గుడ్ న్యూస్.. 21 రకాల వస్తువులతో ..విద్యార్థులకు స్పెషల్ కిట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిఫాం

గుడ్ న్యూస్..  21 రకాల వస్తువులతో ..విద్యార్థులకు స్పెషల్ కిట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిఫాం

తెలంగాణ విద్యాశాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం సరికొత్త స్పెషల్ కిట్ ను అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. కేవలం పుస్తకాలు, బట్టలు మాత్రమే కాదు.. ఏకంగా 21 రకాల వస్తువులతో కూడిన స్పెషల్ స్కూల్ కిట్‌ను విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 

దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రకమైన స్కూల్ డ్రెస్ (యూనిఫాం) అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులందరిలో సమానత్వ భావం పెంపొందుతుందని విద్యాశాఖ భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ వ్యవస్థల్లో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో గురుకుల పాఠశాలల్లోనే అత్యధికంగా 19 లక్షల మంది ఉన్నారు. ఇతర ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మరో 7 లక్షల మంది ఉన్నారు. 

వచ్చే విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) నుంచే ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏప్రిల్ 1న  ఈరోజే అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల సెక్రటరీలతో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది.