నీటికి వాడుకునేలా అనుమతివ్వండి. ఆ 27 టీఎంసీలలో ప్రస్తుతం జూరాల, రామన్​పాడు రిజర్వాయర్, శ్రీశైలం (ఎల్లూరు రిజర్వాయర్), పాలేరు, ఉదయసముద్రం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్​రిజర్వాయర్, పెండ్లిపాక రిజర్వాయర్ల నుంచి 11.769 టీఎంసీలను తాగునీటి కోసం వాడుకునేందుకు అనుమతివ్వండి. మిగతా 15.231 టీఎంసీల జలాలను వచ్చే వాటర్ ఇయర్ (2024–25)కు క్యారీ ఫార్వర్డ్ చేయండి. అందుకు తగ్గట్టుగా నీటి వాటాలను రివైజ్​చేయండి” అని విజ్ఞప్తి చేసింది. 

పులిచింతల నుంచి ఏపీని తీసుకొమ్మనండి.. 

గతంలో ఉమ్మడి ఏపీలో మిగిలిన జలాలను వాడుకునేలా కేడబ్ల్యూడీటీ 1 అనుమతిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. 25 శాతం లోటు సంవత్సరాల్లోనూ స్కీమ్–ఏ కింద  ఉమ్మడి ఏపీకి నీటిని క్యారీ ఫార్వర్డ్​చేసిన సందర్భాలున్నాయని చెప్పింది. ‘‘మహారాష్ట్ర, కర్నాటక కన్నా తీవ్రమైన పరిస్థితులు ఏపీకే ఉన్నందున.. నీటిని క్యారీ ఫార్వర్డ్​చేసేలా చూడాలంటూ కేడబ్ల్యూడీటీ 1 ముందు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వాదించింది. 

అప్పటి నుంచి స్కీమ్–ఏ అమలవుతున్నది. అయితే ఇప్పుడు మేం వాడుకోని నీటిని క్యారీ ఫార్వర్డ్​చేసుకోకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నది. కాబట్టి ఏపీ వాదనను పక్కనపెట్టి మేం వాడుకోకుండా మిగిలిన వాటర్​ను వాడుకునేందుకు అనుమతివ్వండి. ఏపీకి పులిచింతలలో 5 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి ఎమర్జెన్సీ వస్తే తుంగభద్రతో పాటు పులిచింతల నుంచి నీళ్లను తీసుకొమ్మని చెప్పండి” అని కోరింది.

మాకే ఎక్కువ నీళ్లు అవసరం..

ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో జనాభా ఎక్కువని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘‘నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ జనాభా 2 కోట్లకు పైనే. కానీ ఏపీలో కేవలం 78 లక్షలు మాత్రమే. రోజువారీ తలసరి వినియోగం 150 లీటర్ల లెక్కన తెలంగాణకు 46.4 టీఎంసీలు అవసరమైతే, ఏపీకి 18 టీఎంసీలు సరిపోతాయి. 

తమకు తాగునీటి కోసం 8.85 టీఎంసీలు చాలంటూ కేడబ్ల్యూడీటీ 2కి ఏపీ డీపీఆర్​ఇచ్చింది. మిషన్​భగీరథ కింద 24 టీఎంసీలు, హైదరా బాద్ డ్రింకింగ్​వాటర్​ కోసం 16 టీఎంసీలు సహా 40 టీఎంసీలు అవసరమని తెలంగాణ డీపీఆర్​ఇచ్చింది. వీటన్నింటినీ తుంగలోకి తొక్కిన ఏపీ.. సాగు నీటి కోసం శ్రీశైలం నుంచి నీళ్లను తరలించుకుపోతున్నది” అని లేఖలో వివరించింది.