ఎస్సీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇయ్యాలె

ఎస్సీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇయ్యాలె
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన వారికి చోటు కల్పించాలి
  • సీఎం రేవంత్​కు తెలంగాణ మాల సంఘాల ఫోరం విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా బాగుపడాలంటే.. ఆ జిల్లా నుంచి గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ మాల సంఘాల ఫోరం సీఎం రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుంచకారి బాలకృష్ణ, పులి మోహన్​ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అన్ని రంగాల్లో వెనుకబడింది. ప్రజలకు విద్య, వైద్య సౌకర్యం, తాగునీరు, రేషన్​ కార్డులు, ఇతర మౌలిక వసతులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆ జిల్లాలోనే ఎక్కువ నివసిస్తున్నారు. అలాంటి జిల్లా అభివృద్ధి చెందాలన్నా.. ప్రజల గోడు వినాలన్నా.. ఆ జిల్లా నుంచి గెలిచిన ఎస్సీ అభ్యర్థికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం అత్యంత ఆవశ్యకం. దీంతో ఆ జిల్లా ప్రజలకు న్యాయం చేసినట్టవుతుంది. 

కేబినెట్​లో తొలుత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్, వరంగల్, కరీంనగర్, మెదక్​ జిల్లాల నుంచి ఎన్నికైన వారికి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్​కు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి కేబినెట్​ బెర్తుల్లో ఆ​ జిల్లాకు కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వండి. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. అదే తరహాలో సీఎం రేవంత్​ రెడ్డి కూడా ఎస్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మాల సామాజిక ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని వారు లేఖలో పేర్కొన్నారు.