తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణ జాబ్స్ స్పెషల్

పేదరికం అనేది ఆర్థిక, సామాజిక సమస్య. దేశం పేదరికం తగ్గించడానికి  ఉపాధి కల్పనకు భారత ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టింది. ఇందులో గ్రామీణ ఉపాధి పథకాలు ముఖ్యమైనవి. వేతన ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి పథకాలు ద్వారా పేదరిక నిర్మూలన కోసం తీవ్ర ప్రయత్నం జరిగింది.  

వేతన ఉపాధి పథకాలు

నైపుణ్యం లేని వ్యక్తులకు వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధినందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికపై అవస్థాపనా సౌకర్యాల నిర్మాణానికి ఉద్దేశించినవే వేతన ఉపాధి పథకాలు 

ఎఫ్​డబ్ల్యూపీ(ఫుడ్​ ఫర్​ వర్క్​ ప్రోగ్రామ్​):  1977–78లో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధినందించి శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో ఆస్తులు సృష్టించేందుకు ఫుడ్​ ఫర్​ వర్క్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. 1980లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ పథకాన్ని పునర్ నిర్మించి ఎన్​ఆర్​ఈపీగా పేరు మార్చింది. 

ఎన్​ఆర్​ఈపీ(నేషనల్​ రూరల్​ ఎంప్లాయిమెంట్​ ప్రోగ్రామ్​): 1980లో పూర్వమున్న పీడబ్ల్యూపీని పునర్నిర్మించి ఎన్​ఆర్​ఈపీగా మార్చారు. దీనికి కేంద్ర, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నిధులందిస్తాయి. ఉద్యమిత్వ లక్షణాలు లేనివారికి ఉపాధిని అందించడం, సామాజిక ఆస్తులను సృష్టించుటయే దీని లక్ష్యం. తర్వాత కాలంలో ఇది జేఆర్​వైలో విలీనమైంది. 

ఆర్​ఎల్​ఈజీపీ(రూరల్​ లాండ్​లెస్ ఎంప్లాయిమెంట్​ గ్యారంటీ ప్రోగ్రామ్​): గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలకు 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో 1983 ఆగస్టు 15న దీనిని ప్రారంభించారు. అవస్థాపనా సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. దీనికి నిధులు మొత్తం కేంద్రమే భరించగా రాష్ట్రాలు అమలుపరుస్తాయి. తర్వాత కాలంలో జేఆర్​వైలో విలీనమైంది. 

జీఆర్​వై(జవహర్​ రోజ్​గార్​ యోజన): ప్రభుత్వం జవహర్​లాల్​ నెహ్రూ రోజ్​గార్​ యోజన అనే నూతన ఉపాధి పథకాన్ని 120 వెనుకబడిన జిల్లాల్లో ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఎన్​ఆర్​ఈపీ+ఆర్​ఎల్​ఈజీపీల లక్ష్యం ఒకే విధంగా ఉండటంతో ఈ రెండింటిని విలీనం చేసి 1989 ఏప్రిల్​లో జేఆర్​వైగా ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర రాష్ట్రాలు నిధులను 80:20 నిష్పత్తిలో సమకూరుస్తాయి. తర్వాత దీని పేరు జేజీఎస్​వైగా మార్చారు. 

ఎస్​జీఆర్​వై(సంపూర్ణ గ్రామీణ రోజ్​గార్​ యోజన): జేజీఎస్​వై+ఈఏఎస్​లను విలీనం చేసి 2001 సెప్టెంబర్​ 25న ఎస్​జీఆర్​వైగా ప్రారంభమైంది. దీనికి కేంద్ర, రాష్ట్రాల నిధుల నిష్పత్తి 75:25 తర్వాతి కాలంలో ఇది ఎన్​ఆర్​ఈజీఎస్​లో విలీనమైంది. 

ఎన్ఎఫ్​ఎఫ్​డబ్ల్యూపీ (జాతీయ పనికి ఆహార పథకం): 2004 నవంబర్​లో ప్రణాళిక సంఘం గుర్తించిన 150 వెనుకబడిన జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. ఆహార భద్రతను అందించడం, గ్రామాల్లో సామాజిక ఆస్తులు సృష్టించడం దీని లక్ష్యం. ఇది ఎన్​ఆర్​ఈజీఎస్​లో విలీనమైంది. 

స్వయం ఉపాధి పథకాలు

ఐఆర్​డీపీ(సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం): ఎస్​ఎఫ్​డీఏ, ఎంఎఫ్​ఏఎల్​ వంటి పథకాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని భావించి 1978–79లో 2300 బ్లాకుల్లో దీన్ని ప్రారంభించారు. 1980 అక్టోబర్​ 2న గాంధీ జయంతి సందర్భంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర నిధులు 50:50. కేంద్ర, రాష్ట్రాల్లో గ్రామీణ మంత్రిత్వశాఖ, జిల్లాల్లో డీఆర్​డీపీ దీన్ని అమలుపరుచాయి. సెరీకల్చర్​, పశుసంపద, చేతివృత్తులు మొదలైన రంగాల్లో స్వయం ఉపాధి అందిస్తారు. ఐదు ఉప పథకాలతో కలిసి ఇది 1999లో ఎస్​జీఎస్​వైలో విలీనమైంది. 

ఎ. టీఆర్​వైఎస్​ఈఎం(ట్రైనింగ్​ ఫర్​ రూరల్​ యూత్​ ఫర్​ సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్​): పేదరికపు దిగువన ఉన్న గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చేందుకు 1979 ఆగస్టు 15న ప్రారంభించారు. ప్రతి సంవత్సరం 2 లక్షల గ్రామీణ యువతకు స్వయం ఉపాధికి కావాల్సిన శిక్షణ అందిస్తారు. అర్హత వయస్సు 18–35 సంవత్సరాలు. కేంద్ర, రాష్ట్ర నిధులు 50:50. వికలాంగులకు, వితంతువులకు వయస్సు మినహాయింపు ఉంది. 1/3వంతు మహిళలు ఉండాలి. 
బి. డీడబ్ల్యూసీఆర్​ఏ( డెవలప్​మెంట్​ ఆఫ్​ వుమెన్​ అండ్ చిల్డ్రన్​ ఇన్​ రూరల్​ ఏరియాస్​) 1982: యూనిసెఫ్​ సహకారంతో 1982లో గ్రామీణ స్త్రీలు, పిల్లల అభివృద్ధికి దీన్ని ప్రారంభించారు. 
సి. ఎండబ్ల్యూఎస్(మిలియన్​ వెల్స్​ స్కీమ్​): 10 లక్షల బావులను తవ్వేందుకు 1988–89లో ప్రవేశపెట్టారు. 
డి. సీఐటీఆర్​ఏ(సప్లయ్​ ఆఫ్​ ఇంప్రూవ్డ్​ టూల్​ కిట్స్​ టూ రూరల్​ ఆర్టిషియన్స్​)1992: గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక నైపుణ్యం గల కళాకారులకు మెరుగైన పరికరాలు అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పనకు ఉద్దేశించబడింది. 

జీకేవై (గంగాకళ్యాణ్​ యోజన): భూగర్భ జలాలను వెలికి తీసేందుకు 1997లో ప్రవేశపెట్టారు. ఎస్​జీఎస్​వై (స్వర్ణజయంతి గ్రామస్వరాజ్​గార్​ యోజన)1999: ఐఆర్​డీపీ దాని అనుబంధ పథకాలైన టీఆర్​వైఎస్​ఈఎం, డీడబ్ల్యూసీఆర్​ఏ, ఎండబ్ల్యూఎస్, సీఐటీఆర్​ఏ, జీకేవైలను విలీనం చేసి 1999 ఏప్రిల్​ 1 నుంచి దీన్ని ప్రారంభించారు. గ్రామీణ పేదలకు ఉద్దేశించిన ఒకే ఒక స్వయం ఉపాధి పథకం. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీ ద్వారా స్వయం ఉపాధిని కల్పించి దారిద్ర్యరేఖకు పైకి తీసుకురావడం దీని ఉద్దేశం. దీనిని 2011లో పునర్నిర్మించి జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (ఎన్​ఆర్​ఎల్​ఎం)గా మార్చారు. దీన్నే ఏజేఈఈవీఐకేఏ అని పిలుస్తున్నారు. దీనిని వాణిజ్య బ్యాంకులు ఆర్​ఆర్​బీల ద్వారా అమలు పరుస్తున్నాయి. ఎంపిక చేసిన గ్రామీణ పేద కుటుంబాల నుంచి ఒక మహిళా సభ్యురాలు ఎస్​హెచ్ జీ  నెట్​వర్క్ కిందికి తీసుకువస్తారు. 

ఎంజీఎన్​ఆర్​ఈజీఎస్​

1993–94 నుంచి 1999–2000 మధ్యకాలంలో గ్రామీణ ఉపాధి వార్షికంగా 0.8శాతం చొప్పున పెరిగింది. శ్రామిక శక్తి అంతకంటే ఎక్కువగా పెరిగింది. ఫలితంగా గ్రామీణ కుటుంబాలు ఆదాయాన్ని పొందడంలో విఫలమయ్యాయి. యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. అంతకుపూర్వం ఉన్న ఎన్​ఎఫ్​ఎఫ్​డబ్ల్యూపీ, ఎస్​జీఆర్​వైలను విలీనం చేసి ఎన్​ఆర్​ఈజీఎస్ చట్టాన్ని 2005 సెప్టెంబర్​లో రూపొందించారు. ఈ చట్టం ఆధారంగా 2006 ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ (బండ్లపల్లి – అనంతపురం జిల్లా)లో దీన్ని ప్రారంభించారు. ప్రారంభంలో వెనకబడిన 200 జిల్లాల్లో అమలు చేసినా రెండో దశలో 2007–08లో 330 జిల్లాలకు, మూడో దశలో 2008 ఏప్రిల్​ 1 నుంచి దేశంలో మిగిలిన 274 గ్రామీణ జిల్లాలకు విస్తరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్​ మినహా మిగిలిన 22 జిల్లాల్లో అమలవుతోంది. 2009 అక్టోబర్​ 2 నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీని పేరు మార్చారు. 

ఈఏఎస్​(ఎంప్లాయిమెంట్​ అష్యురెన్స్​ స్కీమ్​)

ఎడారి, కొండ, క్షామ పీడిత ప్రాంతాల్లో  100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధినందించేందుకు 1993లో దీన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ పనులు లేని కాలంలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ కుటుంబంలో ఇద్దరికి నైపుణ్యం లేని పనుల్లో ఉపాధిని అందిస్తారు. తర్వాత కాలంలో ఇది ఎస్​జీఆర్​వైలో విలీనమైంది. జేజీఎస్​వై( జవహర్​ గ్రామ్​ సమృద్ధి యోజన): జేఆర్​వై పూర్తయిన 11 సంవత్సరాల తర్వాత 1999 ఏప్రిల్​ నుంచి దీన్ని పునర్నిర్మించి జేజీఎస్​వైగా పేరు మార్చరు. శాశ్వత ఆస్తులతో కూడిన గ్రామీణ అవస్థాపనా సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఎస్సీ/ ఎస్టీలకు 22.5శాతం కేటాయింపులుంటాయి.