కేంద్రం అండతో బనకచర్లపై ఏపీ దూకుడు!..డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానం

కేంద్రం అండతో బనకచర్లపై ఏపీ దూకుడు!..డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానం
  • ఈ నెల 8 నుంచే అందుబాటులోకి.. 22 వరకు గడువు 
  • ప్రాజెక్టు టెక్నో ఎకనామికల్ అప్రైజల్స్ ఆపే 
  • ఉద్దేశం లేదని తెలంగాణకు కేంద్రం లేఖ
  • పీపీఏ, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర అధికారులు
  • వెంటనే టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ​ప్రాజెక్టు విషయంలో ఏపీ, కేంద్రం ఒక్కటయ్యాయి. ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు కర్నాటక, తాజాగా మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని ఏపీ సీఎం చంద్రబాబు.. తన మిత్ర పక్షమైన బీజేపీ అండతో బనకచర్లపై  వేగం పెంచారు. ఈ క్రమంలో డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెల 8న టెండర్లను పిలిచింది. అదే రోజు నుంచి సంస్థలకు టెండర్​ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది.  ఈ నెల 22న ఉదయం 11 గంటల వరకు టెండర్​డాక్యుమెంట్లను సమర్పించేలా గడువు విధించింది. టెండర్​డిపాజిట్​రూ.7.75 లక్షలుగా పేర్కొన్న ఏపీ.. పని విలువను రూ.9.2 కోట్లుగా వెల్లడించింది. ఈ విషయమై 20 రోజుల క్రితమే తెలంగాణ సర్కార్‌‌కు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్​అప్రైజల్స్​ఇవ్వబోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను కొద్ది నెలల క్రితం కేంద్రానికి ఏపీ సమర్పించింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దంటూ కేంద్ర మంత్రికి సీఎం రేవంత్​ రెడ్డి లేఖ రాయగా, ఈ మేరకు కేంద్రం రిప్లై ఇచ్చినట్టు తెలిసింది.  

పోలవరంపై మహారాష్ట్ర అభ్యంతరం..  

ఏపీ చేపట్టిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టును వరద జలాల ఆధారంగా కడుతున్నట్టు ఏపీ చెబుతున్నదని.. అయితే, ఆ వరద జలాలు ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన జలాలనే మళ్లిస్తారా లేదా అన్నది క్లారిటీ లేదని పేర్కొంది. ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు దీని వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్​మీదుగా పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారు కాబట్టి.. బచావత్​ట్రిబ్యునల్​అవార్డు ప్రకారం ఆ తరలించే జలాల్లో తమకూ వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్​పీఎఫ్ఆర్‌‌పై తాజాగా సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ)కు మహారాష్ట్ర తన అభ్యంతరాలను తెలియజేసింది. పీఎఫ్ఆర్‌‌లో పేర్కొన్న అంశాలపై ఎగువ రాష్ట్రాలు క్రాస్​ఎగ్జామినేషన్​చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. 1978 బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్న 80 టీఎంసీల జలాల్లో కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్నాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున వాటాను కేటాయించిందని గుర్తు చేసింది.

 ప్రస్తుతం ఏపీ పోలవరం ద్వారా ఇప్పటికే 80 టీఎంసీలను మళ్లిస్తున్నదని, పోలవరం బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు మరో 243 టీఎంసీలను మొత్తంగా 323 టీఎంసీలను కృష్ణాకు మళ్లించనుందని పేర్కొంది. కాబట్టి బచావత్​ ట్రిబ్యునల్‌ అవార్డు గతంలో నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం ఆ మళ్లించే జలాల్లోనూ తమకు వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. కేంద్రం పీబీ లింక్‌ ప్రాజెక్టుకు అనుమతిస్తే అవార్డు ప్రకారం తమ వాటా వినియోగించుకుంటామని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఇందులో పొరుగు రాష్ట్రాలతో సంప్రదించాల్సిన పనికూడా లేదని స్పష్టం చేసింది. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించినట్టయితే.. వాటి డీపీఆర్‌ల తయారీకి మార్గదర్శకాలు ఉంటే పంపించాలని, తాము కూడా వరద ఆధారిత ప్రాజెక్టుల డీపీఆర్‌లను పంపుతామని మహారాష్ట్ర తెలిపింది. తమ రాష్ట్రంలోనూ విదర్భ తదితర కరువు పీడిత ప్రాంతాలున్నాయని ఆ లేఖలో గుర్తుచేసింది.

కేంద్రానికి మరోసారి తెలంగాణ ఫిర్యాదు

బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు.. రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగులోనూ పాల్గొన్నారు. ఆనాడు లోపల బనకచర్ల గురించి చర్చ జరగలేదని చెప్పినా..  ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బయట మీడియాతో  బనకచర్లను కట్టితీరుతామని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవహారం డీపీఆర్​తయారీకి టెండర్ల వరకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఈఎన్సీ జనరల్​తాజాగా పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశారు. టెండర్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని డిమాండ్​చేశారు. ఏపీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు చేపడ్తోందని, వరద జలాల కాన్సెప్టే లేనప్పుడు దాని ఆధారంగా ఎలా ప్రాజెక్టును చేపడతారని ప్రశ్నించారు. వెంటనే టెండర్ల ప్రక్రియను ఆపడంతో పాటు ముందుకు వెళ్లకుండా ఏపీని కట్టడి చేయాలని కోరారు.