బిట్‌కాయిన్‌ వైపు టెర్రరిస్టులు

బిట్‌కాయిన్‌ వైపు టెర్రరిస్టులు
  • ఎవరికీ దొరికే చాన్స్‌ లేకపోవడంతో ట్రాన్సాక్షన్లు
  • ఏటా రూ. ఏడు వేల కోట్ల వరకు లావాదేవీలు
  • మున్ముందు ఎక్కువవుతుందంటున్న అమెరికా

టెర్రరిస్టు గ్రూపులకు డబ్బులు వెళ్లకుండా అనేక దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అనుమానమొస్తే లావాదేవీల కూపీ లాగుతున్నాయి. అక్రమ లావాదేవీలు చేస్తున్న అకౌంట్లను ఎక్కడికక్కడ లాక్‌‌ చేస్తున్నాయి. అయినా ఉగ్ర సంస్థలకు డబ్బులు రావడం మాత్రం ఆగడం లేదు. వాటి కార్యకలాపాలు ఆగిపోవడం లేదు. మరి డబ్బులు ఎట్లా వస్తున్నట్టు? అంటే ఉగ్ర సంస్థలు డిజిటల్‌‌ మనీకి మారిపోయాయి. బిట్‌‌కాయిన్‌‌ వంటి క్రిప్టోకరెన్సీలను వాడుతున్నాయి.

అన్నివైపులా కట్టడి చేయడంతో..

గతేడాది ముందువరకు సంప్రదాయ పద్ధతులనే టెర్రరిస్టులు వాడారు. హై ఎండ్‌‌ టెక్నాలజీ కావడంతో బిట్‌‌కాయిన్ల జోలికి వెళ్లలేదు. పాలస్తీనాలోని గాజా తీరాన్ని కంట్రోల్‌‌ చేస్తున్న హమాస్‌‌.. ఖతర్‌‌ లాంటి దేశాలు కోట్లల్లో సాయం చేస్తుండటంతో ఇబ్బంది లేకుండా కార్యకలాపాలు సాగించింది. సిరియాలోని ఇస్లామిక్‌‌ స్టేట్‌‌.. అది కంట్రోల్‌‌ చేస్తున్న ప్రాంతంలో పన్నులు, ఫీజులు తీసుకుంటూ పని కానిస్తోంది. కానీ ఈజిప్టు సాయంతో గాజాను ఇజ్రాయెల్‌‌ కంట్రోల్‌‌ చేయడంతో పాటు చాలా వరకు డబ్బు టెర్రరిస్టులకు అందకుండా అడ్డుకుంది. దీంతో వీళ్లంతా బిట్‌‌ కాయిన్ల వాడకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

డిజిటల్‌‌ ‘హమాస్‌‌’

మిలిటెంట్‌‌ పాలస్తీనియన్‌‌ గ్రూప్‌‌, హమాస్‌‌కు సంబంధించిన సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను లాక్‌‌ చేసింది. దీంతో వాళ్లు గతేడాది నుంచి డిజిటల్‌‌ మనీ ‘బిట్‌‌ కాయిన్‌‌’లను లావాదేవీలకు వాడుతున్నారు. కొత్తగా కసమ్‌‌ బ్రిగేడ్స్‌‌ వెబ్‌‌సైట్‌‌ను రెడీ చేసి భయం లేకుండా ట్రాన్సాక్షన్స్‌‌ చేస్తున్నారు. పైగా అధికారులకు దొరక్కుండా బిట్‌‌కాయిన్‌‌లను ఎలా ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయాలో ఓ వీడియో చేసి సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేశారు. దీంతో బిట్‌‌కాయిన్లనే మత్తు పదార్థాలు కొనడానికి, మనీలాండరింగ్‌‌ సహా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు టెర్రరిస్టులు బాగా వాడేస్తున్నారు. ఇస్లామిక్‌‌ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు కూడా కొత్తగా బిట్‌‌కాయిన్ల వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నట్టు వివిధ దేశాల తాజా పరిశీలనలో వెల్లడైంది.

బిట్‌‌ కాయిన్లే పంపండి

తమ ఫాలోవర్లు బిట్‌‌కాయిన్ల రూపంలో డబ్బు పంపాలని చాలా వరకు టెర్రరిస్టు సంస్థలు కోరుతున్నాయి. సోషల్‌‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.  ప్రస్తుతం వాళ్లకిది కొత్తగానే ఉంది గానీ, మున్ముందు విపరీతంగా వాడే అవకాశముందని అమెరికా అధికారులు చెబుతున్నారు.దీంతో ఐడెంటిటీ చెక్‌‌తోనే వాటిని ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసేలా దేశాలు నిబంధనలు కఠినం చేస్తున్నాయి. కానీ ఈ కొత్త కొత్త రూల్స్‌‌ను కూడా తట్టుకునేలా ఇప్పటికే ఉగ్ర సంస్థలు టెక్నాలజీ రెడీ చేసుకున్నాయి. దేశాల మధ్య డబ్బు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసుకునే పేపాల్‌‌ లాంటి అకౌంట్ల నుంచి ఇల్లీగల్‌‌ కార్యక్రమాలకు డబ్బు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు. అకౌంట్‌‌ను ఆపేయొచ్చు. క్రిప్టోకరెన్సీ ట్రాన్స్‌‌ఫర్‌‌లో ఇలాంటివేమీ ఉండవు. ఊరు, పేరు ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా బిట్‌‌కాయిన్‌‌ అడ్రస్‌‌ను సృష్టించొచ్చు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారు అధికారులకు దొరక్కుండా ఈ క్రిప్టోకరెన్సీ బాగా ఉపయోగపడుతోంది. ఇలా బిట్‌‌కాయిన్లతో ఎంత అక్రమ వ్యాపారం జరుగుతోందో తెలుసా? ఏటా రూ.7 వేల కోట్లు. చాలావరకు పెద్ద పెద్ద మార్కెట్లు, లింకులను కనుగొని అధికారులు క్లోజ్‌‌ చేస్తున్నా ఎక్కడికక్కడ వ్యాపారం జరుగుతూనే ఉంది.