ముఖ్యమంత్రులకు పదవి టెన్షన్!

V6 Velugu Posted on Sep 25, 2021

ఆరు నెలల కాలంలో ఐదు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో కాంగ్రెస్, ఉత్తరాఖండ్ లో బీజేపీ ముఖ్యమంత్రులను మార్చాయి. ఉత్తరాఖండ్ లో అయితే బీజేపీ నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరిని మార్చింది. అలాగే కర్నాటక, గుజరాత్, అస్సాంలోనూ సీఎంల మార్పు జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు దినదిన గండంగా ఉండేది. ఢిల్లీ పెద్దలకు చికాకు కలిగినప్పుడల్లా సీఎంలను మారుస్తూ ఉండేవారు. బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రం చాలావరకు దీర్ఘకాలం కొనసాగుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా సామాజిక, రాజకీయ కారణాలతో సీఎంలను మారుస్తోంది. వరుసగా ముఖ్యమంత్రుల మార్పు కొనసాగుతుండటంతో చాలా రాష్ట్రాల సీఎంలలో అలజడి రేగుతోంది. తమ పదవి ఉంటుందా ఊడుతుందా అనే అభద్రతా భావం నెలకొంది.

జవహర్ లాల్ నెహ్రూ హయాంలో ప్రధానిని ఎదిరించగల బలవంతులు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉండేవారు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిని, కాంగ్రెస్ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత రాజకీయంగా బలమైన ముఖ్యమంత్రులను మార్చేసి, కీలుబొమ్మ సీఎంలను నియమించే సంప్రదాయం మొదలైంది. ఇప్పుడు ఆ ఒరవడిని కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత పలు రాష్ట్రాల్లో బలమైన సామజిక వర్గాలను కాదని, ఇతరులను ముఖ్యమంత్రులుగా చేయడం ప్రారంభించారు. మహారాష్ట్రలో బలమైన నేతలను కాదని దేవేంద్ర ఫడ్నవిస్ ను, హర్యానాలో జాట్ లను కాదని ఖట్టర్ ను, జార్ఖండ్ లో గిరిజనులను కాదని రఘుబార్ దాస్ ను సీఎంలుగా చేశారు. ఉత్తర ప్రదేశ్ లో కూడా ఆ విధంగానే మనోజ్ సిన్హాను సీఎం చేయాలని చూసినా చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. 

రాజకీయ వ్యూహం మార్చిన మోడీ

పశ్చిమబెంగాల్ లో వీధి పోరాటాల్లో రాటుదేలిన మమతాబెనర్జీని అధికారానికి దూరం చేయలేకపోవడంతో ప్రధాని మోడీ రాజకీయ వ్యూహాలను మార్చుకొంటున్నట్లు కనిపిస్తున్నది. బలమైన సామాజికవర్గాలను దగ్గరకు తీసుకురావాలనే వ్యూహం ముఖ్యమంత్రుల మార్పులో కనిపిస్తున్నది. మరోవైపు కేంద్ర కేబినెట్​లో జరిగిన మార్పులను చూసినా చిన్న, చిన్న సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయంగా బలం పొందాలనే ఎత్తుగడే. కర్నాటకలో యడియూరప్పతో సమానమైన ప్రజాదరణ గల నేత లేకపోయినా, వేరే సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేయాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా యడియూరప్ప సూచించిన బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేశారు. అదే విధంగా గుజరాత్ లో పటేల్ ను ఎంపిక చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బలమైన వర్గాల నుంచి ముఖ్యమంత్రులను ఎంపిక చేసినా సొంతంగా బలంలేని వారిని ఎంపిక చేయడం గమనార్హం. 

మరికొందరి మార్పుపైనా ఊహాగానాలు

బీజేపీలో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహన్ గత వారం ఢిల్లీ పర్యటనకు రావడంతో ఆయనకు కూడా ఉద్వాసన పలుకుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చౌహాన్​ ఢిల్లీకి ఎక్కువగా వెళ్లరు. కానీ గత రెండు నెలల్లో ఆయన ఐదుసార్లు ఢిల్లీకి రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు మంత్రులతోపాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలవడంతో మధ్యప్రదేశ్ లో సీఎం మార్పు తప్పదంటూ ప్రచారం సాగుతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాంఠాకూర్ ఇటీవల హఠాత్తుగా ఢిల్లీ రావడంతో అటువంటి వదంతులే వచ్చాయి. దాంతో మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్​ సీఎంలను మార్చే ఆలోచన లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇటువంటి అనిశ్చిత పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నాలు జరిగాయి. సీనియర్ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రతినిధి వర్గాలు లక్నో చేరుకొని, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపారు. యోగిని మార్చితే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని గ్రహించి ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ కనుసన్నల్లోనే ఇప్పుడు పార్టీ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారానికి ఆమడ దూరంలో ఉంచడంలో బీజేపీ విజయం సాధించినా, రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ విధానాలనే ఇప్పుడు కమలనాథులు కూడా అనుసరిస్తున్నారు. రాజకీయ, సామాజిక కారణాలు ఏవైనా కూడా వరుసగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ మార్పులు పనికి వస్తాయని అటు కమలనాథులు, ఇటు కాంగ్రెస్​ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే వీరి అంచనాలు ఎంత వరకూ నిజమవుతాయో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

పంజాబ్​లో కాంగ్రెస్​ గ్యాంబ్లింగ్

దేశం మొత్తం మీద వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలవగలిగేది పంజాబ్ లో మాత్రమే అని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అక్కడ సీఎం అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్​ మార్చడం ఆత్మహత్యా సదృశ్యం లాంటిదే. దేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రభ తగ్గుతున్నా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయం అందించిన అమరీందర్ వంటి బలమైన నేతలు ఉండడం తన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదకరమని రాహుల్​ ఆందోళన చెందుతున్నారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లట్ ను ఇలాగే గద్దె దింపేందుకు సచిన్ పైలట్ ను ఆయుధంగా ఉపయోగించుకొని ప్రయత్నిస్తే ఎదురుతిరిగింది. కానీ, పంజాబ్ లో స్థిరమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించని నవజ్యోత్ సింగ్ సిద్ధూను ప్రోత్సహిస్తూ అమరీందర్ ను గద్దె దింపడంతో కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంగా మారింది. పాకిస్తాన్ అధినేతలతో స్నేహం నెరుపుతున్న సిద్ధూను ప్రోత్సహించడం పట్ల మాజీ సైనికుడైన అమరీందర్ నిప్పులు చెరుగుతున్నారు. అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. ‘మీ పిల్లలను కొందరు పక్కదారి పట్టిస్తున్నారు’ అంటూ నేరుగా సోనియాను అమరీందర్ సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తున్నది. మరోవైపు చత్తీస్​గఢ్​లో రెండున్నరేండ్ల తర్వాత సీఎంను మారుస్తానని హామీ ఇచ్చిన రాహుల్ ఇప్పుడు ఆ విషయమై మౌనం వహిస్తున్నారు. రాష్ట్రాల్లో ఎక్కడా బలమైన నాయకులు ఉండకూడదన్నదే ఆయన విధానంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి కొండంత అండగా ఉంటున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. గతంలో తన సమస్యలు చెప్పుకోవడానికి ఏడాది పాటు రాహుల్ అపాయింట్​మెంట్​ కోసం ఎదురుచూశారు. కానీ అది దక్కకపోవడంతో బీజేపీలోకి వెళ్లి ముఖ్యమంత్రి పీఠం సాధించారు.

:: చలసాని నరేంద్ర, పొలిటికల్ అనలిస్ట్

Tagged Bjp, Congress, modi, chief ministers, CM change, states a

Latest Videos

Subscribe Now

More News