ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ ఇండ్లు .. రివ్యూ మీటింగ్​లో పంచాయతీ రాజ్ ​మంత్రి సీతక్క

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ ఇండ్లు .. రివ్యూ మీటింగ్​లో పంచాయతీ రాజ్ ​మంత్రి సీతక్క
  • త్వరగా గ్రౌండింగ్​ చేసి నిర్మాణాలకు ముగ్గు పోయాలి
  • పోడు భూముల జోలికి పోవద్దు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకే ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం సాంక్షన్​చేసిందని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ ​శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ట్రైబల్ ఏరియా కింద మరో 12 వేల ఇండ్లు వచ్చాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నిర్మాణాలకు ముగ్గు పోసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విస్తీర్ణంలో మెట్లు, టాయ్ లెట్స్​ను మినహాయించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. 

శనివారం మంచిర్యాల కలెక్టరేట్​లో కలెక్టర్ కుమార్​ దీపక్​ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం సేకరణ, భూభారతి, వానాకాలం సాగుకు సన్నద్ధతపై నిర్వహించిన రివ్యూ మీటింగ్​కు సీతక్క చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్​ లోకల్ ​బాడీ ఎమ్మెల్సీ దండె విఠల్, కరీంనగర్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బెల్లంపల్లి, మంచిర్యాల, ముథోల్​ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ప్రేమ్​సాగర్​రావు, రామారావు పటేల్, జీసీసీ చైర్మన్​ కొట్నాక తిరుపతి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, వెంకటేశ్ ​ధోత్రే, ఉట్నూర్ ​ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా, అడిషనల్​ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.

యాక్షన్ ప్లాన్​తో రెడీగా ఉండాలి

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఆదివాసీ గిరిజన రైతులు దున్నుకుంటున్న పోడు భూముల జోలికిపోవద్దని, జాయింట్ సర్వే తర్వాతే వాటిపై నిర్ణయం తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్స్ డీలర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెడుతామని వార్నింగ్ ఇవ్వాలన్నారు. ముందుంగా వర్షాలు రావడంతో ఖరీఫ్ సీజన్ 20 రోజులు ముందుకు జరిగిందని, దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రెడీగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఫ్లడ్ ​మేనేజ్​మెంట్​కమిటీలు ఏర్పాటు చేసి ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కిశోర బాలికల కోసం ఇందిరమ్మ అమృత పథకం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కీల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ఈ సందర్భంగా ప్రారంభించారు. 

ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పేదొకటి.. చేసేదొకటి: ఎమ్మెల్సీ దండె విఠల్

ఫారెస్ట్ అధికారులు చెప్పేదొకటి, చేసేదొకటి. రైతులు పొలాలకు వెళ్లి దున్నుకునే టైమ్ లో ఇబ్బంది పెడుతున్నరు. దిందా గ్రామంలో 40 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఈసారి దున్నుకోకుండా అడ్డుకుంటున్నరు. జైహింద్​​పూర్​లో 200 మంది సిబ్బందితో వెళ్లి రైతులను భయబ్రాంతులకు గురిచేసిన్రు. ఆసిఫాబాద్​జిల్లాలో 74 గ్రామాల్లో 35 వేల ఎకరాల్లో పోడు సమస్య ఉన్నది. ఏదైనా ఉంటే పంట సీజన్ తర్వాత చూడాలి. 

ఇప్పుడు వారిని డిస్ట్రబ్ చేయొద్దు. పైలట్​ గ్రామాల్లో 570 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఫారెస్ట్ ఇస్యూస్ వల్ల ఆగిపోయాయి. మేం ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. అటవీ సమీప గ్రామాలను రెవెన్యూ విలేజ్​గా ప్రకటించాలి. రాజీవ్ యువ వికాసం స్కీమ్​లో సిబిల్​స్కోర్​ లేక రిజెక్ట్​అయిన వారికి కూడా రూ.లక్ష విలువైన యూనిట్లు సాంక్షన్​చేయాలి. జిల్లాలో సేకరించిన వడ్లను లోకల్ ​మిల్లులకే కేటాయించాలి. 

600 ఫీట్ల రూల్ సడలించాలి: ఎమ్మెల్యే పీఎస్సార్​

ఇందిరమ్మ ఇండ్లు 400 నుంచి 600 ఫీట్లకు మించరాదన్న రూల్స్ సడలించాలి. మెట్లు, టాయ్​లెట్స్​ బయట నిర్మించుకునేందుకు పర్మిషన్​ఇవ్వాలి. ఫారెస్టు పర్మిషన్లు రాకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఆగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎండాకాలంలో ఇండ్లు కాలిపోయినా, వర్షాకాలంలో కూలిపోయిన బాధితులకు సైతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్​యూనిట్లకు సబ్సిడీ ఇస్తోందని, ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. 

ఎరువులు, విత్తనాలకు కొరత లేదు: కలెక్టర్ ​కుమార్​ దీపక్

మంచిర్యాల జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. కానీ పచ్చిరొట్ట విత్తనాల కొరత ఉంది. డిమాండ్​కు సరిపడా సప్లై చేయాలి. నకిలీ సీడ్ 7 కేసుల్లో 36 మందిపై కేసులు నమోదు చేశాం. నకిలీ విత్తనాలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.  

ఫారెస్ట్ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నయ్. అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నరు. దీనిపై ఢిల్లీకి డెలిగేషన్ తీసుకెళ్లి సంబంధిత మంత్రులను, అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించాలి. కాంట్రాక్టర్లకు పెండింగ్​ ఉన్న బిల్లులను ప్రయారిటీ ప్రకారం చెల్లించాలి. వెనుకబడిన ప్రతి నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. ఇల్లు కట్టుకోవడానికి రూ.లక్ష లోన్​ఇప్పించాలి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు ఇప్పించాలని కోరగా.. ఎస్టిమేషన్ పంపాలని మంత్రి సూచించారు.