న్యూఢిల్లీ: ఇటీవలే తమ టారిఫ్‌లను/రీచార్జ్ రేట్లను 20–25శాతం పెంచిన టెలికాం కంపెనీలు 5జీ సేవలను మొదలుపెట్టాక మరోసారి ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెట్వర్క్ తేవడానికి భారీగా ఖర్చు అవుతుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ ఏడాదిలోనే 5జీ లాంచ్ ఉంటుంది కాబట్టి టారిఫ్ పెంపు 2022 చివరి నాటికి జరిగే అవకాశం ఉంది. టెలికాం పరిశ్రమ అప్పుల స్థాయి ఎక్కువగానే ఉంది కాబట్టి టారిఫ్‌ల పెంపు తప్పదని ఇక్రా ఎనలిస్టు ఒకరు అన్నారు. ఈ సంస్థ అంచనాల ప్రకారం.. టెలికం ఇండస్ట్రీల లోన్లు వచ్చే మార్చి నాటికి రూ. 4.7 లక్షల కోట్లకు చేరుతాయి. ఇటీవలి ధరల పెంపు వల్ల పరిశ్రమకు మేలు జరిగిందని ఫిచ్ రేటింగ్స్‌లోని కార్పొరేట్ సీనియర్ డైరెక్టర్ నితిన్ సోనీ చెప్పారు. "ఎయిర్‌టెల్, జియో వద్ద తగినంత డబ్బు ఉంది. అయితే వొడాఫోన్ ఐడియాకు ప్రస్తుత పెంపు సరిపోదు”అని ఆయన వివరించారు. మూడు పెద్ద ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 5జీ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పూణె, గాంధీ నగర్‌తో సహా నగరాల్లో ట్రయల్ సైట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో మొబైల్ కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 200 వరకు పెరగాలని, తదనంతరం ఇది రూ. 300లకు పెరగాలని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.
