కోతలు షురూ అయినా..  కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కాలే

కోతలు షురూ అయినా..  కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కాలే
  • కల్లాల్లో వడ్లు పోసి ఎదురుచూస్తున్న రైతులు 
  • ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు
  • అకాల వర్షాలకు పంట ఆగం కాకుండా వెంటనేకొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వానికి అన్నదాతల విజ్ఞప్తి

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు : రాష్ట్రంలో వానాకాలం వరికోతలు మొదలైనా ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాలేదు. దీంతో రైతులు కల్లాలు, రోడ్ల మీద వడ్డు ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏటా నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం యాక్షన్ ప్లాన్  సిద్ధం చేసేది. 2021లో అక్టోబర్ 15 నాటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, నిరుడు అక్టోబర్  చివరి నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసారి వానాకాలంలో సాగుచేసిన వరి పంట ఒకవైపు కోతకు వస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో సొసైటీలకు చెందిన సెంటర్లను ఇప్పటికీ శుభ్రం చేయలేదు. దీంతో కోసిన ధాన్యం ఎక్కడ పోసుకోవాలో తెలియక రైతులు తమ ఇండ్ల సమీపంలో దించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్  కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం, అధికారులు ఎక్కువగా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో జాప్యం జరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేతికందిన పంట అకాల వర్షాలకు ఆగం కాకముందే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. 

అంచనాలను మించిన వరి సాగు విస్తీర్ణం

ఈసారి సీజన్  ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు పడిపోతుందని అధికారులు భావించారు. కానీ, ఈ సీజన్ లో సాధారణ వరిసాగు 49.86 లక్షల ఎకరాలైతే ఈసారి అంతకుమించి 55.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. నిరుడు వానాకాలంతో పోలిస్తే ఈసారి వరిసాగు పెరగడం విశేషం. వరిసాగు విస్తీర్ణంతోపాటు అదే స్థాయిలో వరి ధాన్యం దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 7,024 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.13,759 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్  టన్నుల ధాన్యం సేకరించారు. ఈసారి రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్  జిల్లాతోపాటు చాలా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో  రైతులకు తిప్పలు తప్పడం లేదు.

తరుగు పేరిట దోపిడీ ఆగేనా? 

ప్రతి సీజన్ లో మట్టి, తాలు, తేమ ఉందంటూ తరుగు పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్  మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాను తరుగు పేరిట 43, 44 కేజీల ధాన్యం వేసి కాంటా వేస్తున్నారు. ఇలా ఒక క్వింటాకు ఏడున్నర నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారు.

ఆ తర్వాత రైస్  మిల్లులకు వెళ్లాక రైతుకు రావాల్సిన మొత్తం డబ్బుల్లో బస్తాల సంఖ్యను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల దాకా కోత పెడుతున్నారు. ఏటా ఇదే అంశంపై గొడవలు జరుగుతున్నా తరుగు దోపిడీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. రైస్  మిల్లర్లకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ఇలా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు ఉన్నాయి.

నష్టానికే అమ్ముకుంటున్నరు..

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.143 పెంచింది. దీంతో ఏ గ్రేడ్ ధాన్యం రూ.2,060 నుంచి రూ.2,203కు, నార్మల్  గ్రేడ్  ధాన్యం రూ.2,040 నుంచి రూ.2,183కు చేరింది. వరి కోతలు స్టార్ట్  అయినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడంలో అధికారులు చొరవ చూపకపోవడంతో రైతులు గత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దళారులు, మిల్లర్లకు తమ ధాన్యం అమ్ముకుంటున్నారు. రూ.1800 నుంచి రూ.1900 వరకే దళారులు ధర నిర్ణయించడంతో క్వింటా మీద దాదాపు రూ.2‌‌‌‌00 నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాలు వడ్లతో నిండిపోతున్నాయి. కేంద్రాలు ప్రారంభించిన తర్వాత కూడా తాలు తడి అంటూ మరిన్ని రోజులు జాప్యం చేస్తారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎలాంటి షరతులు  పెట్టకుండా ధాన్యం తూకం వేయాలి. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 10 రోజులు అవుతున్నది. రోజుల తరబడి ధాన్యంకుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాం. వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. 

జాలి శ్రీనివాస్ రెడ్డి, రైతు, గన్నేరువరం