పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడులో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్ 

పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడులో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్ 
  • ఏపీలో లీటర్ పెట్రోల్​ రూ.111.87, డీజిల్​ రూ.99.61
  • తెలంగాణలో పెట్రోల్​ రూ.109.66, డీజిల్​ రూ.97.82 
  • కేంద్రం సూచనతో వ్యాట్ తగ్గించిన పలు రాష్ట్రాలు 
  • తెలుగు రాష్ట్రాలు మాత్రం తగ్గిస్తలేవ్ 

హైదరాబాద్, వెలుగు: పెట్రోల్, డీజిల్ రేట్లలో తెలుగు రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయి. దేశంలో పెట్రో రేట్లు అత్యధికంగా ఏపీలో ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది. సామాన్యులపై పెట్రో ధరల భారం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి గతేడాది నవంబర్​లో, ఈ ఏడాది మే నెలలో పెట్రోల్,  డీజిల్ పై ఎక్సైజ్​ డ్యూటీ ​తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించింది. చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. బెంగాల్, తెలంగాణ, ఏపీ, కేరళ, జార్ఖండ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు తగ్గించలేదు. ఏపీలో లీటర్ పెట్రోల్​రూ.111.87, డీజిల్​ రూ.99.61 ఉండగా.. తెలంగాణలో రూ.109.66, రూ. 97.82గా ఉందని ఈ నెల 8న కేంద్రం పార్లమెంట్​లో తెలిపింది. కేంద్రం సూచనతో చాలా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించడంతో అక్కడి ప్రజలకు కొంతమేర భారం తగ్గింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తగ్గించకపోవడంతో ఇక్కడ రేట్లు ఢిల్లీ, మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. 

రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ పై రూ.35 పన్ను.. 

రాష్ట్రంలో ప్రతి లీటర్​పెట్రోల్ మీద రూ.35.20, డీజిల్​మీద రూ.27 ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. రాష్ట్రంలో సాధారణంగా వివిధ ఆయిల్‌‌‌‌ కంపెనీల నుంచి బంక్‌‌‌‌లకు ప్రతిరోజు సుమారు కోటి లీటర్ల డీజిల్‌‌‌‌, 40 లక్షల లీటర్ల పెట్రోల్‌‌‌‌ సప్లై అవుతోంది. ఇక ఏపీలో అయితే మనకంటే ఒకట్రెండు రూపాయలు ఎక్కువే పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అటు ఏపీలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఒక్కసారి కూడా వ్యాట్ తగ్గించలేదు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గొద్దనే ఇలా చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.  

జీఎస్టీ పరిధిలోని రానివ్వట్లే.. 

వ్యాట్, ఇతర పన్నులు ఎక్కువగా ఏపీ, తెలంగాణలోనే ఉన్నాయి. ఏపీలో పెట్రోల్​పై 38.82 శాతం, డీజిల్​పై 30.71 శాతం..  తెలంగాణలో 35.20 శాతం, 27 శాతంగా వ్యాట్, ఇతర పన్నుల వాటా ఉంది. ఇక పెట్రోల్ పై తమిళనాడులో 34 శాతం, కర్నాటకలో 30 శాతం, ఒడిశాలో 28 శాతం, ఢిల్లీలో 27 శాతం, యూపీలో 19.36 శాతం ఉంది. బెంగాల్​లో 25 శాతం వ్యాట్​తో పాటు వ్యాట్​పై 20 శాతం అడిషనల్​ట్యాక్స్​ఉంది. ఇలా రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేస్తుండడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేట్లు ఉంటున్నాయి.

లీటర్ పెట్రోల్ ధర రూ.వంద లోపు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, త్రిపుర, మిజోరం, జార్ఖండ్, హిమచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, అరుణాచల్​ప్రదేశ్ ఉన్నాయి. లీటర్ డీజిల్ రూ.95కు పైగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, చత్తీస్ గఢ్ మాత్రమే ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీని పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొస్తే ఇతర పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. పెట్రోల్, డీజిల్ తో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండడంతో అందుకు వ్యతిరేకిస్తున్నాయి.  

రాష్ట్ర ప్రజలపై మరింత భారం..  

ఒక్క పెట్రోల్, డీజిల్ పన్నులు​మాత్రమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం జనంపై ఇతర పన్నుల భారం కూడా మోపింది. రిజిస్ర్టేషన్​చార్జీలు రెండుసార్లు పెంచింది. ఆర్టీఏలో లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచింది. మొత్తంగా 30 శాతం నుంచి 40 శాతం దాకా పన్నులు పెంచింది. ఈ పన్నుల భారం వివిధ ఉత్పత్తులపై పడి, వాటి ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​పై కొంతమేర వ్యాట్​తగ్గించి ఉంటే, ఇతర రేట్లు కూడా కొద్దిమేర తగ్గేవని నిపుణులు అంటున్నారు.