నీళ్ల కరువుపై మేలుకోండి.. బెంగళూరు పరిస్థితి ఇక్కడ రానివ్వద్దు

నీళ్ల కరువుపై మేలుకోండి.. బెంగళూరు పరిస్థితి ఇక్కడ రానివ్వద్దు
  • ప్రభుత్వ అధికారులకు హైకోర్టు హెచ్చరిక
  • నీటి లభ్యత, వినియోగాన్ని బేరీజు వేసుకోవాలని సూచన 

హైదరాబాద్, వెలుగు: నీటి సమస్య తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వ అధికారులు మేల్కొనాలని హైకోర్టు హెచ్చరించింది. నీటి లభ్యత, వినియోగం వంటివి బేరీజు వేసుకోకపోతే ఇప్పుడు బెంగళూరులో నెలకొన్న తీవ్ర గడ్డు పరిస్థితులు రేపు మనకు కూడా రావచ్చని పేర్కొంది. హైదరాబాద్‌–-సికింద్రాబాద్‌ ట్విన్‌ సిటీస్‌లో నీటి సమస్య తీవ్రంగా ఉందంటూ నగరానికి చెందిన పీఆర్‌ సుభాష్‌ చంద్రన్‌ 2005లో రాసిన లెటర్‌ను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేస్తోంది. అయితే, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని ప్రభుత్వ ప్లీడర్‌ చెప్పడంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక విషయం అనుకోవద్దని, ప్రజల నిత్యావసర అంశమని తేల్చిచెప్పింది. నీటి సమస్యపై గతంలో జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై శనివారం తదుపరి విచారణలో రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్ తో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రజాకార్‌ విడుదలపై స్టేకు నో   

రజాకార్‌ సినిమా రిలీజ్‌ను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)లోని అప్పీలేట్‌ అథారిటీ వద్దకు వెళ్లకుండా కోర్టుకు రావడాన్ని ఆక్షేపించింది. అథారిటీని కలిస్తే రివ్యూ కమిటీలను వేసి మరోసారి సినిమా చూసి అభ్యంతరాలపై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. సమర్‌ వీర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన రజాకార్‌ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో శుక్రవారం రిలీజ్‌ కానుంది. అయితే, ఈ సినిమా మత విద్వేషాలు రగిల్చేలా ఉందంటూ ఢిల్లీకి చెందిన ఏపీసీఆర్‌ కార్యదర్శి మహ్మద్‌ వాసిక్‌ నదీమ్‌ ఖాన్‌ పిటిషన్ వేయగా.. హైకోర్టు ఈ మేరకు పిటిషన్ ను తోసిపుచ్చింది. 
 
28న బార్‌ అసోసియేషన్లకు ఎన్నికలు

రాష్ట్రంలోని అన్ని బార్‌ అసోసియేషన్లకు ఈ నెల 28న ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ. నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు ఏప్రిల్‌ 1న బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. 

16న జాతీయ లోక్‌ అదాలత్‌

ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు, ఎక్సైజ్‌ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనియల్, సివిల్‌ కేసుల్లో రాజీ కోసం శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) సభ్య కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఫిజికల్‌గా, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైకోర్టుతో పాటు తాలూకా కోర్టుల్లోనూ లోక్‌ అదాలత్‌ ఉంటుందన్నారు. కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, న్యాయసేవా సదన్, మండల న్యాయసేవా కమిటీలను సంప్రదించాలని సూచించారు.  

సిర్పూర్కర్‌ రిపోర్టును రద్దు చెయ్యాలి


దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై జస్టిస్‌ సిర్పూర్కర్‌ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస విజయసేన్‌రెడ్డి విచారించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పది మంది పోలీసులను బాధ్యులుగా పేర్కొంటూ జస్టిస్‌ సిర్పూర్కర్‌ ఇచ్చిన రిపోర్టును పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు సవాల్ చేశారు. దర్యాప్తు చేయకుండా పోలీసులను బాధ్యులుగా పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. దీనిపై తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.