టార్గెట్ 18 కోట్ల మొక్కలు!.. జులై మొదటి వారంలో వన మహోత్సవానికి శ్రీకారం

టార్గెట్ 18 కోట్ల మొక్కలు!..  జులై మొదటి వారంలో వన మహోత్సవానికి శ్రీకారం
  • మున్సిపల్ శాఖకు​ 8 కోట్లు, పంచాయతీరాజ్​కు 7 కోట్ల మొక్కల టార్గెట్ 
  • నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు 
  • మొక్కల పెంపకంలో విద్యార్థుల భాగస్వామ్యం 

హైదరాబాద్, వెలుగు: పచ్చదనాన్ని పెంచే ‘వన మహోత్సవం' కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది టార్గెట్ ను ఫిక్స్​ చేసింది. 11వ విడతలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నది.  గ్రీన్ తెలంగాణే లక్ష్యంగా  ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయగా.. జులై మొదటి వారంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నది. ఈ ఏడాది వన మహోత్సవంలో మొత్తం18.03 కోట్ల మొక్కలు.. 2026లో 16.06 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాలను నిర్దేశించింది. 

కాగా, 2024 వనమహోత్సవంలో భాగంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ విధించగా.. 18.66 కోట్ల (93 శాతం) మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం నాటికి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. 

ఈ మేరకు మొక్కల పెంపకం తీరు, నాణ్యతను ప్రత్యేక టీమ్​లు పర్యవేక్షిస్తున్నాయి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఆక్సిజన్ ఎక్కువగా అందించే రావి, కానుగ, వేప తదితర మొక్కలను నాటేలా కసరత్తు చేస్తున్నది. కాగా, రాష్ట్రంలో ఈ సారి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 89 లక్షలు.. అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాకు 10 లక్షలు మొక్కలు నాటేందుకు ప్రభుత్వం టార్గెట్ విధించింది.    

కేంద్ర ప్రోగ్రాంతో కలిపి.. 

గతేడాది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత (పదో విడత) వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. ఇప్పుడు రెండో ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమ్మ పేరిట ఒక చెట్టు' కార్యక్రమంతో కలిపి వన మహోత్సవాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. 

ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నది. ప్రజలు, రైతులు అడిగిన మొక్కలు ఇచ్చేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 

ఆయా శాఖలకు టార్గెట్లు ఇలా.. 

వానలు మొదలుకాగానే జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా శాఖలు ఎన్ని మొక్కలు నాటాలన్న దానిపై టార్గెట్ ఖరారు చేశారు. అత్యధికంగా మున్సిపల్ శాఖకు 8 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 7 కోట్ల మొక్కలు నాటే బాధ్యతను అప్పగించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 4.50 కోట్లు, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్​చైర్మన్ (టీఎస్​ఎఫ్​డీసీ)​, ఫారెస్ట్ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటాలని నిర్దేశించారు. 

ఆర్​అండ్ బీ, ఆర్టీసీ, ఎన్​హెచ్ఏఐ, ట్రాన్స్ పోర్ట్ శాఖలకు 31.84 లక్షలు, విద్యుత్ శాఖ, సింగరేణి ఆధ్వర్యంలో 25 లక్షలు, నీటిపారుదలశాఖకు 10 లక్షలు, అగ్రికల్చరల్, మార్కెటింగ్, హార్టికల్చర్, సెరీకల్చర్, సహకారశాఖలకు  కోటి, రెవెన్యూ, ఎక్సైజ్, ఎండోమెంట్ శాఖలకు 27.50 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. అలాగే పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖలు, డిఫెన్స్, మిలటరీకి 8 లక్షలు, విద్యాశాఖకు 4.51 లక్షలు, పశుసంవర్ధక, అనుబంధశాఖలకు 1.53 లక్షలు, ఇండస్ట్రీస్, ఐటీసీ14 లక్షలు, భూగర్భగనుల శాఖకు  2.50 లక్షలు, ఆరోగ్య శాఖ 73 వేలు,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 52 వేలు, సోషల్ వెల్ఫేర్ (ఎస్సీ, బీసీ) 72 వేలు,  ట్రైబల్, ఐటీడీఏ 2.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. టూరిజం, కల్చరల్, యూత్ అండ్ స్పోర్ట్స్ 10 వేలు, సివిల్ సప్లయ్స్ 19 వేలు, కార్మికశాఖ 8 వేలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 10 వేలు, రైల్వేశాఖ 23 వేలు, ఇతర శాఖల ఆధ్వర్యంలో 1.62 లక్షలు మొక్కలు నాటేలా టార్గెట్లు పెట్టారు.  

ఒక విద్యార్థి.. ఒక మొక్క..  

వన మహోత్సవంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఒక మొక్కను నాటేలా ‘ఒక విద్యార్థి.. ఒక మొక్క’ నినాదంతో  ముందుకెళ్తున్నది. నాటిన మొక్కలకు నీరు పోయడంతోపాటు సంరక్షణ బాధ్యతలు కూడా పకడ్బందీగా చేపట్టనున్నారు.

 పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. పర్యావరణ క్లబ్‌‌‌‌‌‌‌‌లు, ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ వంటి విద్యార్థి సంస్థలను కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు నిర్వహించనున్నారు.

 వన మహోత్సవంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు, పాఠశాలలకు సర్టిఫికెట్లు, బహుమతులు ఇవ్వనున్నారు. విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లు’గా ప్రోత్సహించనున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేయనునున్నారు. విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా వన మహోత్సవం ఒక సామాజిక ఉద్యమంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.