వ్యూహాత్మకంగా నిజాం సర్కార్​ కథను ముగించిన ఇండియన్​ ఆర్మీ

వ్యూహాత్మకంగా నిజాం సర్కార్​ కథను ముగించిన ఇండియన్​ ఆర్మీ
  • ‘ఆపరేషన్​ పోలో’తో నిజాం సైన్యంపై, రజాకార్లపై మెరుపు దాడులు
  • ఉక్కిరిబిక్కిరై లొంగిపోయిన ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్

1948,  సెప్టెంబర్​ 17.. నిజాం రాచరిక పాలనకు, రజాకార్ల అరాచకాలకు చరమగీతం పాడిన రోజు.. సబ్బండవర్గాల ఉక్కుపిడికిళ్లకు, ఇండియన్​ ఆర్మీ ‘ఆపరేషన్​ పోలో’కు ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ తలవంచిన రోజు.. భారత దేశంలో హైదరాబాద్​ సంస్థానం భాగమైన రోజు. దీన్ని పురస్కరించుకొని ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం శనివారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాయి. అటు పరేడ్​ గ్రౌండ్​, ఇటు ఎన్టీఆర్​ స్టేడియం భారీ సభలకు రెడీ అయ్యాయి. అయితే.. 1948 సెప్టెంబర్​ 13 నుంచి 17 వరకు సాగిన ‘ఆపరేషన్​ పోలో’లో అసలు ఏం జరిగింది? ఐదు దిక్కుల నుంచి చుట్టుముట్టిన యూనియన్ సైన్యాలు ఐదు రోజుల్లో నిజాం 
కథను ఎలా ముగించాయి..? 

మొదటి రోజు (సెప్టెంబర్ 13)
భారత సైనిక దళాలు యుద్ధ ట్యాంకులతో  తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌‌‌‌ రాజ్యంలోకి ఐదు వైపుల నుంచి చుట్టుముట్టాయి. ఒక పటాలం ఉస్మానాబాద్ జిల్లాలోకి ప్రవేశించి మొదట షోలాపూర్–సికింద్రాబాద్ హైవేపై ఉన్న నల్దుర్గ్ కోట దగ్గర దాడి చేసింది. తర్వాత నల్దుర్గ్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఎత్తయిన ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ కంట్రోల్‌‌‌‌కి తీసుకుంది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే.. సైన్యం తుల్జాపూర్ దాటి ఉదయమే  34 కిలోమీటర్లు చొచ్చుకొచ్చింది. నిజాం మిలటరీతోపాటు 200 మంది రజాకార్లు రెండు గంటల పాటు మాత్రమే ఎదుర్కోగలిగారు. తర్వాత చేతులెత్తేసి భారత సైన్యానికి లొంగిపోయారు. అక్కడి ప్రభుత్వ అధికారులు తమ పోస్టులను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెల్లాచెదురుగా పారిపోయారు. ఇండియన్​ యూనియన్ సైన్యపు యుద్ధట్యాంకులను నిలువరించే శక్తిసామర్థ్యాలు తన వద్ద లేవని నిజాం సైన్యంలోని ఉస్మానాబాద్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ మోసిన్ ఖాన్ ఆ జిల్లా కలెక్టర్ మహ్మద్ హైదర్ కు సమాచారమిచ్చారు.  లెఫ్టినెంట్ జనరల్ రుద్ర ఆధ్వర్యంలో మరో సైనిక పటాలం విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ సంస్థానంలో అడుగుపెట్టింది. నిజాం రాజ్యంలోని రెండు అశ్వికదళ యూనిట్లు ఈ సైనిక పటాలంతో భీకర పోరుసాగించాయి. అయినా.. మధ్యాహ్నానికి ఇండియన్​ ఆర్మీ మునగాల వరకు చేరుకుంది. 

రెండో రోజు (సెప్టెంబర్ 14)
ఇండియన్ ఆర్మీలోని ఒక దళం తూర్పున సూర్యాపేట పట్టణానికి చేరుకుంది. అక్కడ వైమానిక దాడులు చేసింది. విజయవాడ నుంచి వచ్చిన ఆర్మీని సూర్యాపేటకు 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న దురాజ్‌‌‌‌పల్లి దగ్గర రజాకార్లు, నిజాం సైనికులు చాలాసేపు ఆపారు. కానీ.. ఓడిపోయారు. నిజాం మిలటరీపై ఇండియన్‌‌‌‌ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు మేజర్ జనరల్ డీఎస్‌‌‌‌ బ్రార్ నేతృత్వంలోని దళం ఔరంగాబాద్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో పడింది. 

మూడో రోజు (సెప్టెంబర్ 15)
Aసూర్యాపేట వైపు నుంచి వస్తున్న దళాలను ఆపేందుకు నిజాం సైన్యం మూసీ నది మీద ఉన్న బ్రిడ్జి‌‌ని కూల్చేసింది. అంతేగాక మూసీ వరదను పెంచేందుకు హిమయత్ సాగర్ గేట్లను తెరిచింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ధ్వంసమైన బ్రిడ్జి స్థానంలో తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించుకుని ఇండియన్‌‌‌‌ ఆర్మీ ముందుకు సాగింది. నార్కెట్‌‌‌‌పల్లి దగ్గర నిజాం సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. 

నాల్గో రోజు (సెప్టెంబర్ 16)
లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆర్మీ తెల్లవారుజామున జహీరాబాద్ వైపు వచ్చింది. బీదర్‌‌‌‌ రోడ్డు జంక్షన్‌‌‌‌ దగ్గరకు రాగానే అనుకోకుండా నిజాం ఆర్మీ దాడులు చేసింది. అయినా.. పొద్దుపోయే టైంకి జహీరాబాద్ దాటి 15 కిలోమీటర్లు ముందుకు ఇండియన్‌‌‌‌ ఆర్మీ చేరుకుంది. ఇదే రోజు మధ్యాహ్నం బ్రిటిష్ ప్రతినిధి సర్ అలెగ్జాండర్ కాడగాన్ అధ్యక్షతన పారిస్ లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భేటీ అయింది. ఇందులో హైదరాబాద్ పై ఇండియన్​ఆర్మీ దాడి అంశమే ఎజెండాగా చర్చించారు. వివిధ దేశాల అభిప్రాయాల మేరకు సమావేశాన్ని సెప్టెంబర్​ 20కి సమావేశాన్ని వాయిదా వేశారు. 

ఐదో రోజు (సెప్టెంబర్​ 17)
నలువైపుల నుంచి వస్తున్న భారత సేనలు ఒకవైపు బీదర్​ పట్టణంలోకి ప్రవేశిస్తాయి. మరోవైపు పశ్చిమం నుంచి వస్తున్న సేనలు హైదరాబాద్​కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల పట్టణానికి చేరుకున్నాయి. తర్వాత కొద్ది సేపటికే హైదరాబాద్​కు అతి సమీపంలోని బీబీనగర్​కు చేరుకోగానే నిజాం సర్కారుకు ఓటమి భయం పట్టుకుంది. మరికాసేపట్లో యుద్ధం ముగుస్తుందని అర్థమైపోయింది. ‘‘నా అంచనాలన్నీ తప్పాయి. పాకిస్తాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. హైదరాబాద్ సైన్యాలు నిస్సహాయ ప్రదర్శన చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమిత భద్రతా మండలి ఇంకా సమావేశం కావాల్సి ఉంది. భారత సైన్యాలు అన్ని వైపుల నుంచి రాజధాని వైపు దూసుకొస్తున్నాయి’’ అని ప్రధాని లాయక్ అలీతో నిజాం చెప్పుకొచ్చాడు. తనూ, తన కుటుంబం పెద్ద ప్రమాదంలో పడ్డాయని ఆయన భావించాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్​ వచ్చిందని అనుకున్నాడు. అనేక తర్జనభర్జనల తర్వాత నిజాం సాయంత్రం 5 గంటలకు రేడియో ద్వారా..  భారత యూనియన్​లో అంతర్భాగమవుతున్నట్లు, కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించారు. భారత సైన్యానికి హైదరాబాద్‌‌‌‌లోకి వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెప్పాడు.  దీంతో ‘ఆపరేషన్ పోలో’​ ముగుస్తుంది.  

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.. తీగెలను ద్రెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ.. 
–దాశరథి కృష్ణమాచార్య

బండెన్క బండి గట్టి, పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే బోతవ్ కొడకో నైజాము సర్కరోడా..
–బండి యాదగిరి