తెలంగాణ జాబ్స్ స్పెషల్.. అలీనోద్యమ రూపశిల్పి

తెలంగాణ జాబ్స్ స్పెషల్..  అలీనోద్యమ రూపశిల్పి

దేశ తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ భారత విదేశాంగ విధానానికి కొన్ని మౌలిక సూత్రాలను రూపొందించి గొప్ప వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రధాన మంత్రులు విదేశీ వ్యవహారాల్లో నెహ్రూ చూపించిన మార్గాన్నే అనుసరించారు. సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక వాస్తవవాద విదేశాంగ విధానాన్ని జవహర్​లాల్​ నెహ్రూ రూపొందించాడు. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, రెండు ధ్రువాల మధ్య రాజకీయ సమీకరణ, సైనిక కూటములు, ఆయుధ పోటీ, సామ్రాజ్యవాదం, వలసవాదం, జాతివివక్ష తదితర పరిస్థితులు విదేశాంగ విధాన రూపకల్పనను ప్రభావితం చేశాయి. వీటిలో కొన్ని కాలక్రమంలో మారినప్పటికీ భారత విదేశాంగ విధాన మౌలిక ఆశయాలు, మూల సూత్రాలు ప్రమాణాలు మారకుండా అలాగే కొనసాగుతున్నాయి.

విదేశాంగ విధానం మౌలిక లక్షణాలు
జాతీయ శ్రేయస్సు
వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత
జాతి విచక్షణా విధానానికి వ్యతిరేకత
అంతర్జాతీయ శాంతి పరిక్షణ
పంచశీల, శాంతియుత సహజీవనం 

పంచశీల: పంచశీల సూత్రాలు భారతదేశ విదేశాంగ విధాన రూపకల్పనలో చాలా కీలకమైనవి. దీనిని జవహర్​లాల్​ నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్​ రైలు రూపొందించారు. వాస్తవానికి పంచశీల సూత్రాలను ఇండియా, చైనాలు 1954లో టిబెట్​పై కుదుర్చుకున్న ఒప్పందంలో భాగం. ఈ పంచశీల సూత్రాల ప్రాతిపదికన రాజ్యాలు తమ విదేశాంగ విధానాలను రూపొందించుకుని ఆచరించాలని ఇండియా, చైనాలు ప్రతిపాదించాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఈ పంచశీల సూత్రాలను ఆచరిస్తే ప్రపంచ శాంతి భద్రతలు పరిరక్షించబడుతాయని భావించారు. 

పంచశీల సిద్ధాంతాలు
సభ్య రాజ్యాల భౌగోళిక సమగ్రత – సార్వభౌమత్వాలను పరస్పరం గౌరవించుకోవాలి.
ఒక రాజ్యం మరో రాజ్యంపై దురాక్రమణ జరపరాదు.
ఒక రాజ్య ఆంతరంగిక వ్యవహారాల్లో మరో రాజ్యం జోక్యం చేసుకోరాదు. 
రాజ్యాల మధ్య సమానత్వం – పరస్పర లాభం
శాంతియుత సహజీవనం
పై ఐదు పంచశీల సిద్ధాంతాలు భారత విదేశాంగ విధాన రూపకల్పనలో మౌలికాంశమయ్యాయి. 

అలీన విధానం
భారతదేశ విదేశాంగ విధానంలో అలీన విధానం చాలా కీలకమైన అంశం. 1947లో మనకు స్వాతంత్ర్యం లభించిన నాటికి అగ్రరాజ్యాలు రెండు కూటములుగా చీలిపోయాయి. భయంకరమైన ఆయుధ పోటీని ప్రారంభించాయి. రెండు ప్రపంచ యుద్ధాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్వక భయంకరమైన అణ్వాయుధ క్షిపణి సైనిక సంపత్తి పెంపొందించుకునే పోటీలో అగ్రరాజ్యాలు పోటీ పడసాగాయి. ప్రపంచ రాజ్యాలన్నీ ఏదో ఒక కూటమిలో చేరాలని ఆశించాయి. ఈ నేపథ్యంతో కొత్తగా స్వాతంత్ర్యం సాధించుకున్న భారతదేశం లాంటి రాజ్యాలు తమ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోవడం ప్రధాన బాధ్యత. తమ ప్రజల సాంఘిక, ఆర్థికాభివృద్ధి తక్షణ కర్తవ్యం. ఈ లక్ష్యాల సాధనకు నూతనంగా స్వాతంత్ర్యం సంపాదించిన రాజ్యాలకు శాంతి సహకారం, సహజీవనం అవసరం. ఆర్థికాభివృద్ధికి సహాయం అన్ని దేశాల నుంచి కావాలి. ఏదో ఒక కూటమిలో సభ్యులైతే ఆర్థిక సాయం లభించదు. ఉద్రిక్త వాతావరణం, పరస్పర అనుమానాలు, ఆయుధ పోటీలో ఈ పేద దేశాలు తమ స్వాతంత్ర్యాన్ని నిలుపుకోలేవు. అందువల్ల జవహర్​లాల్​ నెహ్రూ నాయకత్వంలో అలీన విధానానికి రూపకల్పన జరిగింది. ఇది భారత విదేశాంగ మౌలిక స్వరూపమైంది. 

రూపకల్పన
అలీనోద్యమం 1961లో రూపుదాల్చింది. 120 సభ్యదేశాలుగా చేరాయి. దీని సమన్వయ విభాగ ప్రధాన కార్యాలయం న్యూయార్క్​లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన పరిణామాల్లో అలీన విధానం ఒకటి. నాటి అంతర్జాతీయ స్వరూప స్వభావాలను నిర్ణయించడంలో అలీన విధానం గణనీయమైన పాత్ర వహిస్తుంది. కేవలం రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని అత్యధిక దేశాల ఆదరణ పొందిన ఈ విధానం ప్రస్తుతం ఒక మహోద్యమ రూపాన్ని సంతరించుకుంది. అలీన విధానం అంటే తటస్థ విధానం కాదు. ఏ అగ్రరాజ్య సైనిక కూటమిలోనూ విలీనం కాకపోవడం మాత్రమే. సైన్యాన్ని వినియోగించడానికి ఈ విధానం వ్యతిరేకం కాదు. ఆత్మ రక్షణకు సైనిక వినియోగాన్ని అలీన విధానం సమర్థిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే జాతీయ స్వాతంత్ర్యం, సమానత్వం, పరస్పర ప్రయోజనాలు ప్రాతితదికలుగా ఉన్న సైనిక కూటముల ఏర్పాటును, వాటిలో విలీనం కావడాన్ని వ్యతిరేకిస్తూ సాంఘిక, రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో పరస్పర సహకారానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే రాజ్యాల స్వతంత్ర విధానమే అలీన విధానం. శాంతి, స్వాతంత్ర్యం, సమానత్వం, న్యాయం, సౌరభౌమత్వం, భద్రత, పరస్పర సహకారం, అభివృద్ధి ఈ విధానంలో నిక్షిప్తమై ఉన్న భావనలు. 

ఉద్యమ ఏర్పాటుకు కృషి చేసిన వారు
జవహర్​లాల్​ నెహ్రూ (ఇండియా)
జోసెఫ్​ టిటో (యుగోస్లోవియా)
అబ్దుల్ నాజర్​ (ఈజిప్టు)
సుకర్నో (ఇండోనేషియా)
అలీనోద్యమ విజయాలు
సామ్రాజ్య వాదం, వలస విధానం, జాతి విచక్షణ విధానాల వల్ల పీడిత రాజ్యాలు అలీనోద్యమం మద్దతుతో స్వాతంత్ర్యం పొందాయి.
అలీన ఉద్యమం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రాజ్యాలకు గుర్తింపు, హోదాను సమకూర్చింది.
ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీ య రాజకీయాలపై విశేష ప్రభావాన్ని కనబరిచాయి.
అలీన ఉద్యమం కొంత మేరకు ప్రాక్​, పశ్చిమ సంఘర్షణలో ఉద్రిక్తతల సడలింపునకు, సయోధ్యతో కూడిన వాతావరణం నెలకొనడానికి తోడ్పడింది.
అలీన దేశాలు ఐక్యరాజ్యసమితితో ఒక బలమైన శాంతి శక్తిగా వ్యవహరిస్తున్నాయి. సమితిలో సుమారు 2/3వంతు అలీన రాజ్యాలే. అంతేకాకుండా ఈ రాజ్యాల లక్ష్యాలు, ఐరాస లక్ష్యాలకు చాలా సాన్నిహిత్యం ఉంది. 

  • నిరాయుధీకరణ పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రపంచ రాజ్యాలు గుర్తించేటట్లు చేయడానికి, నిరాయుధీకరణ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఐరాస నిర్ణయించడానికి కారణం అలీన రాజ్యాలు.
  • అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తమ ఉమ్మడి ఆర్థిక, రాజకీయ, పర్యావరణ ప్రయోజనాల కోసం అనేక అంతర్జాతీయ వేదికలపై మూడో ప్రపంచ దేశాలుగా తమ గళాన్ని వినిపించడానికి అలీనోద్యమాన్ని వినియోగించుకున్నాయి.
  • నామ్​ అనే పదాన్ని మొదటిసారిగా వి.కె.కృష్ణమీనన్​ ఉపయోగించారు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్​ అనే నామ్​ నగరంలో నిర్వహించిన సదస్సులో భారత ప్రధాని సూచన మేరకు నామ్​ రూపకల్పన జరిగింది.  బాండుంగ సదస్సులో జవహర్​లాల్​ నెహ్రూ (ఇండియా), సుకర్నో (ఇండోనేషియా), గామర్​ అబ్దుల్​ నాజర్​ (ఈజిప్టు), మార్షల్​ టిటో (యుగోస్లావియా), క్వామేకక్కురు (ఘనా) పాల్గొన్నారు.  నామ్​ సదస్సులు ప్రతి మూడేండ్లకు ఒక్కసారి నిర్వహిస్తారు. ఇందులోని సభ్య దేశాల సంఖ్య 12‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0.  
  • 2012లో అజర్​బైజాన్​, ఫిజీ దేశాలు కొత్తగా సభ్యత్వం పొందాయి.
  • ప్రపంచ జనాభాలో 55శాతం నామ్​ దేశాల్లో నివసిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల్లో 2/3వ వంతు సభ్యదేశాలు నామ్​లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. 
  • నామ్​ కూటమికి ప్రధాన కార్యాలయం లేదు. మొదటి సెక్రటరీ జనరల్​ జోసెఫ్​ టిటో (యుగోస్లోవియా).
  • 1983లో జరిగిన నామ్​ సదస్సుకు భారత​ దేశం అతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. 
  • 18వ నామ్​ సదస్సు 2019 అక్టోబర్​ 25, 26వ తేదీల్లో అజార్​బైజాన్​ (బాకు)లో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు బండుంగ్​– సూత్రాలు అనే థీమ్​తో నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. 
  • 2021, అక్టోబర్​ 11, 12వ తేదీల్లో బెల్గ్రెడ్​లో నామ్​ 60 వార్షికోత్సవం జరిగింది. 19వ నామ్​ సదస్సు 2023లో ఉగాండాలో జరగనుంది.