
ఇయ్యాల్టి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
హాజరు కానున్న 4.94 లక్షల మంది స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. 13 వరకు కొనసాగే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా ఎగ్జామ్స్ జరగనున్నాయి. నిర్ణీత టైమ్‌కు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నారు. 9.35 తర్వాత సెంటర్లోకి ఎవ్వరిని అనుమతించ మని అధికారులు ప్రకటించారు. స్టేట్ వైడ్‌గా 11, 456 స్కూల్స్‌కు చెందిన 4,94,620 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌కు హాజరవుతుండగా, వారిలో 4,85, 826 మంది రెగ్యులర్ స్టూడెంట్లున్నారు. వీరిలో అమ్మాయిలు 2,41,974 మంది, అబ్బాయిలు 2,43,852 మంది ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 72,403 మంది, రంగారెడ్డిలో 48,422 మంది, మేడ్చల్‌లో 44,008 మంది స్టూడెంట్లు పరీక్ష రాస్తున్నారు. అత్యల్పంగా ములుగులో 3,174 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 3,660 మంది హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 31 సెంటర్స్ ప్రైవేటు, వన్స్ ఫెయిల్డ్ స్టూడెంట్ల కోసం పెట్టారు. 2,652 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 2,652 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 34,500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను అపాయింట్ చేశారు.
ఇక నుంచి ఆరు పేపర్లే
పదో తరగతిలో 11 పేపర్లతో కాకుండా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. సైన్స్, కాంపోజిట్ కోర్సు ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల దాకా పరీక్షలు కొనసాగనున్నాయి. సైన్స్‌లో ఫిజిక్స్, బయోలజీలకు వేర్వేరుగా క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు ఇవ్వనున్నారు. కాగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. సీఎస్ రూముల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్టూడెంట్లతో పాటు సిబ్బంది కూడా సెంటర్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుపోవద్దని సూచించారు.