తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్

తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్

భట్టి విక్రమార్క మల్లు (మధిర ఎమ్మెల్యే)

జననం : 1961 జూన్ 15
స్వస్థలం : స్నానాల లక్ష్మీపురం గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా
కుటుంబం : తల్లిదండ్రులు అఖిలాండ, మాణిక్యమ్మ, భార్య నందిని.
చదువు : పీజీ

సంతానం : సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య.భట్టి విక్రమార్క సోదరుడు మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు. మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ సభ్యుడు.

రాజకీయ ప్రస్థానం :

  •     1990–92లో పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా, 2000–03 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు.
  •     2007లో ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు.
  •     2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  •     2009 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చీఫ్ విప్‌గా ఉన్నారు.
  •     2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
  •     2019 నుండి 2023 వరకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు.

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్​నగర్ ఎమ్మెల్యే)

జననం : 20 జూన్, 1962
స్వస్థలం : తాటి పాముల, తొండ తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా.
కుటుంబం : తల్లిదండ్రులు నలమాద పురుషోత్తం రెడ్డి, ఉషా దేవి 

భార్య : నలమాద పద్మావతి రెడ్డి,

పిల్లలు : లేరు

చదువు : నేషనల్ డిఫెన్స్ నుండి గ్రాడ్యుయేట్ అకాడమీ, సీనియర్ కమర్షియల్ పైలెట్ హోల్డర్ లైసెన్స్, ఐఏఎఫ్​లో ఫైటర్ పైలట్‌గా పనిచేశారు. ఫ్రంట్‌ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌లలో మిగ్​21, మిగ్​23 విమానాలను నడిపారు. భారత రాష్ట్రపతికి కంట్రోలర్.

రాజకీయ జీవితం : 

  •     1994 కాంగ్రెస్ పార్టీ నుండి కోదాడలో పోటీ చేసి ఓడిపోయారు. 1999-–2004 కోదాడ నుండి 2009- – 2014, 2018, 2023 హుజూర్​నగర్​ ఎమ్మెల్యేగా ఇప్పటిదాకా 6 సార్లు గెలిచారు. 2019 ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
  •     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 610 జీవో చైర్మెన్ గా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్​గా ఏడేండ్లు పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ మెంబర్ గా, పీసీసీ స్క్రీనింగ్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు.

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే)

జననం : 23 మే, 1963 
స్వస్థలం :  బ్రాహ్మణ వెల్లంల, నార్కట్​పల్లి మండలం, నల్గొండ జిల్లా
చదువు : బీటెక్ 
తల్లిదండ్రులు : కోమటిరెడ్డి పాపిరెడ్డి-, సుశీలమ్మ
కుటుంబం : భార్య – సబితరెడ్డి, కూతురు 
అల్లుడు : శ్రీనిధి రెడ్డి, -ప్రణవ్ రెడ్డి.

రాజకీయ ప్రస్థానం :

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1999, 2004, 2009, 2014లో వరుసగా నాలుగు సార్లు నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మొదటిసారిగా 1999లో నల్గొండ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోమటిరెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహా రెడ్డిపై విజయం సాధించగా, 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డిపై గెలుపొందారు. 2009లో సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహా రెడ్డిపై, 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2003 సంవత్సరంలో క్లాక్ టవర్ సెంటర్ లో 11 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 సంవత్సరంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా మొదటి సారి ఓడిపోయారు. ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీకి చెందిన బూర నర్సయ్య గౌడ్ పై విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను 2023 శాసనసభ ఎన్నికల తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా నియమించింది. 2023, సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పించింది. 2023, నవంబర్ 30న జరిగిన ఎన్నికలలో నల్లగొండ ఎమ్మెల్యేగా ఐదో సారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 54,342 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు ఎమ్మెల్యే)

స్వస్థలం : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం
జననం : 1965, అక్టోబర్ 28 
కుటుంబం :  తల్లిదండ్రులు పొంగులేటి రాఘవరెడ్డి, స్వరాజ్యం, భార్య మాధురి, కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె స్వప్ని రెడ్డి.

వ్యాపార జీవితం : 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్ క్రాస్వాల్ నిర్మాణం చేశారు. ఆ క్రాస్వాల్ నిర్మాణంతో 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్​గా మారి అనేక నిర్మాణాలు చేశారు. అలా ఉన్నత స్థితికి ఎదుగుతూ వచ్చారు.

సామాజిక సేవలు :  తల్లిదండ్రుల పేరు మీద పీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి సమయంలో ఉచితంగా తాగునీరు సరఫరా చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, చదువుకునే స్థోమత లేని విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించడం, క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం : 

2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లోకసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014, సెప్టెంబరు 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక, సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశారు. కొంతకాలం తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2016లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. 2018లో ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ ఏడాది జూలై 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగిన జనగర్జన భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరు నుంచి పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెలేగా గెలుపొందారు.

 దామోదర్ రాజనర్సింహా (ఆందోల్ ఎమ్మెల్యే)

స్వస్థలం : బేగంపేట, హైదరాబాద్​
జననం : 5 డిసెంబర్, 1958
కుటుంబం : తల్లిదండ్రులు జానాబాయ్, రాజనర్సింహా, భార్య : పద్మిని, కూతురు : త్రిష
చదువు : ఇంజినీరింగ్​

రాజకీయ ప్రస్థానం :

1989లో అందోల్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది.. 2006లో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మూడోసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గంలో రెండోసారి కేబినెట్ హోదా దక్కించుకున్నారు. ఆ తర్వాత 2010లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి ఉప ముఖ్యమంత్రిగా నిలిచారు. 2023, ఆగస్ట్ 20న దామోదర్ రాజనర్సింహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యారు.

జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్ ఎమ్మెల్యే)

జననం : 10- ఆగస్టు-, 1955
స్వస్థలం : పెద్ద దగడ, వీపనగండ్ల మండలం, కొల్లాపూర్ తాలూకా,
కుటుంబం : తల్లిదండ్రులు శేషగిరిరావు, జూపల్లి రత్నమ్మ, భార్య: జూపల్లి సుజన, కొడుకులు: జూపల్లి వరుణ్, జూపల్లి అరుణ్.
చదువు : బీఏ

రాజకీయ ప్రస్థానం :

1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. -2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. -2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి సివిల్ సప్లై, దేవాదాయ శాఖల మంత్రిగా పని చేశారు. -తెలంగాణ ఉద్యమంలో మంత్రి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. -2012లో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. -2014 టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. -2018లో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. -వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

దుద్దిళ్ల  శ్రీధర్ బాబు(మంథని ఎమ్మెల్యే)

జననం : 30 మే, 1969
స్వస్థలం : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం, ధన్వాడ
చదువు : ఎంఏ, ఎల్ఎల్​బీ
కుటుంబం : తల్లిదండ్రులు శ్రీపాదరావు, జయశ్రీ, భార్య : శైలజా రామయ్యర్ (ఐఏఎస్​), కూతురు అదిత, కొడుకు అనిరుధ్.

రాజకీయ ప్రస్థానం :

1999లో శ్రీధర్ బాబు రాజకీయంలోకి వచ్చారు. తండ్రి శ్రీపాదారావు మృతి తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చంద్రుపట్ల రాంరెడ్డిపై మొదటి సారిగా 15,271 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, 2004లో తెలుగుదేశం అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 42,560 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఆ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ గా, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థి పుట్టమధు పై 13,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ నాటి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, 2010లో పౌర సరఫరాల శాఖ మంత్రితో పాటు, శాసనసభ వ్యవహారాలు, వినియోగదారుల హక్కులతో పాటు తూనికలు కొలతలు, మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు చేతిలో 19,360 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధుపై 16,230 ఓట్ల మెజార్టీ తో గెలుపొంది ప్రతిపక్ష పోషించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 30,787 మెజారిటీతో గెలుపొంది రేవంత్​ రెడ్డి కేబినెట్​లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కొండా సురేఖ (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే)

జననం : 19 ఆగస్టు1965
కుటుంబం : బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తుమ్మ సురేఖ కొండా మురళిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
కూతురు :  సుస్మిత పటేల్, అల్లుడు: అప్పాల అభిలాష్
మనుమరాలు : శ్రేష్ఠ పటేల్ 
మనుమడు :  శ్రీయన్ష్ మురళీకృష్ణ పటేల్
స్వస్థలం : వరంగల్

రాజకీయ ప్రస్థానం :

1995లో గీసుకొండ మండలం నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1999లో వరంగల్ జిల్లా శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మరోసారి శాయంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో పరకాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ తరఫున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున పరకాల నుంచి బరిలో నిలిచి ఓడారు.ఇప్పుడు వరంగల్ తూర్పు నుంచి ఎన్నికయ్యారు. 

ధనసరి అనసూయ (సీతక్క) (ములుగు ఎమ్మెల్యే) 

జననం : 09- జూలై -1971
స్వస్థలం : జగ్గన్నపేట, ములుగు మండలం
కుటుంబం : భర్త దివంగత రాము, కొడుకు : సూర్య, కోడలు : సుష్మాంజలి, మనుమరాలు : అశ్విని

రాజకీయ ప్రస్థానం :

కొన్నాళ్ల పాటు ప్రజా ప్రతిఘటన గ్రూపులలో నక్సలైట్ గా పని చేశారు. తుపాకీ వదిలేసి 2004లో టీడీపీలో చేరారు. 2009 లో తొలిసారి టీడీపీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. 2018లో ములుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి మంత్రి అజ్మీరా చందూలాల్ ని ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023లో ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004 నుంచి 2017 వరకు (టీడీపీ)లో ఉన్నారు. 2017 నుంచి (కాంగ్రెస్ పార్టీ)లో కొనసాగుతున్నారు.

పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్​ ఎమ్మెల్యే)

జననం : 08 మే, 1967
స్వస్థలం : కరీంనగర్
కుటుంబం : తల్లిదండ్రులు సత్తయ్య, మల్లమ్మ, భార్య మంజుల, పిల్లలు పృథ్వి (ఎంస్), ప్రణవ్
చదువు : ఎంఏ, ఎల్ఎల్బీ

రాజకీయ ప్రస్థానం :

1987లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, 1988 నుంచి 2002 వరకు ఎన్ఎస్ యూఐలో వివిధ హోదాల్లో  పని చేశారు. 2002 నుంచి 2003 వరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, 2002 నుంచి 2004 వరకు యూత్ కాంగ్రెస్ మీడియా కో  ఆర్డినేటర్​గా, 2005 నుంచి 2009 దాకా ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా పనిచేశారు. 2009లో కరీంనగర్ లోక్ సభ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు.

 తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం ఎమ్మెల్యే)

జననం : 1953, నవంబర్ 15
స్వస్థలం : ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగుల పల్లి
కుటుంబం : తల్లిదండ్రులు తుమ్మల లక్ష్మయ్య, మాణిక్యమ్మ , సతీమణి భ్రమరాంభ, కొడుకు : తుమ్మల యుగంధర్, కోడలు : దీప్తి, కూతుళ్లు డాక్టర్ జగన్మోహిని, చంద్రిక
చదువు : బీకాం

రాజకీయ ప్రస్థానం :
 

  • 1982లో టీడీపీలో చేరిక 
  •  1985, 1994, 1999లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం. 
  •  ఎన్టీఆర్​ కేబినెట్​లో ప్రొహిబిషన్ ఎక్సైజ్, మేజర్ ఇరిగేషన్ శాఖల మంత్రిగా, చంద్రబాబు కేబినెట్​లో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు.
  •  2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.
  •  2014లో టీఆర్ఎస్​లో చేరిక.. ఎమ్మెల్సీగా ఎంపిక
  •  కేసీఆర్ కేబినెట్​లో రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు 
  •  2016లో పాలేరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో విజయం.
  •  2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ​నుంచి ఖమ్మం ఎమ్మెల్యేగా విజయం.