- తెరిచినవాటిలో ప్రారంభం కాని సేకరణ
- ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారుల అక్రమ దందా
- అగ్గువకే అమ్ముకుంటున్నామని రైతన్నల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: మక్కలకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారులకు ఇచ్చి నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 12.94 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా, 39 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అనుకున్న ప్రకారం అధిక దిగుబడి వచ్చినా.. మార్కెట్‌లో మద్దతు ధర లభించక ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,800 మాత్రమే ధర పలుకుతోంది. వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉండగా, కొనుగోలు సెంటర్లు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోతున్నారు.
పూర్తిస్థాయిలో ప్రారంభం కాని మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా సుమారు 200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, నేటికీ సగం సెంటర్లు కూడా ప్రారంభం కాలేదు. సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, హన్మకొండ తదితర 10 జిల్లాల్లో 75 సెంటర్లు మాత్రమే తెరిచినా, అక్కడ కూడా కొనుగోళ్లు షురూ కాలేదు. ప్రతి మండలానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమలు కాలేదు. “మక్కలు చేతికొచ్చాయి.. ప్రభుత్వం సెంటర్లు తెరవకపోతే ఎంతకాలం ఎండబోసి ఎదురు చూడాలి?” అని రైతులు వాపోతున్నారు.
జోరుగా ప్రైవేటు వ్యాపారుల అక్రమ దందా..
కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో ప్రైవేటు వ్యాపారులు ఇదే అదునుగా జోరుగా అక్రమ దందాకు పాల్పడుతున్నారు. 15 శాతం తేమ ఉన్న మక్కలనే కొనుగోలు చేస్తూ తేమ శాతం ఎక్కువ ఉందని కొర్రీలు పెడుతూ తక్కువ ధరకే కొంటున్నారు. దళారుల సాయంతో అమ్ముకుందామంటే లేనిపోని కొర్రీలు పెడుతూ తక్కువ ధరకే కొనుగోలు చేసి దండుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.1,600 నుంచి రూ.1,700కే అమ్ముకోవాల్సి వస్తోందని దిగులు చెందుతున్నారు. వారం రోజుల్లోగా సెంటర్లు తెరవకపోతే పూర్తిగా నష్టపోతామని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతన్నల్లో అకాల వర్షాల గుబులు
ఒకవైపు మద్దతు ధర లేక, మరోవైపు ఇటీవల వడగళ్లతో కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ వర్షం పడితే ఎండబోసిన ధాన్యం తడిసి నష్టపోవాల్సి వస్తదని ఆందోళన చెందుతున్నారు. “వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు మక్కలు కొనాలి. లేకపోతే పంట మొత్తం దళారుల చేతికి వెళ్లిపోతుంది” అని రైతు సంఘాల నేత బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో సాగు జరిగినప్పటికీ, సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
