
8 ట్రక్కులతో షూమర్ వద్ద చొరబాటుకు చైనా ఆర్మీ ప్రయత్నం
మన ఆర్మీ, యుద్ధ ట్యాంకులను చూసి తోక ముడిచిన డ్రాగన్ కంట్రీ
మూడు రోజుల్లో మూడోసారి ఆక్రమణలకు యత్నం
పాంగోంగ్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న మన ఆర్మీ
చైనా అధునాతన కెమెరాలు, నిఘా వ్యవస్థ పెట్టినా మనదే గెలుపు
స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ కెమెరాలు నాశనం చేసిన ఆర్మీ
పెట్రోలింగ్ చేస్తుండగా మైన్ పేలి మన సోల్జర్ ఒకరు మృతి
ఓ వైపు చర్చలు జరుపుతూనే కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్ కంట్రీ. సౌత్ఈస్టర్న్ లడఖ్‌లో ఎల్ఏసీ వద్ద బార్డర్ దాటేందుకు ప్రయత్నించింది. 8 భారీ ట్రక్కుల్లో తమ వైపు నుంచి బయల్దేరిన చైనా సైన్యం.. షూమర్ వద్ద మన సైన్యం, యుద్ధ ట్యాంకుల మోహరింపును చూసి వచ్చిన దారిలోనే తోక ముడిచి వెళ్లింది. మరోవైపు పాంగోంగ్ సరస్సు దక్షిణ తీరం వెంట మన ఆర్మీ పై చేయి సాధించింది. చైనా అధునాతన కెమెరాలు, నిఘా వ్యవస్థను పెట్టినా ఆ ప్రాంతంలోని కీలక కొండ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ల్యాండ్ మైన్ పేలి మన సోల్జర్ ఒకరు చనిపోయారు. ఇదిలా ఉంటే సరిహద్దు తేలేంత వరకు గొడవలు అవుతూనే ఉంటాయని చైనా విదేశాంగ మంత్రి అన్నారు.
న్యూఢిల్లీ: చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించింది. మూడు రోజుల్లో మూడోసారి చొరబాటుకు ప్రయత్నించింది. నిన్నటికినిన్న పాంగోంగ్ సరస్సుకు దక్షిణ తీరాన్ని ఆక్రమించాలని చూసిన డ్రాగన్ సైన్యం.. మంగళవారం సౌత్ఈస్టర్న్ లడఖ్‌లోని షూమర్ ప్రాంతంలోకి వచ్చేందుకు దుస్సాహసం చేసినట్టు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆ ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పి కొట్టిందన్నాయి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో మన ఆర్మీ బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో మన ఆర్మీని చూసిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వెనక్కు తిరిగి వెళ్లిపోయాయి. ఎల్ఏసీ వద్ద చైనా వైపున ఉన్న చెపుజీ క్యాంప్ నుంచి ఆ దేశ సైనికులు 8 ట్రక్కులతో చొరబాటుకు ప్రయత్నించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, మన వైపున ఉన్న సైనికుల మోహరింపును చూసి వచ్చిన దారినే తోకముడిచి వెళ్లిపోయారని చెప్పాయి.
చైనాపై మనదే పై చేయి
పాంగోంగ్ సరస్సు దక్షిణ ప్రాంతం వద్ద మన ఆర్మీనే పై చేయి సాధించింది. అక్కడి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. చైనా ఆర్మీ అధునాతన కెమెరాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినా.. పీఎల్ఏ కన్నా ముందే అక్కడి కొండలను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఆ ఎత్తుల్లో మన సైనికుల మీద నిఘా పెట్టేందుకు పీఎల్ఏ అత్యంత అధునాతనమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని మన ఆర్మీ వర్గాలు చెప్పాయి. మన ఆర్మీ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ కెమెరాలు, నిఘా వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేసిందని చెప్పాయి. ఎలాంటి సిచువేషన్కైనా మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపాయి. స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్, సిక్ లైట్ ఇన్ఫ్యాంట్రీ ట్రూప్స్ ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నాయని, శత్రు దేశాల మిలటరీలపై ఎటాక్ చేసేందుకు పెట్టిన మైన్ పేలడంతో మన సైనికుడు ఒకరు చనిపోయారని వెల్లడించాయి. బీఎంపీ ఇన్ఫ్యాంట్రీ కంబాట్ వెహికల్స్‌తో పాటు యుద్ధ ట్యాంకులను పెద్ద సంఖ్యలో ఇండియన్ ఆర్మీ మోహరించింది. చైనా సైన్యం భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, సైన్యాన్ని మోహరించిన నేపథ్యంలోనే.. ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, స్పాంగూర్ గ్యాప్‌కు దగ్గర్లోని ఆ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. యుద్ధ ట్యాంకులు, ట్రక్కులను తిప్పేందుకు వీలుగా ఇప్పటికే స్పాంగూర్ లేక్ వద్ద చైనా డాంబర్ రోడ్డును కూడా వేసింది.
మీ ఆర్మీని అదుపులో పెట్టుకోండి
ఓ వైపు చర్చలు జరుగుతున్నా.. స్టేటస్ కో ఒప్పందాలు చేసుకున్నా.. వాటన్నింటినీ చైనా తుంగలోకి తొక్కేసిందని విదేశాంగ శాఖ మండిపడింది. ఇలా రెచ్చగొట్టడం ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలకు తూట్లు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా స్టేటస్ కో మార్చాలనుకునే ఇలాంటి చైనా చర్యలను ఇండియా తిప్పి కొట్టిందని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ‘‘మీ ఆర్మీకి క్రమ శిక్షణ నేర్పండి. మీ ఫ్రంట్‌లైన్ ట్రూప్స్‌ను అదుపులో పెట్టుకోండి. ఇంకోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా చూసుకోండి’’ అని హెచ్చరించారు. మొన్నటి దాకా వేరే ప్రాంతాలపై దృష్టి పెట్టిన చైనా.. ఇప్పుడు కొత్త ప్రాంతంపైన కన్నేసిందని, బార్డర్ వద్ద టెన్షన్లను పెంచేందుకు కొత్త చొరబాట్లకు ప్రయత్నించిందని అన్నారు.
రాజ్‌నాథ్ రివ్యూ
టెన్షన్లు పెరుగుతుండడంతో బార్డర్ వద్ద పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష చేశారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణేలు రివ్యూలో పాల్గొన్నారు. చైనా దురాక్రమణలను అడ్డుకునేందుకు సున్నితమైన ఎల్ఏసీ వద్ద సైనిక మోహరింపులను పెంచాలని, అగ్రెసివ్‌గానే ఉండాలని రాజ్‌నాథ్ సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తర్వాత ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లో అధికారులతో ఆర్మీ చీఫ్ కూడా ఈస్టర్న్ లడఖ్‌లోని పరిస్థితిపై సమీక్షించినట్టు తెలుస్తోంది. ఇక, ప్రస్తుత టెన్షన్‌ను తగ్గించేందుకు చుషుల్ వద్ద కమాండర్ స్థాయి అధికారులతో జరుగుతున్న చర్చలు మంచి ఫలితాలివ్వలేదని తెలుస్తోంది.
గొడవలు అయితనే ఉంటయి: చైనా
సరిహద్దు విషయం తేలేవరకు అక్కడ ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. రెండు దేశాలూ చేసుకున్న ఒప్పందాలను అమలు చేయా లన్నారు. చర్చల ద్వారా ఇండియాతో సమస్యను పరిష్కరించుకునేందుకు తామెప్పుడూ రెడీనే అన్నారు. యూరప్ టూర్లో ఉన్న ఆయన.. ఇండియా, జపాన్‌తో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. చైనా ఇండియా మధ్య గొడవపై అన్ని దేశాల దృష్టి పడిందన్నారు. చర్చలతోనే సమస్యకు పరిష్కారం సాధ్యమన్నారు. ‘‘ఉదాహరణకు డ్రాగన్, ఎలిఫెంట్ కొట్టుకోవడం కంటే.. డ్రాగన్, ఎలిఫెంట్ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది. 1+1.. 2 కాదు.. 11. ఇవన్నీ కూడా ఫిలాసఫికల్ వ్యూస్ మాత్రమే. కాబట్టి రెండు దేశాల లీడర్లు ద్వైపాక్షిక సహకారానికి ఓకే అంటే సమస్యకు ఎండ్ కార్డ్ పడుతుంది’’ అని అన్నారు.
ఇదీ మన వాదన
పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఒప్పందాలను పట్టించుకోవట్లేదు. ఆగస్టు 29, 30వ తేదీల్లో బార్డర్ దాటి వచ్చి స్టేటస్ కోను మార్చే ప్రయత్నం చేసింది. చర్చలు నడుస్తుండగానే.. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. పాంగోంగ్ సో లేక్ దక్షిణ తీరం వెంబడి సైనికుల కదలికలను పెంచింది. అయితే మన సైనికులు వాళ్ల ఆటలను సాగనివ్వలేదు.. తిప్పికొట్టారు. మన పోస్టుల వద్ద మరింత కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం . చైనా దురాగతాలను సాగనివ్వబోం. సమస్యలను పరిష్కరించుకునేందుకు చుషుల్ వద్ద కమాండర్ స్థాయి అధికారులతో ఫ్లాగ్ మీటింగ్ జరుగుతోంది.
చైనా ఆరోపణలేంటి ?
ఆగస్టు 31న సరస్సు దక్షిణ తీరం వెంబడి ఇండియన్ ఆర్మీనే బార్డర్ దాటి అక్రమంగా ప్రవేశించింది. పాంగోంగ్ లేక్‌తో పాటు రెక్విన్ పాస్‌ను ఆక్రమించుకునేందుకు చూసింది. మమ్మల్ని అనవసరంగా ఇండియా రెచ్చగొడుతోంది. బార్డర్ వద్ద టెన్షన్లను పెంచుతోంది. మిలటరీ, డిప్లొమాటిక్ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందాలను పట్టించుకోలేదు. ఇండియన్ ఆర్మీ చర్యలను తీవ్రంగా తీసుకుంటున్నాం. చైనా భూభాగానికి సంబంధించినంత వరకు హక్కులను కాపాడుకుంటాం. కౌంటర్ ఇస్తాం. అయితే, బార్డర్ వద్ద శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం.
For More News..