అధిక పెట్రోల్​, డీజిల్​ ధరల్లో తెలంగాణే సెకండ్.. వ్యాట్​లో ఫస్ట్​

అధిక పెట్రోల్​, డీజిల్​ ధరల్లో తెలంగాణే సెకండ్.. వ్యాట్​లో ఫస్ట్​
  • లిక్కర్​ రేట్లు తగ్గిచ్చిన్రు.. మరి పెట్రోల్​, డీజిల్​ మాటేంది? 
  • సేల్స్​ పెంచుడే టార్గెట్​గా మందు ధరలు దించిన రాష్ట్ర సర్కారు
  • పెట్రోల్​, డీజిల్​పై కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్​ డ్యూటీని, ఇతర స్టేట్స్​ వ్యాట్​ను తగ్గించినా మన దగ్గర తగ్గిస్తలే​
  • అధిక పెట్రోల్​, డీజిల్​ ధరల్లో తెలంగాణే సెకండ్.. వ్యాట్​లో ఫస్ట్​
  • పెట్రోల్​పై 35.2%.. డీజిల్​పై 27% చొప్పున వ్యాట్​ వసూలు
  • వాటి ధరలు తగ్గిస్తేనే నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గేది

హైదరాబాద్​, వెలుగు: కోటర్​ సీసా మీద 10, హాఫ్​ మీద 20, ఫుల్​ బాటిల్​ మీద 40 రూపాయలు.. ఇట్లా లిక్కర్​ రేట్లు తగ్గించిన రాష్ట్ర సర్కారు.. పప్పు, ఉప్పు, పాలు, కూరగాయలు, పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​  వంటి నిత్యావసరాలపై  ప్రభావం చూపే, జనానికి అత్యవసరమైన పెట్రోల్​, డీజిల్​ రేట్లను మాత్రం తగ్గిస్తలేదు. మందు అమ్మకాలు తగ్గినయని, ఇంకింత తాగించాలన్న లక్ష్యంతో లిక్కర్​ రేట్లను తక్కువ చేసింది. సేల్స్​ను 10 శాతం ఎక్కువ చేయాలని ఆఫీసర్లకు టార్గెట్లు కూడా పెట్టింది. మందు రేట్లు తగ్గించుడు సరే.. పెట్రోల్, డీజిల్​ ధరలు ఎందుకు తగ్గించడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.పెట్రో రేట్లపై గతంలో అనేకసార్లు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్​కు ప్రజలు  రిక్వెస్ట్​లు పెట్టినా.. ప్రతిపక్షాలు డిమాండ్​ చేసినా.. తమకేమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఏమన్నా అంటే..  ‘‘మేమేమీ పెంచనప్పుడు మేమెందుకు తగ్గించాలె?’’ అంటూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రివర్స్​లో ప్రశ్నిస్తున్నారు. మరి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని జనం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించింది. రాష్ట్రాలను కూడా తగ్గించాలని కోరడంతో.. అనేక రాష్ట్రాలు ఆ మేరకు తమ వ్యాట్​ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లీటర్​ పెట్రోల్, డీజిల్​పై సగటున రూ.10 తగ్గింది. ఫలితంగా  అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలోనే రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్​ అత్యధికంగా తెలంగాణలోనే ఉంది. పెట్రోల్​పై 35.2 శాతం, డీజిల్​పై 27 శాతం చొప్పున వ్యాట్​ను రాష్ట్ర సర్కారు​ వేస్తున్నది. 

స్పందించలే.. తగ్గించలే..!

పెట్రోల్​, డీజిల్​ ధరల్లో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్​లో  అత్యధికంగా లీటర్​ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉండగా.. ఆ తర్వాత తెలంగాణలోనే రూ.109.66గా ఉంది. డీజిల్​ విషయంలోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతున్నది. ఏపీలో లీటర్​ డీజిల్​ ధర రూ.98.27గా ఉండగా.. మన రాష్ట్రంలో రూ.97.82గా ఉంది. డీజిల్​ ధరలు అతితక్కువగా హిమాచల్​ప్రదేశ్​లో ఉన్నాయి. అక్కడ లీటర్​ డీజిల్​ కేవలం రూ.83.36. పెట్రోల్​ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్​.. అక్కడ రూ.95.28కే లీటర్​ పెట్రోల్​ దొరుకుతున్నది. కేంద్రం పిలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలూ పెట్రోల్​, డీజిల్​ రేట్లను గతంలో తగ్గించాయి. తొలుత 2021 నవంబర్​ 3న దీపావళి సందర్భంగా లీటర్​ పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.10ను కేంద్రం తగ్గించింది. ఆ తర్వాత మరోసారి 2022 మే 21న లీటర్​ పెట్రోల్​పై రూ.8,  డీజిల్​పై రూ.6 తగ్గించింది. ఆ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తాను వసూలు చేస్తున్న ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించుకుంది. వ్యాట్​ను రాష్ట్రాలు తగ్గించాలని కేంద్రం కోరింది. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తగ్గించలేదు. 

వ్యాట్​ దంచుడు

పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ విషయంలోనైతే దేశంలోనే తెలంగాణ టాప్​. ఏ రాష్ట్రమూ వసూలు చేయనంతగా పన్నును వసూలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెట్రోలియం ప్లానింగ్​ అండ్​ అనాలిసిస్​ సెల్​ ప్రకారం.. అత్యధిక వ్యాట్​ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే. 35.2 శాతం వ్యాట్​ను బీఆర్​ఎస్​ సర్కారు రాబడుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్​ డ్యూటీ కన్నా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాటే అధికం. లీటర్​ పెట్రోల్​పై కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్​ డ్యూటీ రూ.19.90. రాష్ట్ర సర్కారు లీటర్​ పెట్రోల్​పై వసూలు చేస్తున్న వ్యాట్​ రూ.28.59. అంటే కేంద్రం వసూలు చేస్తున్న దాని కన్నా రాష్ట్ర సర్కారు రూ.8.69 ఎక్కువగా రాబడుతున్నది. ఇక డీజిల్​పైనా ఎక్కువ వ్యాట్​ వేస్తున్న రాష్ట్ర సర్కారు మనదే. 27 శాతం వ్యాట్​తో టాప్​లో ఉంది. పెట్రోల్​పై అతి తక్కువగా వ్యాట్​ విధిస్తున్న రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. అక్కడ కేవలం 13.5 శాతం వ్యాట్​ వేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలనూ లెక్కలోకి తీసుకుంటే అత్యల్పంగా అండమాన్​ నికోబార్​ దీవుల్లో కేవలం ఒక్క శాతం వ్యాట్​ విధిస్తున్నారు.  డీజిల్​పై అతి తక్కువగా వ్యాట్​ వేస్తున్న రాష్ట్రం మిజోరం. అక్కడ 5.23శాతం వేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలనూ లెక్కలోకి తీసుకుంటే అత్యల్పంగా అండమాన్  నికోబార్​ దీవుల్లోనే  ఒక్క శాతం విధిస్తున్నారు. కాగా, కొన్ని రాష్ట్రాలు వ్యాట్​తో పాటు రోడ్​ డెవలప్​మెంట్​ సెస్​, యాంబియెన్స్​ చార్జెస్​, ఎడ్యుకేషన్​సెస్​, ఎంప్లాయీమెంట్​సెస్​, సోషల్​ సెక్యూరిటీ సెస్​ వంటి వాటిని విధిస్తున్నాయి. అయితే, అవి కూడా రూపాయి నుంచి రూ.5 లోపే ఉన్నాయి. పలు రాష్ట్రాలైతే వ్యాట్​ రూ.12ను మించకుండా పన్నును విధిస్తున్నాయి. పెట్రోల్​, డీజిల్​ రేట్లలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. అక్కడ వ్యాట్​ తెలంగాణలో కన్నా తక్కువగా ఉంది. కానీ, ఏపీలో రోడ్​ డెవలప్​మెంట్​ సెస్​ వంటివి  యాడ్​ చేస్తున్నారు. 

20 జిల్లాల్లో రూ.110కుపైగానే పెట్రోల్​ ధర

రాష్ట్రంలో 20 జిల్లాల్లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.110కిపైగానే ఉంది. పది జిల్లాల్లో రూ.111గా ఉంది. అత్యధికంగా ఆసిఫాబాద్​లో రూ.111.87 పెడితేగానీ లీటర్​ పెట్రోల్​ దొరకడం లేదు. డీజిల్​ ధర రెండు జిల్లాల్లో వంద టచ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. డీజిల్​ ధరలోనూ ఆసిఫాబాదే టాప్​లో ఉంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.109.66, డీజిల్​ ధర రూ.97.82గా ఉంది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరగవట్టె

రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ రేట్లను తగ్గిస్తే జనానికి ఎంతో అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలూ కాస్తంత తగ్గుముఖం పట్టే చాన్స్​ ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఉప్పుపప్పుల ధరలు పెట్రోల్​, డీజిల్​ రేట్లపైనే ఆధారపడి ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ రేట్లు తగ్గిస్తే ట్రాన్స్​పోర్టేషన్​ ఖర్చులు తగ్గి.. నిత్యావసర వస్తువులు జనానికి అందుబాటు ధరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పెట్రోల్​, డీజిల్​ రేట్లు అధికంగా ఉండడం వల్లే ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉండేందుకు కారణమైందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి ఆర్బీఐ నివేదికలో వరుసగా మూడు నెలల పాటు ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్​లో ఉంది.