తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సమీక్షించాలి

తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని సమీక్షించాలి

ఇటీవల ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త స్థితిని సంతరించుకున్నది. గత పదేండ్ల పాలన పద్ధతి, సంస్కృతి పోయి స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది. ప్రజలకు తమ ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకునే అవకాశం వచ్చింది అని భావిస్తున్నారు. 7, డిసెంబర్ 2023 నాడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్రం ప్రగతికోసం ఉమ్మడి ఆలోచనలతో  కూడిన సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయాలి.  కొత్త  ప్రభుత్వం రెండు అడుగులు ముందుకువేసి పరిశ్రమల అభివృద్ధి అంశం తెర మీదికి తెచ్చింది.

పరిశ్రమల అభివృద్ధి భూమి, నీరు, ఉపాధితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి వనరుల మీదనే పరిశ్రమల అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఉద్యోగాలతోపాటు ఆయా పారిశ్రామిక ఉత్పత్తుల స్థానిక అవసరం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాకపోతే ఇవేమీ పట్టించుకోకుండా గత ప్రభుత్వ పెద్దలు ‘రియల్ ఎస్టేట్’ రంగానికి ఊతం ఇవ్వడానికి పరిశ్రమల ఏర్పాటును అవకాశంగా మలుచుకున్నారు. ఏ పరిశ్రమ ఎక్కడ రావాలి అనేది కేవలం పారిశ్రామికవేత్తలు, మంత్రులు నిర్ణయించడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తింది.  పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేస్తాం.

అనుమతులు సరళీకృతం చేస్తాం. సూటుకేసుతో వచ్చిన అతిథికి విమానాశ్రయంలో స్వాగతం పలికి అన్ని  అనుమతులు ఇచ్చి, మళ్లీ విమానంలో సాగనంపుతం అని గత సీఎం ప్రకటించడం గర్హనీయం. తెలంగాణాకు ఒక రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకటించకుండా ఫక్తు వ్యాపారవేత్త మాదిరి ప్రభుత్వ పెద్ద వ్యవహరించడం శోచనీయం. 

పేదల భూమి పెద్దలకు

FY 2022–-23లో TSIIC 8,560 ఎకరాల్లో 19 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిందని గత ప్రభుత్వం నివేదించింది. భూమి పేదల నుంచి తీసుకొని పెద్దలకు అంటగట్టడానికి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక పార్కు ఏర్పాటు అయితే  మళ్లీ అవసరమైతేనే ఇంకొక పార్కు ఏర్పాటు చెయ్యాలి. కానీ, తెలంగాణాలో ఒక పరిశ్రమ పెట్టుబడికి ముందుకువస్తే వారి కోసం ఒక పార్కు ఏర్పాటు చేసి, వ్యవసాయ భూమిని మార్పు చేస్తున్నారు. అన్ని పారిశ్రామిక పార్కులలో ఖాళీ స్థలం దాదాపు 30 నుంచి 90 శాతం వరకు ఉన్నది. 2014-–23 మధ్య 35,581 ఎకరాల భూమిలో 109 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఆ భూమిలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయనే విషయం కూడా స్పష్టం చెయ్యాలి.

పరిశ్రమకు 10 ఎకరాల చొప్పున తీసుకున్నా 3,558 పరిశ్రమలు వచ్చి ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లాలో అమరరాజ బ్యాటరీ పరిశ్రమ కోసం ఒక పారిశ్రామికవాడ ఏర్పాటు అయ్యింది. రంగారెడ్డి జిల్లా చందన్​వెల్లి దగ్గర వెల్ స్పూన్ పరిశ్రమ కోసం ఒక పార్కు, వరంగల్​లో ఒక కొరియా కంపెనీకి మెగా టెక్స్​టైల్ పార్కు ఏర్పాటు చేశారు. మూసీ నది పుట్టే ప్రదేశంలో కాలుష్యం చేసే ఫోర్జింగ్ యూనిట్లకు అనుమతిచ్చారు. 

కాలుష్య నివారణకు శ్రద్ధ చూపాలి

హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం మొదట 3 వేల ఎకరాలతో మొదలయి 19,333 ఎకరాలు సేకరించాలనుకున్నది. ఇందులో పరిశ్రమలకు ఇవ్వాలనుకున్నది కేవలం 7 వేల ఎకరాలు. ఫార్మా పరిశ్రమలు అడిగింది 5 వేల ఎకరాల వరకు. మిగతా 12 వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి. ఇవి కూడా కొత్త పరిశ్రమలు కావు. హైదరాబాద్​లో కాలుష్యం చేస్తున్నారు కనుక వీటిని తరలిస్తామని ప్రభుత్వ పేర్కొంది. మరి, అక్కడ ఇచ్చిన భూమి మాట ఏమిటి? కాలుష్య నివారణ మీద ఎవరికీ శ్రద్ధ లేదు. అక్కడ కాలుష్యం ఓపలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొత్త ప్రాంతానికి తరలిస్తాం అంటున్నారు. కానీ, ప్రకృతి వనరులను కాలుష్యం చేసే పరిశ్రమలకు అన్ని వనరులను దగ్గర ఉండి అందిస్తున్నాయి ఈనాటి ప్రభుత్వాలు.

సిరిస్ పరిశ్రమ సరూర్ నగర్ ప్రాంతంలో కాలుష్యం చేసి, మూసేసి, భూమిని అమ్ముకుంటే, అక్కడ పెద్ద బిల్డింగులు వచ్చినా భూగర్భ జలాలు వాడలేని పరిస్థితి.  జహీరాబాద్​ నిమ్స్​కోసం పడావు భూములు అని తప్పుడు నివేదికలు ఇచ్చి పచ్చని పొలాలను మారుస్తున్నారు. నగరంలోపట నిజాం కాలంలో పరిశ్రమలకు భూములు ఇస్తే వాటిని ‘రియల్ ఎస్టేట్’ లాభాలకు వాడుకున్నారు. ఇప్పుడు, అజామాబాద్, జీడిమెట్ల తదితర పారిశ్రామిక ప్రాంతాలు అవే బాటలో ఉన్నాయి. 

భూగర్భ జలాలు కలుషితం

కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష్యం తెలంగాణా వ్యవసాయానికి మూడు పంటలకు నీళ్లు ఇవ్వడానికి అని ప్రభుత్వం ప్రకటించింది. కట్టడానికి అప్పులు తెచ్చింది. అప్పుల భారం అందరి మీద ఉండగా ఈ నీటిని 25 శాతం పరిశ్రమలకు ఇచ్చేస్తారు. అప్పులు ఇచ్చిన బ్యాంకులకు పరిశ్రమలకు నీళ్లు ఇచ్చి అప్పు తీరుస్తామని హామీ ఇచ్చింది. డిండి రిజర్వాయర్ కింద హైదరాబాద్ ఫార్మా సిటీకి, జూరాల రిజర్వాయర్ క్రింద ఒక పరిశ్రమకు, జహీరాబాద్​లో నారింజ రిజర్వాయర్ కింద ఒక పారిశ్రామిక పార్కు, ఇట్లా ప్రతి పరిశ్రమకు సమీప ఆనకట్టల నీళ్లు ఇస్తున్నారు. సింగూర్ రిజర్వాయర్ హైదరాబాద్ తాగునీటి కోసం కట్టారు.

తోవలో డిస్టిల్లరీ పరిశ్రమలకు నీళ్లు ఇస్తున్నారు. ఎండా కాలం నీటి ఎద్దడి ఉన్నా మంచి నీటి సరఫరా కంటే ఈ పరిశ్రమలకు సరఫరా చేయడం ప్రాధాన్యతగా భావిస్తారు అధికారులు. ఈ నీటిని ప్రజల మంచి నీటి అవసరాలకు కాకుండా, వ్యవసాయానికి కాకుండా, ప్రజల సొమ్ముతో సబ్సిడీకి ఇస్తే, పరిశ్రమలు తిరిగి ఇస్తున్నది లక్షల లీటర్ల ప్రమాదకర వ్యర్థ జలాలు. తెలంగాణాలో అనేక ప్రాంతాలలో భూగర్భ జలాలు ఈ వ్యర్థాల వల్ల కలుషితం అయినాయి. 

పారిశ్రామిక భూసేకరణపై అధ్యయనం చేయాలి

కాలుష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా, పక్కన కూసోబెట్టుకుని సబ్సిడీలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ప్రసిద్ధి చెందింది. అందుకే, ఇక్కడ ‘రెడ్’ క్యాటగిరీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తూప్రాన్, సిద్ధిపేట ప్రాంతాలలో ఫార్మా పరిశ్రమాధిపతులు వందల ఎకరాలు భూములు కొన్నారు.  ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా  రింగ్ రోడ్డు అవతల 9 ఫార్మా పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అధ్యయనం చేయకుండా, తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం తొందర పడడం మంచిది కాదు. ఉన్న పారిశ్రామిక భూమిని వాడుకున్న తరువాతనే భూసేకరణ జరపాలి.

పారిశ్రామిక భూసేకరణకు ఒక ప్రక్రియ ప్రకటించాలి.  స్థానిక ప్రకృతి వనరులను సుస్థిరంగా వాడే పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను అధ్యయనం చేసి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం దన్నుగా నిలవాలి. స్థానికులకు ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. విస్తృత సంప్రదింపుల అనంతరం కొత్త తెలంగాణ పారిశ్రామిక విధానం రావాలి.  కాలుష్య పరిశ్రమల మీద చర్యలు చేపట్టాలి. వాటి వలన నష్టపోయిన స్థానిక ప్రజలకు న్యాయం చెయ్యాలి.

స్థానికుల హక్కులను విస్మరించిన బీఆర్ఎస్​

టీఎస్–ఐపీఎఎస్ఎస్​ ద్వారా  ఎక్కడి నుంచో వచ్చే పెట్టుబడిదారునికి చట్టపరమైన హక్కులు కల్పించిన ప్రభుత్వం స్థానికుల హక్కుల రక్షణను పట్టించుకోలేదు. మొత్తంగా ఈ విధంగా వచ్చినవి 22,745 పరిశ్రమలు, పెట్టుబడులు రూ.2,60,060 కోట్లు, 17.54 లక్షల మందికి ఉద్యోగకల్పన అని గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కలు విశ్వసనీయంగా లేవు. ఈ పద్ధతిలో అనేక సబ్సిడీలు ఇచ్చారు. ఎవరికి ఎంత ఇచ్చారు? అనే ప్రశ్నకు పారదర్శక సమాచారం లేదు.

దీని మీద అధ్యయనం చేసి, విచారించి ఫలితాలు ప్రజల ముందు పెట్టాలి. నిజంగా ఉపయోగపడి ఉంటే అధ్యయన ఫలితాల మేరకు అందులో మార్పులు చేసి పారిశ్రామిక అభివృద్ధికి ఊతంగా వాడుకోవచ్చు. కానీ, ఏమీ పరిశీలించకుండా కొన్ని రోజుల నిడివిలో అనుమతులు ఇవ్వడం అంటే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీయడమే.

పేద రైతుల క్షోభ

టీఎస్-ఐపీఎఎస్ఎస్ ద్వారా వచ్చినాయని చెబుతున్న 22,745 పరిశ్రమలు వేరు, 109 ఇండస్ట్రియల్ పార్కులలో ఏర్పాటైన పరిశ్రమలు వేరు అనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఉన్న అనేక పారిశ్రామిక పార్కుల్లో  ఇప్పటికీ ఖాళీ స్థలం ఉన్నది. పాశంమైలారం, జీడిమెట్ల వంటి పారిశ్రామిక వాడల్లో ఖాళీ జాగా, ఖాయిలా పరిశ్రమలు ఉన్నాయి. TSIIC దగ్గర 2.5 లక్షల ఎకరాల భూ బ్యాంకు ఉన్నది. ఇంత భూమి ఉన్నా

పరిశ్రమల ఏర్పాటు ముఖ్యం అనుకుంటే కొత్తగా భూములు ఎందుకు తీసుకుంటున్నారు?  ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం కూడా కొత్తగా భూసేకరణ అయ్యింది. పచ్చటి చిత్తనూరు పొలాల మధ్య ఒక పరిశ్రమ, ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ పక్కన స్తంభాలపల్లిలో ఒక పరిశ్రమ, ఇంకా అనేక చోట్ల పరిశ్రమలు భూములు కొని, ప్రజల అనుమతి లేకుండా, ప్రభుత్వ పెద్దల అండలతో ప్రజల జీవనాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నారు. 

-  డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​