స్టేటస్ రిపోర్ట్కు టైం ఇవ్వండి..ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

స్టేటస్ రిపోర్ట్కు టైం ఇవ్వండి..ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు:  ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, అందువల్ల స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకోసం రెండు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్  హయాంలో ఎస్‌‌ఐబీ కేంద్రంగా ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు జరిగినట్లు పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్‌‌లో 2023 మార్చి 10న కేసు ఫైల్ అయింది. ఈ కేసులో ఏ1 గా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ ఐబీ మాజీ చీఫ్  ప్రభాకర్‌‌రావు.. అప్పట్లో దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారు.

తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, స్వదేశానికి తిరిగివస్తానని పేర్కొంటూ అప్పట్లోనే  హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మే నెల 2న ముందస్తు బెయిల్ నిరాకరించగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అదే నెల 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. మే 29న ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కల్పించింది. తొలుత స్వదేశానికి రానివ్వండీ అని, వచ్చిన తర్వాత ఎలాంటి బలవంతపు చర్యలు(అరెస్ట్) చేయొద్దని ఆదేశించింది.

ఈ ఉత్తర్వుల నేపథ్యంలో అమెరికా నుంచి దేశానికి తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు పలుమార్లు సిట్ దర్యాప్తుకు హాజరయ్యారు. కాగా, గతంలో ప్రభాకర్ రావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్  మంగళవారం మరోసారి జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నదని, స్టేటస్ రిపోర్టు దాఖలుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్దార్థ లూత్రా అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమలులో ఉంటాయని తెలిపింది.