
- సెర్ప్ ఆధ్వర్యంలో రుణాలు
- నిర్వహణ, మార్కెటింగ్‌పై ఇక్రిశాట్ ద్వారా ట్రైనింగ్
- సెర్ప్ ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం
- త్వరలోనే యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం
- రెండేండ్లలో నిర్మించేలా ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక చేయూత అందిస్తున్నది. అవకాశం ఉన్న ప్రతి రంగంలో వారిని ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే మహిళలకు పారిశ్రామికవాడల్లో 10 శాతం ప్లాట్లు కేటాయిస్తుండగా.. తాజాగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లనూ కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రణాళిక రూపొందించింది. ఆసక్తి ఉన్న మహిళలు ఈ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం కల్పిస్తున్నది.
సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహకారం అందించనున్నది. ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-అరిడ్ ట్రాపిక్స్) సాంకేతిక సహకారంతో యూనిట్లు ఏర్పాటు చేయనున్నది. ఆగ్రో ప్రాసెసింగ్యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి చెంతకు చేరింది. అక్కడి నుంచి అనుమతులు రాగానే యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు
కసరత్తు చేస్తున్నారు.
మహిళలకు మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వం మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు వ్యాపార రంగంలో మెళకువలు నేర్పిస్తున్నది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణతోపాటు ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలను మహిళలకు అప్పగించనున్నది. ఇక్రిశాట్ సాంకేతిక సహకారంతో యూనిట్ల ఏర్పాటు, ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాణ్యత, ఉత్పత్తులు తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మహిళల ఉత్పత్తులను వివిధ మార్కెట్లతో అనుసంధానం చేయనున్నారు. స్థానికంగా విక్రయించడంతోపాటు ఈ- కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మార్కెట్లకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో వేలాదిమంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
జిల్లాల్లో పండే పంటల ఆధారంగా..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యూనిట్లను విస్తరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న మహిళల నుంచి యూనిట్ల ఏర్పాట్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి సెర్ప్ ఆధ్వర్యంలో రుణ సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సీజీటీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఒక్కో ఆగ్రో యూనిట్‌కు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే ప్రాంతాలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బలంగా ఉన్నచోట వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండేండ్లలో వీటిని నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పంటల ఆధారంగా ఆగ్రో పరిశ్రమ స్థాపనకు ఆఫీసర్లు ప్రతిపాదనలు రెడీ చేశారు.